పాలమూరు, నల్లగొండ, ఖమ్మం మెట్టు పంటలెండె..’ అని గతంలో నేనే పాట రాసినా.. పక్కనే కృష్ణానది పారుతున్నా సాగుకు, తాగనిక్కె చుక్క నీరు కూడా రాలే.. రాకపోగా ప్రజలను ఆగం చేసిండ్రు.. నారాయణపేట, మక్తల్, కొడంగల్, జడ్చర్ల, షాద్‌నగర్‌కు నీళ్లు రావాలె.. అని బాగా ఆలోచించి ‘పాలమూరు’ ఎత్తిపోతల పెట్టిన.. దానిని ఆపనింకె 196 కేసులేసిండ్రు.. దేవుడి దయ వల్ల కేసులన్నీ పోయినయ్.. ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ కూడా వచ్చింది.. నేను వచ్చి లిఫ్ట్ స్విచ్ ఆన్ చేశా..
‘రాహుల్ గాంధీకి ఎద్దు తెలుసా.. ఎవుసం తెలుసా.. ధరణిని బంగాళాఖాతంలో వేస్తారట.. అన్నోళ్లనే మీరు ఓటుతో బుద్ధి చెప్పి బంగాళాఖాతంలో వేయాలి.. కాంగ్రెస్ వస్తే దళారీ రాజ్యం వస్తుంది.. ఇప్పటికే మనల్ని ఆ పార్టీ సర్వనాశనం చేసింది.. కృష్ణా, తుంగభద్ర నదులు పారుతున్నా ఒక్క ప్రాజెక్టు కట్టాలని నాటి ఇక్కడి నేతలు చెప్పలే.. అధికారంలో ఉన్న పార్టీలకు సోయిలేకపాయే.. మీకు గుండు కొట్టేందుకు కాసుక్కొని కూసున్నరు.. ప్రజల్లరా తస్మాత్ జాగ్రత్త.. తెలంగాణను హస్తం పార్టీ గద్దలపాలు చేయొ ద్దు.. తలరాతను మార్చే వజ్రాయుధం ఓటు.. ప్రజల్లో ప్రజాస్వామ్య పరిణతి రావాలి.. మన బాగోగులు చూసే పార్టీకే పట్టం కట్టాలి’.. అని ప్రగతి ప్రదాత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. సోమవారం మహబూబ్‌నగర్, జోగుళాంబ గద్వాల, నారాయణపేట జిల్లాలోని నాలుగు నియోజకవర్గాలు దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేటలో ప్రజా ఆశీర్వాద సభలు గ్రాండ్ సక్సెస్ అయ్యాయి. ఆయా ప్రాంతాల్లో ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన సభలకు మంత్రులు నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్‌తోపాటు కార్పొరేషన్ల చైర్మన్లు, ముఖ్య నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దళితబంధును పుట్టించిందే కేసీఆర్ అన్నారు. ఎలక్షన్లలో ఆగం కావొద్దని.. అభివృద్ధిని చూసి ఓటెయ్యాలన్నారు. వ్యక్తి, పార్టీ చరిత్ర గురించి తెలుసుకొని పట్టం కట్టాలని పిలుపునిచ్చారు.
మహబూబ్‌నగర్, నవంబర్ 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): “కృష్ణా తుంగభద్రా నదులు పారుతున్నా ఏ ఒక్కరూ ప్రాజెక్టు కట్టమని అడగలే. ఉమ్మడి రాష్ట్రంలో గంజి, అంబలి కేంద్రా లు పెట్టే దౌర్భాగ్య స్థితికి తీసుకొచ్చి పాలమూరు జిల్లాను సర్వనాశనం చేసింది కాంగ్రెస్ పార్టీ” అని బీఆర్ఎస్ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.. సోమవారం ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో సీఎం కేసీఆర్ సుడిగాలి పర్యటన చేపట్టారు. దేవరకద్ర, గద్వాల, మక్తల్, నారాయణపేట ప్రచార సభల్లో సీఎం పాల్గొన్నారు. హెలికాప్టర్ సాంకేతిక లో పం వల్ల దాదాపు 5 గంటలు ఆలస్యంగా వచ్చి నా జనం ఓపికతో కేసీఆర్ కోసం ఎదురు చూడ టం గమనార్హం.. ఈ సందర్భంగా దేవరకద్ర, మక్తల్ సభలో సీఎం మాట్లాడుతూ.. ఎన్నికలు వస్తుంటయి.. పోతుంటయి.. మనం ఆలోచించుకొని ఓటు వేయాలని ఓటర్లకు సూచించారు. ఓటు ఒక వజ్రాయుధం, దాన్ని ఎవరికంటే వారి కి వేసి మన భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని కోరారు. ఎన్నికలు వస్తే బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీలు పోటీ చేస్తాయి.
కానీ అందులో ఏ పార్టీ మన బాగోగులను పట్టించుకుంటదనే దా నిపై చర్చ జరగాలన్నారు. గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులు పాలమూరు జిల్లా నుంచి వలసలు పోతున్నా పట్టించుకోలేదు.. గుక్కెడు నీళ్ల కోసం ఎంతో తపించారు.. సమైక్య రాష్ట్రంలో ఏ ఒక్క కాంగ్రెస్ నాయకుడు కూడా పాలమూరు లో ప్రాజెక్టులు కట్టాలని అడగలేని దౌర్భాగ్య స్థితి ఉండేదన్నారు. సమైక్య రాష్ట్రంలో తెలంగాణ కలవడం వల్ల తీవ్ర అన్యాయానికి గురైందని, నీటి వాటా అడిగే స్థితిలో కూడా తెలంగాణ ప్రాంతం లేదని స్వయంగా బచావత్ ట్రి బ్యునల్ ఆవేదన చెందిందని.. ఇది వాస్తవమని చరిత్ర చెబుతుందన్నారు. బచావత్ ట్రిబ్యునల్ జూరాలకు 15 టీఎంసీలు కేటాయించిందిన్నా రు. అంజయ్య ముఖ్యమంత్రి అయ్యాక జూరాల ప్రాజెక్టుకు శంకుస్థాపన చేసి నిర్మించారన్నారు. 2001 వరకు కూడా కర్ణాటక రాష్ట్రంలో ముంపు గ్రామాలకు నష్టపరిహారం ఇవ్వకపోవడంతో జూరాల ప్రాజెక్టును అంతంత మాత్రమే కట్టి వదిలేశారని చెప్పారు. తెలంగాణ వచ్చినంక కో యిల్‌సాగర్ ఎత్తిపోతల పథకాన్ని పూర్తిచేసి ఈ ప్రాంతాన్ని సస్యశ్యామలం చేశామన్నారు. దేవరకద్ర నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించామని, వాగులపై చెక్ డ్యాంలు నిర్మించిన ఘనత ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్రెడ్డిగారు..
ఇప్పటినుంచి ఎమ్మెల్యే ఆల పేరు చెక్ డ్యాంల వెంకటేశ్వర్‌రెడ్డి అని సీఎం కేసీఆర్ అభివర్ణించారు. ఈసారి ఆలను భారీ మెజార్టీతో ఆశీర్వదించాలని కోరారు. మక్తల్‌లో భీమా, సంగంబండ, భూత్పూర్ రిజర్వాయర్లను ఏర్పాటు చేసి దాదాపు రెండులక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తున్న నియోజకవర్గంగా రాష్ట్రంలో మొట్టమొదటిదన్నారు. ప్రజలు కష్టసుఖాలు తెలుసుకుంటున్న ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్‌రెడ్డిని కూడా భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. తండ్రి చిట్టెం నర్సిరెడ్డి బాటలో పయనిస్తున్న రామ్మోహన్‌రెడ్డి పేదల కష్టసుఖాల్లో పాలుపంచుకునే వ్యక్తి అని కొనియాడారు. హైదరాబాద్‌లో ఒక్క నిమిషం కూడా ఎమ్మెల్యే చిట్టెం ఉండడని, ఏ అర్ధరాత్రి అయినా మక్తల్‌కు చేరుకుంటాడని తెలిపారు. ఈ ఎన్నికల్లో గెలిపిస్తే ఆత్మకూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, నిరంజన్‌రెడ్డి, ఎంపీ శ్రీనివాస్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ స్వర్ణమ్మ, సాట్స్ చైర్మన్ ఆంజనేయగౌడ్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డి, చంద్రశేఖర్, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్‌రెడ్డి, మహిళా నాయకురాళ్లు చిట్టెం సుచరిత, ఆల మంజుల, నాయకులు రాజశేఖర్‌రెడ్డి, కదిరి శేఖర్‌రెడ్డి, శ్రీకాంత్‌యాదవ్, ప్రదీప్‌కుమార్‌గౌడ్, శ్రీనివాస్‌గుప్తా తదితరులు పాల్గొన్నారు.