హైదరాబాద్, జూలై 31 (నమస్తే తెలంగాణ): అత్యంత ఆప్తుడు, అంకితభావానికి నిలువెత్తు నిదర్శనమైన పెద్ది ఇక లేరనే నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నానని మండలి డిప్యూటీ ఫ్లోర్‌లీడర్ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పెద్ది సుదర్శన్‌రెడ్డి కేసీఆర్ మానసపుత్రుడని మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. ఆయన మరణం యావత్ తెలంగాణను కలచివేసిందన్నారు. పెద్ది మరణంతో ఒక మంచి మిత్రుడిని కోల్పోయానని బీఆర్ఎస్ఎల్పీ డిప్యూటీ లీడర్ తలసాని శ్రీనివాస్ యాదవ్ విచారం వ్యక్తంచేశారు. ఉద్యమ సహచరుడు దిగంతాలకు తరలిపోవడం దురదృష్టకరమని మాజీ మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి పేర్కొన్నారు.
ఉన్నది ఉన్నట్టు మాట్లాడే విలక్షణ వ్యక్తిత్వం పెద్ది సుదర్శన్‌రెడ్డి సొంతమని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ గుర్తుచేసుకున్నారు. పెద్ది నిబద్ధత కలిగిన కేసీఆర్ సైనికుడని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి అన్నారు. పెద్ది మరణం తనను కలచివేసిందని మాజీ మంత్రి సునీతాలక్ష్మారెడ్డి ఆవేదన వ్యక్తంచేశారు. అర్ధంతరంగా తనువు చాలించడం విచారకరమని మాజీ మంత్రి సత్యవతిరాథోడ్ పేర్కొన్నారు. పెద్ది మృతి తనకు తీరని వేదన కలిగించిందని మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి చెప్పారు. ఉద్యమాన్నే ఊపిరిగా భావించిన పెద్ది సుదర్శన్‌రెడ్డి అకాల మరణం తనను ఎంతగానో బాధించిందని మాజీ మంత్రి గంగుల కమలాకర్ చెప్పారు. ఉద్యమ ఆశయాల సాధన కోసం జీవితాన్ని ధారపోసిన గొప్ప వ్యక్తి పెద్ది సుదర్శన్‌రెడ్డి అని మాజీ మంత్రి పువ్వాడ అజయ్ అభివర్ణించారు.
పోరాటయోధుడు కన్నుమూయడం అత్యంత విచారకరమని బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్ పేర్కొన్నారు. పోరాట యోధుడి మరణం అత్యంత బాధాకరమని ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ వ్యాఖ్యానించారు. కర్షకుల కన్నీళ్లు తుడిచేందుకు జీవితాన్ని ధారపోసిన గొప్ప నేత పెద్ది అని ఎమ్మెల్సీ గోరటి వెంకన్న పేర్కొన్నారు. అసమాన పోరాటంతో తనలాంటి ఎందరికో స్ఫూర్తినిచ్చిన అరుదైన నాయకుడు కన్నుమూయడం దురదృష్టకరమని మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ప్రజల సమస్యను తన సమస్యగా భావించి పరిష్కారానికి నిబద్ధతతో కృషి చేసిన గొప్ప వ్యక్తి అని కార్పొరేషన్ మాజీ చైర్మన్ దేవీప్రసాద్ కొనియాడారు. ఆపదలో ఉన్నవారికి భరోసానిచ్చే ఆత్మీయుడని ఎస్సీ, ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ కీర్తించారు.
తెలంగాణ నిబద్ధత కలిగిన ఉద్యమకారుడిని కోల్పోయిందని పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కోలేటి దామోదర్ పేర్కొన్నారు. వరంగల్ పోరుబిడ్డ పెద్ది కన్నుమూయడం విచారకరమని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ ఆవేదన వ్యక్తంచేశారు. టీఎన్జీవోఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు కారం రవీందర్‌రెడ్డి స్పందిస్తూ పెద్ది మరణం ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు, నర్సంపేట నియోజకవర్గ వాసులకు తీరని లోటు అని అన్నారు. తెలంగాణ అర్చక ఉద్యోగుల రాష్ట్ర చైర్మన్ గంగు ఉపేంద్రశర్మ మాట్లాడుతూ నాడు కేసీఆర్‌తో కలిసి ఉద్యమ స్ఫూర్తిని రగిలించిన నేతల్లో పెద్ది కీలకమని గుర్తు చేసుకున్నారు.
నల్లబెల్లి, జూలై 31 : పెద్ది సుదర్శన్‌రెడ్డికి అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తామని నిర్ణయం తీసుకున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పేలని తుపాకీ తూటాలతో అవమానించింది. నల్లబెల్లి మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో అంతిమసంస్కారాలు నిర్వహిస్తున్న క్రమంలో పోలీసులు గాల్లో కాల్పులు జరిపేందుకు తుపాకులను ఎత్తి తూటా పేల్చేందుకు సిద్ధమయ్యారు. మూడోరౌండ్‌కు ఎన్నిసార్లు ట్రిగ్గర్ నొక్కినా పేలకపోవడంతో ‘అమరుడు పెద్దికి సర్కార్ అవమానం’ అంటూ స్థానికులు నినాదాలు చేశారు.
పెద్ది సుదర్శన్‌రెడ్డి తెలంగాణ ఉద్యమ యోధుడు. ఆయన మరణం దురదృష్టకరం. నర్సంపేట అభివృద్ధికి శక్తివంచనలేకుండా కృషి చేశారు. ఆయన పవిత్ర ఆత్మకు శాంతిచేకూరాలని ప్రార్థిస్తున్న. వారి కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతి.
-వద్దిరాజు,బీఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ నేత
పెద్ది సుదర్శన్ మరణం కలచివేసింది. నిఖాైర్సెన కార్యకర్తను బీఆర్ఎస్ కోల్పోయింది. నర్సంపేట నియోజకవర్గానికి పెద్ది సేవలు చిరస్మరణీయం. ఆయన పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి.
-మధుసూదనాచారి, శాసనమండలిలో ప్రతిపక్షనేత
పెద్ది సుదర్శన్‌రెడ్డితో నాకు ప్రత్యేక అనుబంధం ఉన్నది. ఆయన మరణం బాధాకరం. పెద్ది పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలి. కుటుంబీకులు, అభిమానులకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్న.
-సంతోష్, మాజీ ఎంపీ
ప్రత్యేక రాష్ట్ర పోరాటంలో పెద్ది సుదర్శన్పాత్ర మరువలేనిది. కేసీఆర్ కనుసైగల్లో ఉద్యమంలో చురుకైన పాత్ర పోషించారు. ఆయన మరణం తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. పెద్ది ఆత్మకు శాంతి చేకూరాలి.
-వినోద్‌కుమార్, మాజీ ఎంపీ
పెద్ది సుదర్శన్‌రెడ్డి పేరే ఒక ఉత్తేజం. వరంగల్ గడ్డమీద అనేక సవాళ్లను ఎదుర్కొంటూ, ఒడిదుడుకులను అధిగమించి ప్రత్యేక పోరాట జెండాను నింగినెత్తిన ధీశాలి. ఆర్థిక బలం లేకున్నా ఆత్మీయ బలంతో ప్రజాక్షేత్రంలో ఉద్యమజెండాను భుజానికెత్తుకున్నారు. నర్సంపేట మట్టిలో ఆయన ముద్ర చిరస్థాయిగా నిలిచిపోతుంది.
-దేశపతి శ్రీనివాస్, మండలి విప్