బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి జిల్లాలో జడ్చర్ల నియోజకవర్గం నుంచి ఎన్నికల శంఖారావం పూరించనున్నారు. 18వ తేదీన నిర్వహించనున్న ‘ప్రజా ఆశీర్వాద సభ’కు బీఆర్ఎస్ నేతలు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. స్థానిక ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి ఇప్పటి కే నియోజకవర్గంలోని అన్ని మండలాల నా యకులతో సన్నాహక సమావేశాలు పూర్తి చేసి.. భారీగా జనసమీకరణ చేయాలని దిశానిర్దేశం చేశా రు. బైక్ ర్యాలీలు, సంప్రదాయ పద్ధతులతో సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలకాలని సూచించారు. వాహనాల ఏర్పాటు, ఇతర పనులను మండల నాయకులకు అప్పగించారు. లక్షలాదిగా ప్రజలు తరలివచ్చేలా పక్కా ప్రణాళిక ఉండాలని సూచించారు. జడ్చర్ల మండలంలోని సమీప గ్రామాల ప్రజలు భారీ ర్యాలీగా మండలాల నాయకులతో కలిసి పాదయాత్రగా రానున్నారు. అలాగే ఈ నెల 26న నాగర్‌కర్నూల్, అచ్చంపేట.., వచ్చే నెల 6న గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారంలో దూసుకుపోతుండగా, విపక్షాల నాయకులు మాత్రం టికెట్ల వేటలోనే ఉన్నారు. దీంతో ఆయా పార్టీల నాయకులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు.
మహబూబ్‌నగర్, అక్టోబర్ 14 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : అసెంబ్లీ ఎన్నికలకు బీఆర్ఎస్ సన్నద్ధమవుతున్నది. పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టబోతున్నారు. ఎన్నికల షెడ్యూల్ ప్రకటించగానే ముఖ్యమంత్రి పర్యటనలు ఖరారయ్యాయి. ముందుగా ఈనెల 18న జడ్చర్ల నుంచి ఎన్నికల శంఖారావానికి శ్రీకారం చుట్టనున్నారు. జడ్చర్ల పట్టణంలో భారీ ఎత్తున నిర్వహించనున్న ప్రజా ఆశీర్వాద సభకు నియోజకవర్గం నుంచి సుమారు లక్ష మంది తరలివచ్చేలా ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి టార్గెట్ పెట్టుకున్నారు. ఇప్పటికే రాజాపూర్, బాలానగర్, మిడ్జిల్, నవాబ్‌పేట, ఉర్కొండ, జడ్చర్ల మండలాల కార్యకర్తలతో విస్తృతస్థాయి సమావేశాలు నిర్వహించారు.
సీఎం సభను విజయవంతం చేయాలని నాయకులు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు. జడ్చర్ల సభ జరిగే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి భారీ ఎత్తున బైక్ ర్యాలీలు నిర్వహించాలని పార్టీ నాయకులు యోచిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో తొలి బహిరంగ సభ కావడంతో పార్టీ శ్రేణులు ఈ పర్యటనను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఇప్పటికే సిట్టింగ్ ఎమ్మెల్యేలకు టికెట్లు కేటాయించడం.. ఆదివారం బీ ఫారా లు అందించనుండడంతో అన్ని పార్టీల కంటే ముందే కారు దూసుకుపోతున్నది. ఇదే జోష్‌తో సీఎం కేసీఆర్ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టడంతో ఉమ్మడి జిల్లాలో ఎన్నికల వేడి మరింత రాజుకున్నది. ఇంకా విపక్షాలు అభ్యర్థుల ఎంపికలో తలమునకలవుతుండగా.. కారు దూసు కుపోతుండడంతో వారి గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. కాగా, ఈ నెల 26న నాగర్‌కర్నూల్, అచ్చంపేట.., వచ్చే నెల 6న గద్వాల, మక్తల్, నారాయణపేట నియోజకవర్గాల్లో సీఎం కేసీఆర్ సభలు నిర్వహించనున్నారు. ఇందుకుకూడా స్థానిక ఎమ్మెల్యేలు ఏర్పాట్లు చేస్తున్నారు.
పక్కా ప్లాన్‌తో క్లీన్‌స్వీప్ దిశగా..
ఉమ్మడి జిల్లాలో మంచి పట్టు మీద ఉన్న బీఆర్ఎస్ పార్టీ పక్కా వ్యూహంతో దూసుకుపోతున్నది. 2018 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలోని అన్ని నియోజకవర్గాలను క్లీన్‌స్వీప్ చేసిన విధంగానే.. 2023 ఎన్నికల్లో కూడా రిపీట్ చేయాలని భావిస్తున్నది. ఈ మేరకు గెలుపు గుర్రాలను ప్రకటించింది. ఎక్కడా అసమ్మతులు, వ్యతిరేకత లేకుండా చేసింది. నాయకుల మధ్య సయోధ్యను కుదిర్చింది. తెలంగాణ వచ్చాక ఉమ్మడి జిల్లా అభివృద్ధి పథంలో పయనిస్తున్నది. ఎమ్మెల్యేలు ఒకరిని మించి ఒకరు నియోజకవర్గాల అభివృద్ధికి కంకణం కట్టుకొని.. ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలును పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. దీంతో ఉమ్మడి జిల్లాలో బీఆర్ఎస్కు ఎదురే లేకుండాపోయింది. ప్రతిపక్షాలకు మాత్రం అభ్యర్థులు దొరకని పరిస్థితి ఏర్పడింది. చాలామంది కాంగ్రెస్, బీజేపీ కార్యకర్తలు ‘కారు’ ఎక్కుతున్నారు. ఈ సారి కూడా గెలుపే లక్ష్యంగా చేసుకొని సీఎం కేసీఆర్ పర్యటన ఖరారు కావడంతో కాంగ్రెస్, బీజేపీలో దడ పుడుతున్నది.
జడ్చర్ల సభపైనే అందరి దృష్టి..
ఎన్నికలకు సరిగ్గా 45 రోజుల సమయం ఉండడంతో.. బీఆర్ఎస్ అధినేత, సీఎం కేసీఆర్ ఈ నెల 18న జడ్చర్ల ప్రజా ఆశీర్వాద సభకు రానున్నారు. దీంతో అందరి దృష్టి ఈ సభపైనే ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్ వ్యూహాత్మకంగా జడ్చర్లను ఎంపిక చేసుకున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఉద్యమ సమయంలో కేసీఆర్‌కు అండదండగా ఉన్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పార్టీ నిర్ణయానికి కట్టుబడి అప్పట్లో రాజీనామా చేసి ఉద్యమానికి ఊతమిచ్చారు. ఆ తర్వాత తెలంగాణ వచ్చాక మంత్రివర్గంలో స్థానం లభించింది. వైద్య, ఆరోగ్యశాఖ మంత్రిగా సీఎం కేసీఆర్ ఆశీస్సులతో వైద్య రంగంలో విప్లవాత్మక మార్పులకు నాంది పలికారు.
అనేక పథకాలను ప్రవేశపెట్టారు. మహబూబ్‌నగర్ జిల్లా దవాఖానలో ఏకంగా ఐసీయూ వార్డులు నెలకొల్పారు. అనేక దవాఖానలను మంజూరు చేసి తనకంటూ ఒక ప్రత్యేకత సాధించుకున్నారు. అందుకే సీఎం కేసీఆర్ 2023 ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో ఉద్యమ నేపథ్యం ఉన్న లక్ష్మారెడ్డి నియోజకవర్గాన్నే ఎంపిక చేసుకున్నట్లు విశ్లేషకులు భావిస్తున్నారు. సీఎం పర్యటన నేపథ్యంలో ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి భారీ ఎత్తున జన సమీకరణ చేస్తున్నారు. మండల, గ్రామస్థాయి నాయకులతో సమావేశమై ముందస్తు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. బైక్ ర్యాలీలు, సంప్రదాయ పద్ధతులతో సీఎం కేసీఆర్‌కు స్వాగతం పలకాలని సూచించారు.
జన సమీకరణ కోసం వాహనాల ఏర్పాటు, ఇతర అంశాలను మండల నాయకులకు అప్పగించారు. ప్రజల్లో ముఖ్యమంత్రి చేపట్టిన కార్యక్రమాలను వివరించి సంక్షేమ పథకాలను అందుకున్న ప్రతి ఒక్కరినీ సమావేశానికి తీసుకురావాలని దిశా నిర్దేశం చేశారు. జడ్చర్ల మండలంలోని సమీప గ్రామాల ప్రజలు భారీ ర్యాలీలతో పాదయాత్రగా వస్తామని ఎమ్మెల్యేకు వివరించారు. ప్రతి మండలం నుంచి బైక్ ర్యాలీలు చేపట్టి జడ్చర్ల పట్టణంలో కలుస్తామని మండల నాయకులు ప్రకటించారు. కాగా, సీఎం పర్యటనకు సంబంధించిన సభాస్థలి ఏర్పాట్లను శనివారం ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి పర్యవేక్షించారు.