లక్నో: ఒక మహిళ తన ప్రియుడితో కలిసి జీవించాలని భావించింది. భర్త అడ్డు తొలగించేందుకు ప్రియుడితో కలిసి ప్లాన్ వేసింది. భూమి అమ్మిన డబ్బుతో భర్తను హత్య చేయించింది. రైతు హత్యపై దర్యాప్తు చేసిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు. (woman murders Husband) ఉత్తరప్రదేశ్‌లోని ముజఫర్‌నగర్ జిల్లాలో ఈ సంఘటన జరిగింది. సెప్టెంబర్ 27న ఆ జిల్లాలోని అటవీ ప్రాంతంలో 52 ఏళ్ల రైతు ప్రవీణ్ అలియాస్ పర్విందర్పై కాల్పులు జరుగడంతో హత్యకు గురయ్యాడు. ఈ సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రవీణ్ మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం పంపగా అతడి శరీరంపై రెండు బుల్లెట్ గాయాలు ఉన్నట్లు గుర్తించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నాలుగు రోజుల్లోనే హత్య మిస్టరీని ఛేదించారు.
కాగా, రైతు ప్రవీణ్ భార్య రేఖకు, కుటుంబానికి తెలిసిన వికాస్‌తో వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈ నేపథ్యంలో వీరిద్దరూ పెళ్లి చేసుకోవాలని భావించారు. తమ సంబంధం గురించి తెలియడంతోపాటు అడ్డుగా ఉన్న భర్తను హత్య చేయాలని ప్లాన్ వేశారు. రేఖ ఒక భూమిని అమ్మి రూ.10 లక్షల డబ్బు సమకూర్చింది. ప్లాన్ అమలు చేయడానికి రాజా అలియాస్ కాల, కళ్యాణ్ సింగ్‌లను ప్రియుడు వికాస్ సంప్రదించాడు. ప్రవీణ్‌ను హత్య చేస్తే వారిద్దరికి చెరో రూ.3 లక్షలు ఇస్తానని హామీ ఇచ్చాడు.
మరోవైపు రైతు ప్రవీణ్ నుంచి రాజా గతంలో రూ.1.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. దీంతో ఆర్థికపరమైన వివాదం కూడా ఉండటంతో అతడ్ని హత్య చేసేందుకు అంగీకరించాడు. సెప్టెంబర్ 27న ప్రవీణ్‌ను అటవీ ప్రాంతానికి పిలిపించాడు. రాజా, కళ్యాణ్ కలిసి తుపాకీలతో చెరొక బుల్లెట్ కాల్పులు జరిపి హత్య చేశారు. ఆ తర్వాత అక్కడి నుంచి వారు పారిపోయారు.
దర్యాప్తు చేసిన పోలీసులు రైతు ప్రవీణ్ భార్య రేఖ తన ప్రియుడు వికాస్‌తో కలిసి జీవించేందుకు భూమి అమ్మి డబ్బు సమకూర్చి హత్య చేయించినట్లు ఆధారాల ద్వారా తెలుసుకున్నారు. నిందితులైన రేఖ, వికాస్, రాజా, కళ్యాణ్ సింగ్‌లను అరెస్ట్ చేశారు. రెండు అక్రమ నాటు తుపాకీలు, తూటాలు, నాలుగు మొబైల్ ఫోన్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.
అయితే వీటిలో కొత్తగా కొనుగోలు చేసిన ఒక మొబైల్ ఫోన్, సిమ్ కార్డు ఉన్నాయని పోలీస్ అధికారి తెలిపారు. ప్రవీణ్ హత్య ఆపరేషన్ కోసమే నిందితులు దీనిని ప్రత్యేకంగా వినియోగించినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. నిందితులపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి చట్టపరంగా చర్యలు చేపడతామని ఆ పోలీస్ అధికారి వెల్లడించారు.