గద్వాల, అక్టోబర్ 29 : విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు వెంటనే చెల్లించాలని, వాటిని చెల్లించే వరకు ప్రభుత్వంపై పోరాటం కొనసాగిస్తామని బీఆర్ఎస్వీ రాష్ట్ర నాయకులు కుర్వ పల్లయ్య పేర్కొన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ చెల్లించాలని డిమాండ్ చేస్తూ బుధవారం హలో విద్యార్థి.. చలో కలెక్టరేట్ కార్యక్రమంలో భాగంగా కలెక్టర్ ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యంలో విద్యార్థులు ధర్నా నిర్వహించారు. అనంతరం కలెక్టర్ సంతోష్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్వీ నేత కుర్వ పల్లయ్య మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు చదువుకునే ప్రైవేట్ కళాశాలలకు ప్రభుత్వం ఇంత వరకు ఫీజు బకాయిలు చెల్లించకపోవడంతో దీని వల్ల రాష్ట్రంలో ప్రైవేట్ కళాశాలలు మూతపడే పరిస్థితి నెలకొందన్నారు. దీని వల్ల విద్యార్థుల భవిష్యత్ అగమ్య గోచరంగా మారే అవకాశం ఉందన్నారు.
ఎన్నికల సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్న కాంగ్రెస్ విద్యార్థులకు రూ.5లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తానని చెప్పి ఇప్పటి వరకు ఇవ్వకుండా మోసం చేసిందన్నారు. విద్యారంగానికి బడ్జెట్లో 15శాతం కేటాయిస్తానని చెప్పినా నేటీకి అమలు చేయడం లేదని, అదేవిధంగా విద్యార్థినులకు స్కూటీలు, నిరుద్యోగుల నిరుద్యోగ భృతి చెల్లిస్తామన్న మాట్లాడుతూ కూడా నీటి మూటలుగా మిగిపోయాయని ఆరోపించారు. విద్యార్థులకు సంబంధించి ఫీజుల బకాయిలు ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు కళాశాలలను మూసి వేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చినా సీఎం స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికైనా స్పందించి ప్రభుత్వం వెంటనే రూ.8000 కోట్ల ఫీజు బకాయిలు విడుదల చేయాలని అంత వరకు మా పొరాటా న్ని కొనసాగిస్తామని పేర్కొన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, గంజిపేటరాజు, అతికూర్ రెహమాన్, ప్రేమలత పాల్గొన్నారు.