ఆదిబట్ల, ఫిబ్రవరి 25 : పంచాయతీ సిబ్బందికి వేతన బకాయిలు వారం రోజుల్లో చెల్లించకుంటే నిరవధిక సమ్మెకు దిగుతామని గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ నాయకులు హెచ్చరించారు. బుధవారం గ్రామపంచాయతీ ఉద్యోగ కార్మిక యూనియన్ ఆధ్వర్యంలో రంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. అనంతరం డీఆర్ఓకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ వర్కర్క్ యూనియన్ సీఐటీయూ జిల్లా కార్యదర్శి గ్యార పాండు మాట్లాడుతూ.. పంచాయతీ సిబ్బందిని కూడా 2వ పీఆర్సీ పరిధిలోకి తీసుకురావాలన్నారు.
జీఓ నం.51ని సవరించాలన్నారు. మల్టీపర్పస్ వర్కర్ విధానాన్ని రద్దు చేయాలని తెలిపారు. పాత కేటగిరీలన్నింటినీ కొనసాగించాలని పేర్కొన్నారు. కారోబార్, బిల్ కలెక్టర్లను సహాయక కార్యదర్శులుగా నియమించాలన్నారు. అర్హులైన సిబ్బందికి ప్రమోషన్లను కల్పించాలన్నారు. ఉద్యోగ భద్రత, రిటైర్మెంట్ బెనిఫిట్ రూ.5 లక్షలు, ఇన్సూరెన్స్, ఈఎస్ఐ, పీఎఫ్ సౌకర్యం కల్పించాలని తెలిపారు. సిబ్బందిని పర్మినెంట్ చేసి వేతనాలు పెంచాలని కోరారు. ఆన్లైన్లో నమోదు కాని కార్మికుల పేర్లను నమోదు చేసి అందరికీ వేతనాలు చెల్లించాలని కోరారు.
పంచాయతీల అవసరాల ప్రాతిపాదికన కార్మికుల సంఖ్యను పెంచాలన్నారు. కార్మికులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, ఇండ్ల స్థలాలు కేటాయించాలని కోరారు. అనారోగ్యానికి గురై చనిపోయిన కార్మికుల స్థానంలో వారి కుటుంబసభ్యులకు ఉద్యోగం ఇవ్వాలని, మరణించిన కార్మికుడి దహన సంస్కరాలకు రూ.10వేలు కాకుండా రూ.20వేలు ఇవ్వాలని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతి కార్మికుడికి గుర్తింపు కార్డులివ్వాలన్నారు. కార్మికులపై బెదిరింపులకు పాల్పడినవారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్లో ఉన్న కార్మికుల వేతనాలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నాయకులు కృష్ణ, శ్రీనివాస్, పెంటయ్య, యూనియన్ జిల్లా కార్యదర్శి దేవదాసు, రాష్ట్ర నాయకులు జ్యోతి, జగన్, శేఖర్, మాధవి పాల్గొన్నారు.