BRSV | గద్వాల : జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాల వద్ద విద్యార్థులతో కలిసి బీఆర్ఎస్వీ ధర్నా చేపట్టింది. విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేసింది. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జ్ మాట్లాడుతూ.. బాలుర ఉన్నత పాఠశాలలో బాలికలు, బాలురులు కలిసి 1430 మంది విద్యార్థులు ఉన్నారని తెలిపారు. వారికి వాష్ రూమ్లు సరిగా లేక ఇబ్బందులు పడుతున్నారని మండిపడ్డారు. నియోజకవర్గ పరిధిలో బడిబాట కార్యక్రమం నిర్వహించామని ప్రభుత్వ పాఠశాలలో అనేక సమస్యలు ఉన్నాయని తమ దృష్టికి వచ్చాయని పేర్కొన్నారు. విద్యాశాఖ మంత్రి పదవిని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన గుప్పిట్లో పెట్టుకొని విద్యార్థుల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. విద్యార్థుల సమస్యలు పరిష్కారం చేసే వరకు పోరాడుతామని హెచ్చరించారు.