బీఆర్ఎస్ ఒత్తిడితో బోనస్.. సింగరేణిపై దిగొచ్చిన కాంగ్రెస్ సర్కార్
సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి ధోకా ఇచ్చింది. నల్ల సూర్యుల తరఫున ఈ నెల 14న ‘కార్మిక గర్జన సభ’ పెడుతున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించగానే ప్రభుత్వం భయపడి హడావుడిగా లాభాల వాటా ప్రకటించింది. కానీ అందులోనూ నిలువునా కోత పెట్టింది. నిరుటి కంటే తక్కువ బోనస్కే పరిమితమైంది.
- 596 కోట్ల వాటా చెల్లిస్తున్నట్టు ప్రకటన
- వాస్తవ లాభాలు చెప్పని డిప్యూటీ సీఎం
- మూడేండ్లలో అతి తక్కువ వాటా ఇదే
కరీంనగర్, అక్టోబర్13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి)/హైదరాబాద్/గోదావరిఖని : సింగరేణి కార్మికులకు కాంగ్రెస్ సర్కార్ మరోసారి ధోకా ఇచ్చింది. నల్ల సూర్యుల తరఫున ఈ నెల 14న ‘కార్మిక గర్జన సభ’ పెడుతున్నట్టు బీఆర్ఎస్ ప్రకటించగానే ప్రభుత్వం భయపడి హడావుడిగా లాభాల వాటా ప్రకటించింది. కానీ అందులోనూ నిలువునా కోత పెట్టింది. నిరుటి కంటే తక్కువ బోనస్కే పరిమితమైంది. నిరుడు ఒక్కో కార్మికుడికి రూ.1.95 లక్ష లు బోనస్‌గా ఇస్తే.. ఈ ఏడాది కేవలం రూ.1.53 లక్షల బోనస్కే సర్కార్ సరిపుచ్చింది. నిరుటితో పోల్చితే ఒక్కో కార్మికుడు రూ.42 వేలు నష్టపోతుండటం గమనార్హం. నిరుడు రూ.819 కోట్లు బోనస్‌గా చెల్లించగా, ఈ ఏడాది ప్రభుత్వం రూ.596 కోట్లే ప్రకటించింది. అంటే రూ. 223 కోట్ల బోనస్ తగ్గింది.
బీఆర్ఎస్ సభ.. భయపడ్డ కాంగ్రెస్
సింగరేణి కార్మికులపై వివక్ష, హామీల అమలు పై నిర్లక్ష్యం, ప్రభుత్వం విస్మరిస్తున్న తీరుపై బీఆర్ఎస్ సమరభేరికి సిద్ధమైంది. ఈ నెల 14న తలపెట్టే ‘కార్మిక గర్జన’ సభకు కేటీఆర్ హాజరవుతున్నట్టు తెలియడంతో సర్కార్ హడలెత్తిపోయినట్టు చర్చ నడుస్తున్నది. దాదాపు మూడు నెలల నుంచి లాభాలు ప్రకటించి వాటా చెల్లించాలని కార్మికులు కోరుతున్నా.. పట్టించుకోని సర్కార్ మంగళవారం హైదరాబాద్‌లో ప్రెస్‌మీట్ పెట్టి హడావుడిగా వాటా ప్రకటించింది. ఏటా పెంచుకుంటూ పోయే లాభాల వాటాను ఈ సారి ఎలాంటి మార్పు లేకుండా 34శాతానికే పరిమితం చేయడంపై కార్మికుల్లో ఆగ్రహం వ్యక్తమవుతున్నది. అనేక విషయాల్లో భట్టి స్పష్టత ఇవ్వలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
మరోసారి మోసం
2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి వాస్తవ లాభాలు చెప్పకుండా కేవలం సంస్థ రూ.1,754 కోట్ల నికర లాభాన్ని ఆర్జించినట్టు భట్టి విక్రమార్క పేర్కొన్నారు. 2024-25 ఆర్థిక సంవత్సరంలో వాస్తవ లాభాలు రూ.6,394 కోట్లుగా ప్రకటించి, భవిష్యత్తు అవసరాల కోసం రూ.4,034 కోట్లు పక్కనపెట్టి, రూ.2,360 కోట్ల నికర లాభాన్ని ప్రకటించారు. అందులో 34శాతం వాటాను కార్మికులకు చెల్లిస్తున్నట్టు నాడు భట్టి ప్రకటించా రు. ఈసారి మాత్రం సింగరేణి వాస్తవ లాభా లు ఎంత? దాని నుంచి భవిష్యత్తు అవసరాలకు ఎంత పక్కన పెట్టారు? అనే విషయాల ను పేర్కొనకుండా కేవలం నికర లాభం మాత్రమే ప్రకటించడం చర్చకు దారితీసింది. 2023-24లో సంస్థ రూ.4,701 కోట్ల వా స్తవ లాభాన్ని సాధిస్తే, భవిష్యత్తు అవసరాల కోసం రూ.2,289 కోట్లను పక్కనపెట్టి రూ.2,412 కోట్ల నికర లాభమని పేర్కొం టూ 33 శాతం వాటా చెల్లించారు. 2023- 24లో లాభాల వాటాగా రూ.796 కోట్లు పంచితే 2024-25లో రూ.802 కోట్ల లాభాలను పంచారు. ఈసారి మాత్రం ప్రకటించిన నికర లాభం రూ.1,754 కోట్లపై 34 శాతంగా కార్మికులకు రూ.596.36 కోట్లు మాత్రమే వస్తున్నాయి. గడిచిన మూడేండ్లలో ఇదే అతి తక్కువ లాభాల వాటాగా ఉన్నది.
కారుణ్య నియామకాలపై స్పష్టత కరువు
సంస్థలో మెడికల్ బోర్డుల స్థానంలో మార్పు లు తెచ్చి, స్థానికంగానే సింగరేణి ఏరియా ద వాఖానల్లో నిర్వహిస్తామని ఉప ముఖ్యమం త్రి భట్టి విక్రమార్క పేర్కొనడం కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నది. ఒకే చోట కాకుండా వివిధ ప్రాంతాల్లో బోర్డులు నిర్వహిస్తే, అందు లో ఎలాంటి చర్యలు తీసుకుంటారు? మెడికల్ అన్ఫిట్లు ఎలా అనేదానిపై స్పష్టత లేదు. కాంగ్రెస్ కోల్‌బెల్ట్ ఎమ్మెల్యేల ఒత్తిడి మేరకు స్థానికంగానే మెడికల్ బోర్డు నిర్వహించి పైరవీలకు అవకాశం కల్పించడానికి ఈ నిర్ణయం తీసుకున్నారని విమర్శలు వస్తున్నాయి. కొద్ది నెలలుగా మెడికల్ బోర్డుల్లో 10-12 శాతం వరకే అన్ఫిట్లు చేయడంపై ఆరోపణలు వచ్చా యి.
సొంతింటి పథకంపైనా క్లారిటీ కరువు
సింగరేణి సంస్థలో పనిచేస్తున్న కార్మికులకు సొంతింటి కలను సాకారం చేస్తామని గత అసెంబ్లీ ఎన్నికల్లో హామీ ఇచ్చిన కాంగ్రెస్ ఇప్పుడు జీవో 76 ద్వారా స్థలాలను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పడం ఆశ్చర్యం కలిగిస్తున్నది. కార్మికులకు 250 గజాల స్థలం, ఇల్లు నిర్మించుకోవడానికి అవసరమైన రూ.20 లక్షల వడ్డీ లేని రుణం ఇస్తామని గతంలో హామీలిచ్చి ఇప్పుడు అందుకు విరుద్ధంగా ఎలాంటి స్పష్టత లేకుండా సొంతింటి కలను సాకారం చేస్తున్నట్టు భట్టి విక్రమార్క మాట్లాడటం కార్మికులను అయోమయానికి గురిచేస్తున్నది. బీఆర్ఎస్ హయాంలోనే జీవో 76కు సంబంధించి ఉత్తర్వులు వెలువడితే దాన్ని తామే చేస్తున్నట్టు చెప్పుకోవడంపై కార్మికవర్గాల్లో విస్మయం వ్యక్తమవుతున్నది.
కాంగ్రెస్ ఏకపక్ష నిర్ణయం
బోనస్‌గా దాదాపు రెండు లక్షలు అందుతుందని భావిస్తే 1.53 లక్షలే ప్రకటించడం కార్మికులను నిరాశకు గురిచేసింది. ప్రభుత్వం ప్రకటించిన వాటాపై వారిలో తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతున్నది. కార్మిక సంఘాలతో చర్చించకుండా ఏకపక్షంగా బోనస్‌ను ప్రకటించింది.
-వాసిరెడ్డి సీతారామయ్య, ఏఐసీటీయూ నేత
కార్మికులకు తీరని మోసం
కాంగ్రెస్ పాలనలో సింగరేణి సంస్థ పరిస్థితి దారుణంగా తయారైంది. లాభాల వాటా విషయంలో కార్మికులను ప్రభుత్వం మోసం చేసింది. సింగరేణి గర్జన, కేటీఆర్ పర్యటన నేపథ్యంలో భయపడే సర్కార్ లాభాల వాటా ప్రకటించింది. హరీశ్‌రావు పోరాటంతోనే సింగరేణిలో 300 మందికి ఉద్యోగాలు వచ్చినయ్.
-మిర్యాల రాజిరెడ్డి, టీబీజీకేఎస్ రాష్ట్ర అధ్యక్షుడు
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

