సిటీబ్యూరో, జూలై 31 (నమస్తే తెలంగాణ) : క్యూర్ (జీహెచ్ఎంసీ, ఎంఎంసీ, సీఎంసీ) పరిధిలో రోడ్ల పరిస్థితి రోత పుట్టిస్తోంది. అడుగడుగునా ఏర్పడిన గుంతలతో నగరవాసులు నిత్యం నరకయాతన అనుభవిస్తున్నారు. గమ్యం చేరాలంటే గంటల తరబడి ట్రాఫిక్‌లో చికుకోవాల్సిందే కాక, ఏ క్షణంలో ఏ గుంత మింగేస్తుందోనని భయంతో హడలిపోతున్నారు. ఇదంతా కండ్లముందే కనిపిస్తున్నా ట్రై కార్పొరేషన్ అధికారులు మాత్రం కండ్లకు గంతలు కట్టుకుని నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండటంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తమవుతున్నది.
వాస్తవంగా సెప్టెంబరు నెలాఖరు నాటికి రోడ్ల తవ్వకాలపై నిషేధం ఉంది. భాగ్యనగర గ్యాస్ పైపులైన్ కంపెనీ మినహా ఏ ఒక్కరూ రోడ్ల తవ్వకాలకు అనుమతి లేదు. ఏదైనా ఎమర్జెన్సీ పనులు ఉంటే సంబంధిత కమిషనర్ల అనుమతితో పనులు కొనసాగించవచ్చు. కానీ రోడ్ల తవ్వకాల నిషేధం కాగితాలకే పరిమితమైంది. క్షేత్రస్థాయిలో మాత్రం వివిధ శాఖలు, గుత్తేదారులు యథేచ్ఛగా రోడ్లను తవ్వేస్తున్నారు. పైప్లైన్ల నిర్మాణం, మరమ్మతుల పేరుతో జలమండలి సిబ్బంది పెద్ద ఎత్తున రోడ్లను తవ్వి, పనులు పూర్తయ్యాక వాటిని పునరుద్ధరించకుండా అలాగే వదిలేస్తున్నారు.
రోడ్ల తవ్వకాల నిషేధం కాగితాలకే పరిమితమవుతున్నది. గుత్తేదారులతో పాటు వివిధ శాఖలు యథేచ్ఛగా రోడ్లను తవ్వేస్తున్నాయి. జీహెచ్ఎంసీ, జలమండలి, విద్యుత్, టెలికాం శాఖల మధ్య కనీస సమన్వయం లేకపోవడమే ఈ దుస్థితికి మూలకారణంగా మారింది. ఒక శాఖ రోడ్డు వేస్తే, మరుసటి రోజే మరో శాఖ వచ్చి మళ్లీ తవ్వేస్తున్నారు.. తవ్విన గుంతలను ముగింపు దశకు తెచ్చే బాధ్యతను ఏ ఒక శాఖా తీసుకోవడం లేదు. కాంట్రాక్టర్ల నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో రహదారులు కాస్తా మరణమృదంగాలుగా మారుతున్నాయి.
ఈ నేపథ్యంలోనే ఉప్పుగూడ ఏరియాలో ఒకవైపు వర్షాలు పడుతున్న సీసీ రోడ్డు వేయడం, ఆది కాస్తా కొట్టుకుపోవడం అధికారుల పనితీరుకు అద్దం పడుతున్నది. ఈ క్రమంలోనే చిన్న పాటి వర్షం పడినా ఈ గుంతల్లో నీరు చేరి కాలువలని తలపిస్తున్నాయి. ద్విచక్ర వాహనదారులు, బాటసారులు ప్రమాదాల బారిన పడి తీవ్రంగా గాయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత శాఖల ఉన్నతాధికారులు నిద్రమత్తు వీడి తక్షణమే రోడ్ల పునరుద్ధరణ పనులు చేపట్టాలని, సమన్వయంతో వ్యవహరించి నగరవాసులకు ఈ గుంతల నరకం నుంచి విముక్తి కల్పించాలని నగర ప్రజలు కోరుతున్నారు.
మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని పలు ప్రాంతాలలో వర్షాకాలం ప్రారంభమైన రోడ్ల తవ్వకాలు ఆగడంలేదు. పలు కాలనీలలో రోడ్లను తవ్వి వదిలివేయడం, ఇంకా పనులు కొనసాగుతుండటం పనితీరుకు అద్దం పడుతుంది. ఉప్పల్ సర్కిల్ పరిధిలోని హబ్సిగూడ రవీంద్రనగర్ ప్రాంతంలో ఎస్ఎన్డీపీ ప్రాజెక్టు పనుల నేపథ్యంలో గత కొన్ని నెలలుగా పనులు కొనసాగుతున్నాయి. వేసవికాలంలో పూర్తిచేయాల్సిన పనులు ఇప్పటికి పూర్తికాలేదు. వర్షాలు ప్రారంభమైన నేపథ్యంలో తవ్వి వదిలేసిన రోడ్లు ప్రమాదకరంగా మారాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ రోడ్డులో రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. మీర్జాలగూడ డివిజన్లోని వెంకటాద్రినగర్, రాజానగర్ ప్రాంతాలలో పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఈ కాలనీలలో రోడ్లను తవ్వడంతో కాలనీలలో రాకపోకలు నిలిచిపోయాయి.
పనులు చేపడుతున్న క్రమంలో ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడంతో వర్షాకాలంలో ప్రమాదం పొంచి ఉంది. చర్యలు చేపట్టాల్సిన అధికారులు, వీటిని పట్టించుకోకపోవడంతో రోడ్డును తవ్వి, పనులు జాప్యం చేస్తున్నారు. వీటితో పాటు ఉప్పల్, ఘట్కేసర్, బోడుప్పల్, మౌలాలి, మల్కాజిగిరి, నేరేడ్మెట్, అల్వాల్, కీసర, బోయిన్పల్లి ప్రాంతాల్లో రోడ్లు అధ్వానంగా మారాయి. వర్షాల నేపథ్యంలో రోడ్లు గుంతలమయంగా మారాయి. ఉప్పల్-చిలుకానగర్ రోడ్డు, బోడుప్పల్ రోడ్డు, మల్కాజిగిరి, మీర్జాలగూడ, గౌతంనగర్ రోడ్లు ప్రజలకు, వాహనదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. రాత్రి సమయంలో ప్రయాణం మరింత ఇబ్బందిగా మారింది. ఇప్పటికైనా అధికారులు స్పందించి, తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. ఉన్నతాధికారులు పర్యటించి, తగిన చర్యలు చేపట్టాలని కాలనీవాసులు కోరుతున్నారు.

మాదాపూర్‌లోని అంతర్గత రహదారి పరిస్థితి

బోడుప్పల్‌లోని ఓ వీధిలో గుంతల్లో చేరిన వర్షపు నీరు

కూకట్‌పల్లిలోని దీనబంధు కాలనీ రోడ్డుపై భారీ గుంత

ప్రశాంత్‌నగర్‌లో..

మాదాపూర్ 100 ఫీట్ల రోడ్డుపై వాహనదారుల అవస్థలు

కూకట్‌పల్లిలోని చిత్తారమ్మ ఆలయానికి వెళ్లే దారిలో..

హబ్సిగూడ రవీంద్రనగర్‌లో తవ్వి వదిలేసిన రోడ్డు