నాగర్‌కర్నూల్, అక్టోబర్ 24 (నమస్తే తెలంగాణ) : అభివృద్ధిలో అచ్చంపేట దూసుకుపోతున్నది. సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతో ప్రభుత్వ విప్, గువ్వల బాలరాజు పదేండ్లలోనే 65ఏండ్ల అభివృద్ధిని ఊహించని విధంగా చేపట్టారు. ఎంజీకేఎల్ఐ లిఫ్టుతో ఉప్పునుంతల, అచ్చంపేట, బల్మూర్‌లో పలు గ్రామాలకు సాగునీళ్లు వస్తున్నాయి. ఇటీవలే ప్రభుత్వం రూ.2,500కోట్లను మంజూరు చేయడంతో అచ్చంపేట లిఫ్టు పనులకూ ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు శంకుస్థాపన చేశారు. ఈ లిఫ్టు పూర్తైతే నియోజకవర్గంలోని అడవిలో ఎత్తైన ప్రాంతంలో ఉన్న మద్దిమడుగు, పదర, అమ్రాబాద్లాంటి ప్రాంతాలకు సాగునీళ్లు లభించనున్నాయి. దీనివల్ల నియోజకవర్గంలో వర్షాధారం, బోర్లపై ఆధారపడే సాగు కాల్వలు, చెరువులు, కుంటల ద్వారా జరిగే పరిస్థితులు ఉన్నాయి. ఇక అచ్చంపేట మున్సిపాల్టీలో 150మందికి డబుల్ బెడ్రూం ఇండ్లు మంజూరవడంతో అచ్చంపేట పేదల్లో సంతోషం వ్యక్తమవుతోంది. అలాగే వంద పడకల దవాఖానను మంత్రి హరీశ్‌రావు ప్రారంభించడం విశేషం. దీనివల్ల నల్లమలలోని పేదలకు మెరుగైన వైద్యం లభిస్తోంది. అలాగే పోడుభూముల పంపిణీతో ఇక్కడి చెంచులు, గిరిజనులకు భూములపై హక్కు లభించింది. ఈగలపెంట, మన్ననూరులో ఎకో టూరిజంలో భాగంగా నిర్మించిన కాటేజీలు పర్యాటకానికి కొత్త అందాన్ని తీసుకొచ్చాయి.
ముఖ్యంగా జంగిల్ సఫారీతో హైదరాబాద్ ప్రాంతాల ప్రజలు ఇక్కడికి వచ్చి నల్లమల అడవి, కృష్ణానది తీర ఒంపులను చూస్తూ ఆహ్లాదాన్ని పొందుతున్నారు. కాగా, జిల్లాగా మారడం ఇక్కడి ప్రజలకు ప్రధాన సమస్యను తీర్చింది. జిల్లా కేంద్రానికి వెళ్లాలంటే గతంలో మహబూబ్‌నగర్ వెళ్లాల్సి వస్తుండె. దీంతో నాడు ఒకట్రెండు రోజులు పట్టే పని ఇప్పుడు నాగర్‌కర్నూల్‌కు వెళ్లి ఒక్క రోజులోనే పని పూర్తి చేసుకొంటున్నారు. ఇందులో భాగంగా పదర, చారకొండ కొత్త మండలాలుగా ఏర్పడగా రెవెన్యూ, పోలీసు సబ్ డివిజన్లు ఏర్పాటయ్యాయి. ఇలా పాలన మరింత చేరువకు వచ్చింది. అప్నా తండామే అప్నా రాజ్ అనేలా తండాలు పంచాయతీలుగా అప్‌గ్రేడ్ కాగా 75తండాల్లో గిరిజనులు పాలితులుగా మారారు. నల్లమలలోని మద్దిమడుగు, సలేశ్వరం, ఉమామహేశ్వరం, రంగాపూర్లాంటి ప్రాంతాలు ఆధ్యాత్మికంగా మరింత ప్రత్యేకతను తీసుకొచ్చాయి. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వంపై నల్లమల ప్రజలకు విశ్వాసం పెరిగింది. ఫలితంగా గత రెండు సాధారణ ఎన్నికల్లోనూ గువ్వల బాలరాజును గెలిపించారు. కాగా, నవంబర్ 30న జరిగే ఎన్నికల్లోనూ మరోసారి బీఆర్ఎస్ను గెలిపించేలా ప్రజలు తీర్మానించుకుంటున్నారు. ఇందులో భాగంగా అభ్యర్థిగా ప్రకటించిన గువ్వలకు మద్దతుగా సీఎం కేసీఆర్ ఈనెల 26న అచ్చంపేటలో భారీ బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఈ సభతో అచ్చంపేటతో పాటుగా నాగర్‌కర్నూల్ జిల్లాలోనూ బీఆర్ఎస్లో జోష్ నింపనుంది. ఈ సభను విజయవంతం చేసేందుకు గువ్వల బాలరాజు ఏర్పాట్లు చేస్తున్నారు.
* రూ.2,500కోట్లతో అచ్చంపేట లిఫ్ట్‌నకు కేబినెట్ గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. దీంతో 72వేల ఎకరాల ఆయకట్టుకు అందనున్న సాగునీరు
* అచ్చంపేటలో 100 పడకల దవాఖాన ప్రారంభం
* రూ.4.50కోట్లతో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయం పనులు
* రూ.100కోట్లతో మన్ననూర్, ఈగలపెంటలో ఎకో టూరిజం
* ఉమామహేశ్వరం, మల్లెలతీర్థం ఆలయాల అభివృద్ధి, మన్ననూరు, ఈగలపెంటలో కాటేజీల నిర్మాణాలు
* రూ.3.50కోట్లతో ఇండోర్, ఎన్టీఆర్ స్టేడియాల్లో వసతుల కల్పనకు నిధుల మంజూరు
* డ్రైనేజీలు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.100కోట్లు మంజూరు
* గిరిజన పంచాయతీలకు నూతన భవనాలు
* ఆర్డీవో, పోలీస్ సబ్ డివిజన్ కొత్త కార్యాలయాల ఏర్పాటు
* కొత్తగా పదర మండలం ఏర్పాటు
* ఎంజీకేఎల్ఐ ద్వారా సాగునీరు
* అచ్చంపేట, ఉప్పునుంతలలో 15వేల ఎకరాలకు సాగునీరు అందించేందుకు రూ.107కోట్లతో 15కిలో మీటర్ల బ్రాంచ్‌కెనాల్ పనులు