Ahmedabad : యూపీ, మీరట్ బ్లూ డ్రమ్ తరహాలో ఒక వృద్ధురాలిని చంపి డ్రమ్ములో సిమెంట్‌తో పూడ్చిపెట్టారు దంపతులు. ఈ ఘటన జరిగి నాలుగేళ్లవుతోంది. ఈ ఘటన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగింది. అంతేకాదు.. ఈ దంపతులు మరో ఇద్దరు మహిళల్ని కూడా హతమార్చారు. హత్యకు గురైన ముగ్గురూ వారి కుటుంబ సభ్యులే. 2022లో ఈ ఘటన జరిగింది. మాధవ్ దాస్, ఊర్మిళ దంపతులు ఈ హత్యలకు పాల్పడ్డారు. మృతుల్లో ఒకరు ఊర్మిళ నానమ్మ శాంతాబెన్ వాసవ. రెండో మహిళ ఊర్మిళ సోదరి భాగవతి వాసవ. మూడో మహిళ మాధవ్‌దాస్ తల్లి మంజులాబెన్ సాధు.
ముగ్గురినీ ఊపిరాడకుండా చేసి చంపారు. మొదట శాంతాబెన్ వాసవ అనే 70 ఏళ్ల వృద్ధురాలిని ఊపిరాడకుండా చేసి, ఇంట్లోనే హతమార్చారు. అనంతరం ఆమె మృతదేహాన్ని ఒక పెద్ద డ్రమ్ములో ఉంచారు. పైనుంచి సిమెంటు పోసి, పూడ్చేశారు. తర్వాత ఇంటి వెనుక పెరటిలో గొయ్యి తీసి, ఆ డ్రమ్మును పాటిపెట్టారు. ఈ హత్య 2022లో చేశారు. ఆ సమయంలో కోవిడ్ ఉధృతంగా ఉంది. శాంతాబెన్ ఏమైందని బంధువులు, చుట్టుపక్కల వాళ్లు అడిగితే.. కోవిడ్ కారణంగా మరణించిందని, దీంతో ఆస్పత్రి నుంచి నేరుగా తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించామని చెప్పారు.
ఆ తర్వాత కొంతకాలానికి భగవతిని, మంజులాబెన్ను కూడా వరుసగా ఈ దంపతులు హత్య చేశారు. అయితే, కొంతకాలానికి ఈ హత్యలకు పాల్పడ్డ మాధవ్‌దాస్-ఊర్మిళ దంపతులు విబేధాల కారణంగా విడిపోయారు. ఊర్మిళ ఇంటి నుంచి వెళ్లేటప్పుడు కొడుకుతోపాటు నగలు, డబ్బు వంటివి కూడా పట్టుకెళ్లింది. దీంతో భర్త మాధవ్‌దాస్ ఆమెపై పగతో రగిలిపోయాడు. భార్యపై ఎలాగైనా పగ తీర్చుకోవాలి అనుకున్నాడు. ఇందుకు తాము చేసిన హత్యలను వినియోగించుకోవాలని నిర్ణయించాడు. ఒక హత్యను భార్య చేసినట్లుగా ఫిర్యాదు చేశాడు. తన తల్లి మంజులాబెన్ను భార్య ఊర్మిళ, ఆమె సోదరుడు అఫ్జల్ కలిసి హత్య చేసినట్లు అహ్మదాబాద్ పోలీసులకు మాధవ్‌దాస్ ఫిర్యాదు చేశాడు.
దీనిపై విచారణ జరుపుతున్న క్రమంలో మాధవ్ దాస్ చెబుతున్నదాంట్లో అనేక తప్పులు కనిపించాయి. దీంతో అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో ఆరాతీయగా.. తన తల్లిని భార్యతో కలిసి తానే హత్య చేసినట్లు ఒప్పుకొన్నాడు. దీంతో ఈ ఒక్క హత్యపై విచారణ జరుపుతుండగా.. మిగతా రెండు హత్యల గురించి కూడా తెలిసింది. 2022లో ఈ హత్యలు జరగగా నాలుగేళ్ల తర్వాత ఈ ఘటన బయటపడింది. అది కూడా భర్త మాధవ్‌దాస్ చేసిన పొరపాటు, అతి తెలివి వల్లే.