మక్తల్, ఏప్రిల్ 27 : తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడి, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలనే లక్ష్యంతో పుట్టిన జెండా గులాబీ జెండా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. భారత రాష్ట్ర సమితి ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆదివారం ఉదయం 6 గంటలకు మక్తల్ మున్సిపాలిటీలోని నాలుగవ వార్డు, మక్తల్ మండలం గుడిగండ్ల గ్రామంలో గులాబీ జెండా ఆవిష్కరణ కార్యక్రమాన్ని వేలాదిమంది కార్యకర్తల మధ్య రామ్మోహన్ రెడ్డి జెండాను ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వలస పాలకుల చేతుల్లో తెలంగాణ ప్రాంతమంతా ఆగమై, అబాసపాలు అయిందని గుర్తించిన తెలంగాణ ధీరుడు కేసీఆర్ పదవులను గడ్డి పోచవలే వదిలిపెట్టి, 2001 ఏప్రిల్ 27న స్వరాష్ట్ర సాధన ధ్యేయంగా తన ఊపిరిని అడ్డుపెట్టి తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడడం కోసం, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని ఏర్పాటు చేశారన్నారు.
పార్టీ స్థాపించిన నాటి నుండి మొక్కవోని దీక్షతో కేసీఆర్ రాష్ట్ర సాధన ధ్యేయంగా ఎన్ని అవాంతరాలు ఎదురైనప్పటికీ వెనక్కి తగ్గకుండా, ప్రాణాలకు తెగించి రాష్ట్రాన్ని సాధించారు. పోరాడి సాధించిన తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారన్నారు. ఆయన వెంట బీఆర్ఎస్ సీనియర్ నాయకులు కొత్త శ్రీనివాస్ గుప్తా, పట్టణ అధ్యక్షుడు చిన్న హనుమంతు, నాయకులు రాజుల ఆసి రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రాజేష్ గౌడ్, నరసింహారెడ్డి, ప్రతాపరెడ్డి, తదితరులు ఉన్నారు.