ధరణిపై హస్తం నేతలు అక్కసు వెల్లగక్కడంపై కర్షకులు కన్నెర్ర చేస్తున్నారు. పోర్టల్‌తో ధనాధన్‌గా భూ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు జరుగుతుంటే ఆ పార్టీ నేతల కడుపు మండుతుండడంపై భగ్గుమన్నాయి. పటేల్, పట్వారీ వ్యవస్థ తెస్తామని ప్రచారం చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశాయి. పహాణీలతో పూర్తిగా ఆగమయ్యాం.. మళ్లా తీసుకొస్తే భూములు గాయబ్ కావడం, పంచాయితీలు షురూ కావడం ఖాయమని రైతులు వాపోతున్నారు. అప్పటి రాజ్యం వద్దు.. కాంగ్రెస్ నేతలకు ఎవుసం తెల్వదు.. ఏదేదో మాట్లాడుతారు.. తెలంగాణ ప్రభుత్వంలోనే మేము మంచిగున్నామని భూమిపుత్రులు సంతోషంగా చెబుతున్నారు.
వ్యవసాయంపై రేవంత్‌రెడ్డికి.. కాంగ్రెస్ పార్టీ నాయకులకు ఏమాత్రం అవగాహన లేదు. ఎవరికి తోచిన విధంగా వారు మాట్లాడుతున్నరు. వారే గనుక అధికారంలోకి వస్తే రైతును నట్టేట్లో ముంచుడు ఖాయం. గతంలో రైతులకు ఎవరి భూములు ఎక్కడ ఉన్నాయో తెలియక తగాదాలు పడి పోలీస్స్టేషన్లు, కోర్టుల చుట్టూ ఏండ్ల తరబడి తిరిగేటోళ్లు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ భూ సమస్యలను ఒక్కొటిగా పరిష్కరించారు. ధరణి చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామాల్లో భూ వివాదాలకు పూర్తిగా చెక్ పడింది. రైతులు కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరగడం మానుకున్నారు. భూముల అమ్మకం, కొనుగోలు పూర్తి పారదర్శకంగా జరుగుతున్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ధరణి స్థానంలో భూమాతను అమలు చేస్తామంటున్నరు. ఆధునిక పరిజ్ఞానంతో తయారైన ధరణి వెబ్సైట్ తీసేస్తే మళ్లీ భూ సమస్యలు ఎదుర్కొవాల్సి వస్తుంది. దళారులు, ఏజంట్లు పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తారు. భూముల రేట్లు పతనమై పోతాయి. ధరణి ద్వారా మీ సేవ కేంద్రంలో స్లాట్ బుక్ చేసుకున్న వెంటనే రిజిస్ట్రేషన్, పాస్‌బుక్, మ్యుటేషన్ గంటల వ్యవధిలోనే అవుతున్నాయి. కాంగ్రెస్‌కు అధికారమిస్తే పక్కాగా పటేల్, పట్వారీ వ్యవస్థను అమలు చేస్తరు. భూములపై హక్కులను కోల్పోయి రైతులు ఆత్మహత్యలకు పాల్పడే దుస్థితి ఏర్పడుతుంది. రైతు వ్యవసాయం చేతకాక నాలుగైదేండ్లు పొలం కౌలుకు వేస్తే కౌలుదారుడు నాకు భూమిపై హక్కు ఉందంటూ పట్టాదారుడితో గొడవలకు దిగే అవకాశం ఉంటుంది. కోర్టులు, పోలీస్స్టేషన్ల చుట్టూ తిరిగి చివరకు సమస్య పరిష్కారం కాకపోతే దాడులు, ప్రతి దాడులతో రాష్ట్రం మొత్తం రావణ కాష్టమవుతుంది. తెలంగాణ రాష్ట్ర రైతాంగం విజ్ఞతతో ఓటేసి రాష్ర్టానికి సీఎంగా కేసీఆర్‌ను ఎన్నుకోవాలి.
తెలంగాణ సర్కారు అమలు చేస్తున్న ధరణి పోర్టల్‌ను తీసేస్తే మళ్లీ దళారుల రాజ్యం ఏర్పడుతుంది. సీఎం కేసీఆర్ పేదల కోసం ఎంతో ముందు చూపుతో ధరణి పోర్టల్‌ను తీసుకురావడం జరిగింది. ధరణి పోర్టల్‌తో రెవెన్యూ శాఖలో అవినీతి, అక్రమాలు పూర్తిగా తగ్గి పోయాయి. భూ యజమాని ప్రమేయం లేకుండా ఎలాంటి భూ లావాదేవీలు చేయడానికి వీలు లేదు. ఐదు నిమిషాల్లో భూమి రిజిస్ట్రేషన్, మ్యుటేషన్ అన్నీ పూర్తవుతున్నాయి. కాంగ్రెస్ హయాంలో భూమి ఆన్లైన్ చేయాలంటే అవస్థలు పడేటోళ్లం. రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత మ్యుటేషన్ కోసం చెప్పులరిగేలా అధికారుల చుట్టూ తిరిగినా పని అయ్యేది కాదు. డబ్బులిచ్చి రెవెన్యూ అధికారులను వేడుకున్నా ఏండ్ల తరబడి ఫైలు కదలకపోయేది. ఇప్పడు ఎవరికీ డబ్బులు ఇవ్వాల్సిన పనిలేదు. కార్యాలయాల చుట్టూ తిరిగే అవసరం లేదు. ఒక్క వేలి ముద్రతో పని పూర్తవుతున్నది. మళ్లీ అవినీతి పెంచేందుకు కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తామని చెప్పడం విడ్డూరంగా ఉన్నది. గతంలో అవినీతి, అక్రమాలను పెంచి పోషించిన కాంగ్రెస్ నాయకులు మళ్లీ దళారుల రాజ్యానికి ఆజ్యం పోయాలని చూస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ధరణి పోర్టల్ ఉండాల్సిందే.
కాంగ్రెసోళ్లు ధరణి పోర్టల్‌ను తీసేసి రైతులను దోచుకుందామని చూస్తున్నరు. కొత్త పోర్టల్ వస్తే రైతులు రెవెన్యూ కార్యాలయం చుట్టూ తిరగాల్సిందే. పటేల్, పట్వారీ వ్యవస్థలో భూములు తారమారయ్యే అవకాశం ఉంటది. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ధరణి తొలగిస్తామనడం చాలా దారుణం. ధరణి వల్లనే రైతులకు మేలు జరుగుతున్నది. ధరణి స్థానంలో భూమాత తీసుకొస్తామని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల హామీ ఇవ్వడాన్ని ఖండిస్తున్నాం. భూమాతతో రైతు మళ్లీ పాతాళానికి పడిపోవడం ఖాయం. కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులు పడ్డ గోస అందరికీ తెలుసు. గ్యారెంటీ స్వీముల పేరుతో ఎన్నికల్లో గెలిచేందుకు కాంగ్రెస్ కుయుక్తి పన్నుతున్నది. ఈ ఎన్నికల్లో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి బుద్ధి చెప్పాలి. వాళ్లు అధికారంలోకి వచ్చేదిలేదు.. సచ్చేది లేదు.. రైతులు భూ సమస్యలపై రెవెన్యూ కార్యాలయాల చుట్టూ తిరుగకుండా సీఎం కేసీఆర్ ధరణి పోర్టల్‌ను తీసుకొచ్చి మేలు చేశారు. గతంలో అధికారుల చుట్టూ తిరగలేక విసుగొచ్చేది. ఇప్పుడు భూమి కొనడం.. అమ్మడం ఇట్టే జరుగున్నది. పహాణీ కావాలంటే ఆన్లైన్లో క్షణాల్లో తీసుకుంటున్నం. కాంగ్రెసోళ్లు ధరణి తీసేస్తాం అంటున్నారు. మళ్లీ పాత పద్ధతి వస్తే ఇబ్బందవుతుంది. ఎనుకటి లెక్క చేతితో రాసే పట్టాయిలైతే అవకతకలు జరుగుతయి. రైతులు ఆగమవుతరు. ధరణి పోర్టల్‌తో రెవెన్యూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. ధరణిని రద్దు చేస్తే మళ్లీ పాత రోజులే వస్తయ్. గ్రామాల్లో గొడవలు పెరుగుతయ్. రైతులను ఆగం చేసేందుకు చూస్తున్న చేతి పార్టోళ్ల కథ ఇక ఒడిశింది. ధరణి ఉంటనే భూములకు రక్షణ ఉంటది. రైతులెవరూ కాంగ్రెసోళ్ల వైపు చూడరు. కేసీఆర్‌నే సీఎం జేసుకోవాలని చూస్తున్నరు.
60ఏండ్ల సంది రైతుల గురించి ఎవరూ మాట్లాడలే, పట్టించుకున్నోలు కూడా లేరు. తెలంగాణ వచ్చినంక సీఎం కేసీఆర్ సారు రైతుల గురించి ఆలోచించి రైతురాజ్యం తీసుకరావాలనే ఉద్దేశంతో ఎన్నో పథకాలు తీసుకొచ్చిండు. రైతుల కష్టాలను తెలిసినాయన కాబట్టే రైతుల గోస పడకూడదని ఉచిత కరెంట్, రైతుబంధు, రైతుబీమా, సబ్సిడీ ఎరువులు ఇస్తున్నడు. ఇయ్యాల కేసీఆర్ సారు ఇచ్చేసరికి అన్ని పార్టీలకు రైతులు గుర్తుకొచ్చిండ్రు. అంత చేసేటోళ్లు ఇన్నాళ్లు వాలే ఉండ్రి కదా ఎందుకు చేయలేదు? ఇప్పుడు చేసేటోళ్లని చేయనియ్యకుండా కిరికిరిలు పెట్టడం కరెక్ట్కాదు. ఎలచ్చన్ వచ్చేటాలకి ఎక్కడలేని ప్రేమంతా రైతులమీదనే కురిపిస్తుండ్రు. అయినా నాకు తెల్వక అడుగుతున్నా.. ఎవుసం చేయడమంటే ఇంట్ల మ్యాగి చేసుకున్నంత ఈజీ అన్నుకున్నారా కాంగ్రెస్సోళ్లు. ఓం.. ఛూం.. మంతర్ అనే సరికి పంటలు పండుతాయా..! ఊర్లల్లకొచ్చి ఆర్నెళ్లు కాపురముండి ఎకరం భూమిల వరిపంట పండిస్తే తెలుస్తది, పంట పండించాలంటే ఎంత కష్టపడాలన్నది. ఊరికనే విత్తనాలు భూమిల సల్లుతే టైమ్‌కు పంటరాదు. ఆరుగాళ్లం కష్టపడి పగలనకా రాత్రనక, ఎన్నో నిద్రలేని రాత్రులు గడుపుతూ విత్తనాలు వేసిన నుంచి కాపాడుకుంటూ.. సంటి పిల్లలను చూసుకున్నట్ల టైమ్‌కు ఏం ఎం కావాలో అవి ఇచ్చుకుంట, పురుగు, తెగుళ్లు పట్టకుండా అహర్నిశలు కష్టపడి ఎన్నో తిప్పలు పడితేనే పంట చేతికొస్తది. అస్సొంటిది 10 హెచ్‌పీ మోటర్ పెట్టుకోండి, 3 గంటల కరెంట్ సరిపోతది, రైతుబంధు ఊరికె వేస్ట్‌గా ఇస్తున్నారంటూ కాంగ్రెస్సోళ్లు అనడం సరికాదు. నిజంగా రైతుల కష్టాలు తెల్సినోళ్లు ఇలా అనరు. 3 గంటల కరెంట్తోటి ఎన్ని మడులు తడుస్తాయి.. 10హెచ్‌పీ మోటర్లు పెట్టుకుంటే కరెంట్ ఎంతకాల్తది..? పాత బోర్లు తీసేసి కొత్తబోర్లు వేసుకోవాలా..? అస్సలు బోర్లల్ల నీళ్లు ఉంటాయా.. పైపులు ఎక్కడెక్కడ పగిలిపోతాయో.. కరెంట్ వైర్లు కాలిపోవా.. ట్రాన్స్ఫార్మర్లు లోడ్‌ను ఆపుతాయా.. ఊరికే అంటే సరిపోదు. రైతులు బాగుపడడం కాంగ్రెస్ వాళ్లకు ఇష్టంలేకనే గివన్నీ చేస్తుండ్రు. కేసీఆర్ సారు ఎన్నో రకాలుగా ఆలోచించే రైతుల కోసం ఇన్ని పథకాలు పెట్టిండు. రైతులు బాగుపడాలంటే మళ్లీ బీఆర్ఎస్ సర్కారే రావాలి.
తెలంగాణ సర్కారు తెచ్చిన ధరణి ఎంతో బాగుంది. మా భూములు కూడా కిరికిరి లేకుండా భద్రంగా ఉండయి. కాంగ్రెసోళ్లు అధికారంలోకి వస్తే ధరణిని రద్ధు చేస్తామని అంటున్నరు. అలా చేస్తే మళ్లా భూ పంచాయతీలు మొదటికొస్తయి. భూమాత పేరుతో కౌలు రైతుల కాలమ్ చేరిస్తే పట్టాదారు రైతులు నష్టపోతరు. పట్టాదారుడికి, కౌలు రైతుల మధ్య ఎన్నో ఇబ్బందులొస్తయి. నేను ఆరు ఎకరాల భూమిని కౌలుకు ఇస్తాను. కాంగ్రెస్ నాయకులు రైతుబంధు డబ్బులను కౌలు రైతులకే ఇస్తామంటున్నరు. భూ యాజమానికి రైతుబంధు రాకపోతే తీవ్రంగా నష్టం కలుగుతుంది. కాంగ్రెస్ నాయకులు చెబుతున్న మాటలతో రైతుల్లో భయం మొదలైంది. పట్టాదారులకు, కౌలు రైతుల మధ్య గొడవలు పెట్టడానికి కాంగ్రెసోళ్లు ప్రయత్నిస్తున్నరు. భూముని కౌలుకు ఇవ్వకపోతే రైతులు జీవనోపాధి కోల్పోతారు.
తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన ధరణి భూముల రక్షణకు ఎంతో మేలుగా ఉంది. గతంలో భూమి హక్కులు సరిగా లేక ఎన్నో గొడవలైనయి. సొంత భూమి ఇతరులకు పట్టా చేద్దామంటే జిల్లా కేంద్రంలోని రిజిస్ట్రేషన్ కార్యాలయానికి రోజుల తరబడి తిరగాల్సి వచ్చేది. మధ్య దళారుల దందాతో అనేక అవస్థలు పడ్డాం. నేడు నిముషాల్లోనే రిజిస్ట్రేషన్ అవుతున్నది. వారంలోగానే ఇంటికే పట్టా పాస్‌పుస్తకం వస్తున్నది. ఇంత మంచి ధరణిని తీసేసి దళారులను భూములు అప్పజెప్పేందుకు కాంగ్రెస్ కుట్రలు చేస్తున్నది. ధరణి ఎత్తివేస్తే రైతులు, ప్రజలు తిరుగబడుతారు. ధరణి వల్ల భూ రికార్డులు భద్రంగా ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే మళ్లీ భూ పంచాయితీలు కావడం ఖాయం.
సీఎం కేసీఆర్ సారు తీసుకొచ్చిన ధరణి వల్ల ఎంతో మం ది రైతులు భరోసాగా ఉన్నరు. కాంగ్రెసోళ్లు వచ్చి ధరణి తీసేసి భూమాత తీసుకొస్తామని చెబుతున్నరు. పాత పద్ధతి వలే పట్వారీల చేతికి భూములు వెళితే మళ్లా కొట్లాటలు షురూ అవుతయి. ప్రస్తుతం బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు రెండు పంటలకు పెట్టుబడి సాయం అందిస్తున్నది. ఈసారి గెలిస్తే మరింత పెంచుతమంటున్నరు. ఇన్నాళ్లు రైతులకు అండగా నిల్చిన వారికే మా మద్దతు ఇస్తాం.