మక్తల్, జూలై 27 : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ విజయానికి కష్టపడి పని చేయాలని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు. మక్తల్ పట్టణాధ్యక్షుడు చిన్న హనుమంతు అధ్యక్షతన ద్వారక గార్డెన్లో ఆదివారం జరిగిన మక్తల్ బీఆర్ఎస్ కార్యకర్తల విసృ్తతస్థాయి సమావేశానికి మాజీ ఎమ్మెల్యే చిట్టెం ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పది సంవత్సరాలు పాలించిన కేసీఆర్ ప్రభుత్వంలో ఏ ఒకరోజు ఇతర పార్టీ కార్యకర్తలను భారత రాష్ట్ర సమితి కార్యకర్తలు ఇబ్బంది పెట్టలేదన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చే 18 నెలలు గడిచినప్పటికీ, మక్తల్ నియోజకవర్గ వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలను కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నో అవమానాలకు గురి చేస్తుందన్నారు.
కాంగ్రెస్ ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలను, తమ పార్టీకి చెందిన కార్యకర్తలకు మాత్రమే సంబంధిత నాయకులు అందిస్తున్నారని పేర్కొన్నారు. బీఆర్ఎస్ కార్యకర్తలకు ఏ ఒక పథకాన్ని కూడా అందించకుండా అవమానాలకు గురి చేస్తున్నారని బీఆర్ఎస్ నాయకులు మాజీ ఎమ్మెల్యే చిట్టెంకు చెప్పారు. రాజకీయాల్లోకి వచ్చి 20 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ మక్తల్ నియోజకవర్గాన్ని విడిచిపెట్టి ఎకడికి వెళ్లకుండా, ప్రజలే నా కుటుంబ సభ్యులుగా భా వించి వారి సమస్యలను విని పరిషరించేందుకే నా జీవితాన్ని అంకితం చేస్తున్నట్లు బీఆర్ఎస్ కార్యకర్తలకు ఆయన సూచించారు.
తన తండ్రి ఆశయాలను నెరవేర్చడానికి బ్రతికే ఉండాలనే సంకల్పంతోనే మక్తల్ నియోజకవర్గ ప్రజలతో మమేకమై ముందుకుసాగుతూ బాధలన్నింటినీ మర్చిపోతున్నానని పేర్కొన్నారు. 1999 సంవత్సరంలో మా నాన్న స్వర్గీయ మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం నర్సిరెడ్డి వెంట రాజకీయంలోకి అడుగుపెట్టినట్లు ఆయన తెలిపారు. నియోజకవర్గ అభివృద్ధి సమయంలో నాన్నతోపాటు మా సొంత తమ్ముడుని పోగొట్టుకొని, నాన్న ఆశయాలను నెరవేర్చాలని లక్ష్యంతో 2005లో రాజకీయ రంగంలోకి దిగి 20 ఏండ్లు మక్తల్ నియోజకవర్గంలో ప్రజలతో మమేకమై, ప్రజలకు కావల్సిన అవసరాలను తీరుస్తునట్లు తెలిపారు. 2014 సంవత్సరంలో తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకు వ చ్చిన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్‌తో నడవాలనే లక్ష్యంతో కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్లోకి వచ్చినట్లు ఆయన తెలిపారు.
కేసీఆర్ సారథ్యంలో భీమా ప్రాజెక్టును పూర్తి చేసి నియోజకవర్గంలో రెండు లక్షల ఎకరాలకు సాగునీరు అందించిన ఘనత కేసీఆర్ ప్రభుత్వ హయాంలోనే సాధ్యమైనదని ఆయన పేర్కొన్నారు. భీమా ప్రాజెక్టు పూర్తి ఆయిన వెంటనే తన నాన్న గారి ఆశయాల్లోని ఇంకొక పని మిగిలి ఉందని అప్పటి ముఖ్యమంత్రి కేసీఆర్‌కు తెలపగా వెం టనే కళాశాలతోపాటు కళాశాలలో పని చేస్తున్న 50 మంది సిబ్బందిని సైతం ప్రభుత్వ పరం చేసి వారికి ఉద్యోగాలు ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదేనని పేర్కొన్నారు.
ఉమ్మడి రా ష్ట్రంలో మక్తల్ తాలూకాకు కల్యాణ్‌రామ్ చం ద్రా రావు, ఎల్కోటి ఎల్లారెడ్డిలు మంత్రులుగా వ్యవహరించి మక్తల్‌ను ఏమాత్రం అభివృద్ధి చేయలేదన్నారు. కేసీఆర్ ప్రభుత్వంలోనే మక్తల్ నియోజకవర్గాన్ని అన్ని రకాలుగా అభివృద్ధి చెందిందన్నారు. త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో మక్తల్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ అన్ని గ్రామ పంచాయతీలు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీలను కైవసం చేసుకొని రాబోయే భవిష్యత్తు తరానికి, కేసీఆర్ అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా పనిచేయాల్సిన పని అందరిపై ఉందని పేర్కొన్నారు.
18 నెలలపాటు బీఆర్ఎస్ కార్యకర్తలు ఎదురొంటున్న అవమానాలను, ఒకొకటిగా గుర్తుచేసుకొని త్వరలో రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని బొంద పెట్టేందుకు కార్యకర్తలకు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో చిట్టెం సతీమణి చిట్టెం సుచరిత రెడ్డి, నాయకులు రాజుల ఆశిరెడ్డి, మాజీ సర్పంచులు వెంకటయ్య గౌడ్, బెల్లం శ్రీనివాస్, గోవర్ధన్ రెడ్డి, మాజీ ఎంపీటీసీలు ఆశిరెడ్డి, నర్సిరెడ్డి, మా గనూరు మండలాధ్యక్షుడు ఎల్లారెడ్డి, మున్సిపల్ మాజీ కౌన్సిలర్లు మొగలప్పా, అన్వర్ హుస్సేన్ మాజీ సర్పంచులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
రాష్ట్రంలో రాబోయే రోజులన్నీ బీఆర్ఎస్ పార్టీవేనని ఏ ఒక్క కార్యకర్త కూడా అధైర్య పడవద్దని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. ఆదివారం నారాయణపేట జిల్లా మక్తల్ మండల బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల సమావేశం నిర్వహించగా సమావేశంలో మండలంలోని పారేవుల, ముస్లాయిపల్లి గ్రామాలకు చెందిన వివిధ పార్టీలకు చెందిన 25మంది కార్యకర్తలు మాజీ ఎంపీటీసీ ఆశిరెడ్డి ఆధ్వర్యంలో మాజీ ఎమ్మెల్యే సమక్షంలో పార్టీలో చేరారు. వీరికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు.