సంగారెడ్డి, ఫిబ్రవరి 22(నమస్తే తెలంగాణ): సంగారెడ్డి జిల్లాలో ఎన్నిక ఏదైనా గులాబీ పార్టీదే పైచేయి అవుతున్నది. కాంగ్రెస్ అధికారబలం, ధనబలంతో పాటు దౌర్జన్యాలకు పాల్పడినా వారి ఎత్తులను బీఆర్ఎస్ చిత్తుచేస్తూ జిల్లాపై తనపట్టును నిలుపుకొంటున్నది. కాంగ్రెస్‌ను ప్రజలు నమ్మకుండా బీఆర్ఎస్ వెన్నంటే నిలుస్తూ పార్టీని విజయతీరాలకు చేరుస్తున్నారు. ఇది అధికార కాంగ్రెస్‌కు మింగుడుపడటం లేదు. బీఆర్ఎస్ హయాంలో సీఎం కేసీఆర్ సంగారెడ్డి జిల్లా అభివృద్ధికి విశేషంగా కృషిచేశారు. ప్రజా సంక్షేమానికి పెద్దపీట వేశారు. దీనికితోడు మంత్రి హోదాలో హరీశ్‌రావు సంగారెడ్డి జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారు. పెద్ద మొత్తంలో నిధులు తీసుకువచ్చి అభివృద్ధి బాటలో నడిపించారు.
జిల్లాప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి ఆయన చర్యలు తీసుకున్నారు. పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన మేలును జిల్లా ప్రజలు మర్చిపోవడం లేదు. అసెంబ్లీ, పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. ఎన్నికల్లో హరీశ్‌రావు వ్యూహాల ఫలితంగా పార్టీకి మెజార్టీ సీట్లు దక్కాయి. అసెంబ్లీ ఎన్నికల్లో జిల్లాలోని ఐదు స్థానాలకు మూడుచోట్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుపొందారు. సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాలను బీఆర్ఎస్ కైవసం చేసుకుంది.
పార్లమెంట్ ఎన్నికల్లో సైతం జిల్లా ప్రజలు కాంగ్రెస్ కంటే ఎక్కువ ఓట్లు బీఆర్ఎస్కు వేశారు. పంచాయతీ ఎన్నికల్లో సైతం జిల్లా ఓటర్లు బీఆర్ఎస్ వెన్నంటే నిలిచారు. రాష్ట్రంలో ఏపార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి పంచాయతీ ఎన్నికల్లో అత్యధిక స్థానాలు వస్తాయి. కానీ, అధికార కాంగ్రెస్ ఏకపక్ష విజయానికి అందుకోలేక పోయింది. జిల్లాలో 613 పంచాయతీలకు సగానికి పైగా బీఆర్ఎస్ బరిలో నిలిపిన అభ్యర్థులు విజయం సాధించారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో సైతం జిల్లాపై బీఆర్ఎస్ పట్టు నిలుపుకొంది. జిల్లాలో మొత్తం 11 మున్సిపాలిటీలకు ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ విజయం సాధించింది. జహీరాబాద్‌లో అత్యధిక కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి ఉన్నప్పటికీ కాంగ్రెస్ అడ్డదారిలో చైర్మన్ స్థానం కైవసం చేసుకుంది.

Harishrao
పటాన్చెరులో క్లీన్‌స్వీప్
మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ పైచేయి సాధించింది. అధికార కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ ఎన్నికల్లో గెలుపుకోసం సర్వశక్తులు ఒడ్డింది. 11 మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ పార్టీ కాంగ్రెస్‌ను ఢీకొట్టి మరీ ఐదు మున్సిపల్ చైర్మన్ పీఠాలను కైవసం చేసుకుంది. పట్టణ ఓటర్లు కాంగ్రెస్ హామీలకు మోసపోకుండా బీఆర్ఎస్ వెన్నంటే నిలిచి విజయం కట్టబెట్టారు. పటాన్చెరు నియోజకవర్గంలోని ఐదు మున్సిపాలిటీలను బీఆర్ఎస్ క్వీన్‌స్వీప్ చేసింది. జిన్నారం, గుమ్మడిదల, ఇస్నాపూర్, గడ్డపోతారం, ఇంద్రేశం మున్సిపల్ పీఠాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. జహీరాబాద్ మున్సిపాలిటీ ఓటర్లు బీఆర్ఎస్ కౌన్సిలర్లను ఎక్కువ మందిని గెలిపించారు.
అయితే చైర్మన్ ఎన్నిక సందర్భంగా కాంగ్రెస్ కుయుక్తి ఎంపీ షెట్కార్ ఎక్స్‌అపీషియో ఓటుతో చైర్మన్ పీఠం దక్కించుకుంది. జిల్లాలో 11 మున్సిపాలిటీల్లో 256 కౌన్సిలర్ స్థానాలు ఉండగా, 102 కౌన్సిలర్ స్థానాలను బీఆర్ఎస్ గెలుచుకుంది. బీఆర్ఎస్కు చెందిన పది నుంచి 15 మంది రెబెల్స్ కౌన్సిలర్లుగా విజయం సాధించారు. అధికార కాంగ్రెస్‌కు 116 కౌన్సిలర్ స్థానాలు వచ్చాయి. బీజేపీకి 16, ఎంఐఎంకు నాలుగు కౌన్సిలర్ స్థానాలు మాత్రమే దక్కాయి. సదాశిపేట, సంగారెడ్డి, నారాయణఖేడ్, అందోల్ మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్కు ఓటింగ్ శాతం కాంగ్రెస్‌తో పోలిస్తే ఒకటి నుంచి రెండు శాతం మాత్రమే తేడా ఉంది.
ఫలించిన హరీశ్‌రావు వ్యూహం
సంగారెడ్డి జిల్లా మున్సిపల్ ఎన్నికల ఫలితాలపై మాజీ మంత్రి హరీశ్‌రావు మార్కు స్పష్టంగా కనిపించింది. మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపే లక్ష్యంగా అభ్యర్థులను బరిలో నిలపడంతో పాటు కాంగ్రెస్‌కు ధీటుగా ఎన్నికల వ్యూహాలు రచించి అమలు చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన మంత్రి దామోదర్ కేవలం తన నియోజకవర్గంలోని జోగిపేట మున్సిపాలిటీకి పరిమితమై ప్రచారం చేశారు. మాజీ మంత్రి హరీశ్‌రావు సంగారెడ్డి, జహీరాబాద్, పటాన్చెరు నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో ప్రచారాలు, రచ్చబండ సమావేశాలు, కార్నర్ మీటింగ్‌లు నిర్వహించి పార్టీ అభ్యర్థులు, క్యాడర్లో జోష్ నింపారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా కాంగ్రెస్ వైఫల్యాలను ఓటర్లకు వివరించారు. తనదైన ప్రచార శైలితో ఓటర్లను ఆకట్టుకున్నారు. హరీశ్‌రావు ప్రచారం, ఎన్నికల వ్యూహాల ఫలితంగా జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ గెలుపొందడంతోపాటు జహీరాబాద్ మున్సిపాలిటీలో అత్యధిక కౌన్సిలర్లను గెలుచుకుంది. పటాన్చెరులో ఐదు మున్సిపాలిటీల్లో బీఆర్ఎస్ చైర్మన్ పీఠాలను దక్కించుకోవడం వెనుక హరీశ్‌రావు వ్యూహరచన ఉంది.