మక్తల్, జూన్ 4 : ప్రజల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ నాయకులను గృహ నిర్బంధం పేరుతో అడ్డుకోవడం అప్రజాస్వామికమని మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డి అన్నారు. గురువారం మధ్యాహ్నం ప్రాజెక్టుల నిర్మాణం కోసం ఏరియల్ సర్వే చేపట్టేందుకు సీఎం మక్తల్‌కు వస్తున్న నేపథ్యంలో మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డితో పాటు పలువురు బీఆర్ఎస్ నాయకులను సీఐ రామ్‌లాల్ గృహ నిర్బంధం చేశారు.
ఈ సందర్భంగా చిట్టెం మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హకు ఎవరికైనా ఉందని, పోలీసులు అత్యుత్సాహంతో ముందస్తుగా హౌస్ అరెస్టు చేయ డం ఎంతవరకు సమంజసమన్నారు. మక్తల్ నియోజకవర్గంలో రైతాంగానికి సాగునీరు అందించాలనే లక్ష్యంతో స్వర్గీయ చిట్టెం నర్సిరెడ్డి భీమా ప్రాజెక్టును సాధించారని గుర్తు చేశారు. భూత్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి నీటిని తరలించేలా సీఎం రూ. 3000 కోట్లతో ప్రాజెక్టును నిర్మించేందుకు పను లు ప్రారంభించడాన్ని ఆయన తప్పుబట్టారు. ఒకటిన్నర టీఎంసీల సామర్థ్యం కలిగిన భూ త్పూర్ రిజర్వాయర్ నుంచి కొడంగల్ ఎత్తిపోతల పథకానికి 7 టీఎంసీల నీటిని తరలించడం సాధ్యం కాదన్నారు.
బీమా ఫేజ్ వన్‌లోని ప్రాజెక్టులో చిన్న గోపులాపూర్ స్టేజ్ వన్ పంప్ హౌస్ వద్ద సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లకు నీటిని తరలించే 1200 క్యూసెకుల నీరు పారే కెనాల్ మాత్రమే ఉందని, కొడంగల్ ప్రాజెక్టుకు నీటిని తరలించేందుకు అక్కడ 1050 క్యూసెకుల నీటిని ఎత్తిపోసే పంప్‌ను ఏ విధంగా అమరుస్తారో సీఎం వెల్లడించాలన్నారు. భూత్పూర్ నుంచి కొడంగల్ ప్రాజెక్టుకు నీటిని తరలిస్తే మక్తల్ నియోజకవర్గంలోని నర్వ, ఆత్మకూర్, అమరచింత మండలాలకు సాగునీరు పూర్తిస్థాయిలో అందకుండా పోతుందని వాపోయారు.