అల్లుడి కోసం గిల్లుడు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకం చుట్టూ బ్రోకింగ్ బాగోతం
దీనిని రుజువు చేసేలా ఇప్పటికే అనేక ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా ఇందిరమ్మ బీమా పథకం నుంచి సైతం రూ.వందలాది కోట్లు పిండుకోవాలని ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. పథకం అమలును ప్రైవేట్ కన్సార్షియానికి అప్పగించి, మధ్యలో ఒక బ్రోకింగ్ కంపెనీని ఇరికించేందుకు పథకం సిద్ధం చేశారట.
- ఏటా 10% కమీషనే లక్ష్యంగా ముఖ్యనేత అల్లుడి షెల్ కంపెనీ
- 1200 కోట్లు మూడేండ్లలో దిగమింగేలా స్కెచ్
- ముఖ్యనేత ‘కుటుంబ’ ధీమా పథకం
- భవన నిర్మాణ కార్మిక బోర్డులోని 1,800 కోట్లపై కన్ను
- బోర్డును బోనులో పెట్టి, రద్దు చేసే యోచనలో సర్కార్
- వాటికితోడు 1,400 కోట్ల రైతుబీమా నిధులూ మళ్లింపు
- మొత్తం ఇందిరమ్మ బీమాకు 4వేల కోట్లు సమకూర్చే ప్లాన్
- ప్రైవేట్ కన్సార్షియానికి స్కీమ్ అప్పగించేలా రంగం సిద్ధం
- రాష్ట్ర ప్రభుత్వానికి, కన్సార్షియానికి మధ్య దళారీ కంపెనీ!
- బ్రోకింగ్ కంపెనీ ఏర్పాట్లలో ముఖ్యనేత అల్లుడు బిజీ బిజీ
- ఐఆర్డీఏ అనుమతి జాప్యంతో పథకం అమలు వాయిదా
- జూన్ 2 అమలు అని తొలుత ప్రకటన.. ఆ తర్వాత బ్రేక్
- ఎల్ఐసీని సైలెంట్‌గా తప్పించేందుకు డిపాజిట్ మెలిక
(వర్ధెల్లి వెంకటేశ్వర్లు)
నమస్తే తెలంగాణ ప్రత్యేక ప్రతినిధి : ‘గుడ్డును చూపెట్టి కోడిని ఎత్తుకుపోతరు’ అనే సామెత కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలకు సరిగ్గా సరిపోతుందేమో. ఎందుకంటే దాదాపు మూడేండ్లుగా వేసే ప్రతి అడుగులో, చేసే ప్రతి పనిలో, అమలు చేసే ప్రతి పథకం వెనుక ప్రజాప్రయోజనం కన్నా, స్వప్రయోజనాలే దాగున్నాయనేది బహిరంగ రహస్యం. శూన్యంలోనూ అవినీతిని సృష్టించి జేబులు నింపుకోవడం కాంగ్రెస్ నేతలకు వెన్నతో పెట్టిన విద్యలా మారింది. దీనిని రుజువు చేసేలా ఇప్పటికే అనేక ఘటనలు వెలుగులోకి రాగా.. తాజాగా ఇందిరమ్మ బీమా పథకం నుంచి సైతం రూ.వందలాది కోట్లు పిండుకోవాలని ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. పథకం అమలును ప్రైవేట్ కన్సార్షియానికి అప్పగించి, మధ్యలో ఒక బ్రోకింగ్ కంపెనీని ఇరికించేందుకు పథకం సిద్ధం చేశారట. ఇందుకోసం బ్రోకింగ్ కంపెనీని స్థాపించేందుకు ముఖ్యనేత అల్లుడు విశ్వప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. మరోవైపు భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును అవినీతి పేరుతో బోనులో నిలబెట్టి, అందులో ఉన్న రూ.1,800 కోట్లను మళ్లించాలని సర్కార్ పెద్దలు నిర్ణయించినట్టు చెప్పుకుంటున్నారు. ఈ నిధుల నుంచే ముఖ్యనేత అల్లుడి కంపెనీకి రూ.1,200 కోట్ల వరకు కమీషన్ కట్టబెట్టాలని ప్రయత్నిస్తున్నట్టు సచివాలయ వర్గాల్లో చర్చ జరుగుతున్నది. ఈ ప్రక్రియ తుది దశకు చేరిందని, అనుమతుల్లో జాప్యంకావడం వల్లే కుటుంబ బీమా అమలు కూడా ఆలస్యం అవుతున్నదని సమాచారం.
కుటుంబ బీమా పేరుతో మొదలు
2026-27 బడ్జెట్లో రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకాన్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రాష్ట్రవ్యాప్తంగా 1.15 కోట్ల కుటుంబాలకు ఈ పథకం వర్తిస్తుందని, ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల ప్రమాద బీమా కల్పిస్తామని తెలిపింది. ఈ ఏడాది జూన్ 2వ తేదీ నుంచి అమలు చేస్తామని చెప్పింది. ఇందుకోసం బడ్జెట్లో రూ.4 వేల కోట్లు కేటాయించింది. దీనిని ఆసరాగా చేసుకొని ఇతర బీమా పథకాల్లో కోతలు మొదలుపెట్టింది. ఎలాగూ రైతులు కొత్త పథకం పరిధిలోకి వస్తారు కాబట్టి ప్రత్యేకంగా రైతుబీమా అవసరం లేదని నిర్ణయించింది. అందుకే బడ్జెట్లో రైతుబీమా పథకానికి నిధులు కోతపెట్టింది. 2025-26లో రైతుబీమాకు రూ.1,167 కోట్లు ఇచ్చిన ప్రభుత్వం.. ఈ ఏడాది కేటాయింపులు చేయనేలేదు. దీంతో ఆగస్టు నుంచే రైతుబీమా పథకం నిలిచిపోయింది. సరిగ్గా ఇదే తరహాలో ప్రభుత్వ పెద్దల కన్ను ఇప్పుడు భవన కార్మిక సంక్షేమ బోర్డు మీద పడిందని అధికారులు చెప్తున్నారు.
అమలు ఆలస్యం అందుకేనా?
ప్రతి అడుగులోనూ అవినీతిని ప్రోత్సహిస్తున్న సర్కార్ పెద్దలు.. ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలోనూ స్వప్రయోజనాలకు బాటలు వేసినట్టు బలమైన ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యనేత అల్లుని ద్వారా ఒక బ్రోకింగ్ కంపెనీని సృష్టించి, దాన్ని ఇందిరమ్మ బీమా పథకంలోకి చొప్పించే ఏర్పాట్లు చకచకా జరిగిపోతున్నట్టు తెలిసింది. సాధారణంగా ప్రభుత్వాలు భారీ సామూహిక బీమా పథకాలు అమలు చేసే సమయంలో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ ఎల్ఐసీ వైపు చూస్తాయి. కేసీఆర్ ప్రభుత్వం అమలు చేసిన రైతుబీమా, ఇతర వర్గాల బీమా పథకాలను ఎల్ఐసీకి అప్పగించింది. పొరుగు రాష్ర్టాల్లోనూ బల్క్ బీమా పథకాలను ఎల్ఐసీ, ఎస్బీఐ వంటి ప్రభుత్వ రంగ సంస్థలకే అప్పగించారు. అవి బ్రోకర్ కంపెనీల ప్రేమేయం లేకుండా నేరుగా ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటాయి. ఒక రూపాయి కూడా దళారులకు పోకుండా ప్రభుత్వ ఖజానాకు ఆదా అవుతుంది. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం సైతం ఇందిరమ్మ కుటుంబ బీమా పథకానికి ప్రస్తుతం తెరమీద ఎల్ఐసీనే చూపిస్తున్నది. కానీ తెరవెనుక వేరే జరుగుతున్నదని లేబర్ కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. పథకాన్ని తొలుత 2026 జూన్ 2న ప్రారంభిస్తామని ప్రకటించిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత నవంబర్ 19న ఇందిరాగాంధీ జయంతికి మార్చారు. అంటే ఇంకా నెలరోజుల సమయం మాత్రమే మిగిలి ఉన్నది. అయినా.. ఇప్పటివరకు ఎలాంటి విధివిధానాలు, నియమ నిబంధనలు రూపొందించలేదు. ఆగస్టు19న జరిగిన క్యాబినెట్ సబ్ కమిటీ భేటీలో బీమా ఏజెన్సీ ఎంపికపై ప్రతిపాదనలు చర్చకు వచ్చినట్టు సమాచారం. అయినా తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. జాప్యం వెనుక ప్రైవేట్ కన్సార్టియంలు, బ్రోకర్ సంస్థలే కారణమని చెప్తున్నారు.
అల్లుడితో బ్రోకింగ్ కంపెనీ
1.15 కోట్ల కుటుంబాలకు రూ.5 లక్షల చొప్పున లెకిస్తే ప్రభుత్వ పూచీకత్తు మొత్తం దాదాపు రూ.5.75 లక్షల కోట్ల రిస్ కవరేజీగా మారుతుందని బీమారంగ నిపుణులు చెప్తున్నారు. దీనికి ప్రభుత్వం కేటాయించిన రూ.4 వేల కోట్లు ఏమాత్రం సరిపోవని అంటున్నారు. ఈ మొత్తానికి ఇన్సూరెన్స్ కంపెనీగానీ, ఏదైనా ఒక బీమా కన్సార్టియం గానీ ముందుకు రాదని స్పష్టం చేస్తున్నారు. కాబట్టి కేటాయింపులను పెంచే ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో బీమా పథకం అమలు ప్రక్రియను ప్రైవేట్ కన్సార్టియంకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతున్నట్టు తెలిసింది. ఇదే అదునుగా అటు ప్రభుత్వానికి, ఇటు కన్సార్టియంకు మధ్య ఒక ప్రైవేట్ బ్రోకింగ్ సంస్థను మధ్యవర్తిగా చొప్పించేందుకు నిబంధనలు రూపొందిస్తున్నట్టు విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఇందుకోసం ముఖ్యనేత అల్లుడు ప్రత్యేకంగా బ్రోకింగ్ కంపెనీ ఏర్పాటు చేసుకుంటున్నట్టు సమాచారం. అయితే ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా నుంచి ఇంకా అనుమతులు రాలేదని తెలిసింది. సాంకేతిక కారణాలు చూపి, అనుమతి నిరాకరించినట్టు చెప్తున్నారు. దీంతో ప్రత్యామ్నాయంగా ముంబైకి చెందిన ఒక ప్రముఖ ఇన్సూరెన్స్ బ్రోకింగ్ కంపెనీని టేకోవర్ చేసే ప్రయత్నాలు చకచకా జరిగిపోతున్నట్టు తెలిసింది. ఈ టేకోవర్ ప్రక్రియ పూర్తయి, కన్సార్టియం విధివిధానాలు కొలికి వచ్చే వరకు కాలయాపన చేయడానికే పథకం అమలును జూన్ నుంచి నవంబర్‌కు వాయిదా వేసినట్టు కార్మిక శాఖ అధికారుల మధ్య చర్చ జరుగుతున్నది.
ఎల్ఐసీని పంపేందుకు ‘డిపాజిట్’ ఉచ్చు
ఈ దోపిడీ సజావుగా సాగాలంటే ప్రభుత్వరంగ దిగ్గజం ఎల్ఐసీ రంగంలో ఉండకూడదని, పోటీ నుంచి దానిని తప్పించేందుకు టెండర్ నిబంధనలనే మార్చేస్తున్నట్టు తెలిసింది. బిడ్డింగ్‌లో పాల్గొనే బీమా సంస్థలు తప్పనిసరిగా భారీ ధరావతు డిపాజిట్ చెల్లించాలనే షరతును తెరపైకి తెస్తున్నారట. ఇలా ముందస్తు డిపాజిట్లు చెల్లించి బిడ్డింగ్‌లలో పాల్గొనడానికి ఎల్ఐసీ అంతర్గత నిబంధనలు అంగీకరించవని బీమారంగ నిపుణలు చెప్తున్నారు. నామినేషన్ పద్ధతిలో కేటాయించినా, లేదా డిపాజిట్ మినహాయింపుతో టెండర్ పిలిచినపుడు మాత్రమే ఎల్ఐసీ పోటీపడుతుందన్నారు. దీన్ని ఆసరాగా చేసుకుని, కేవలం డిపాజిట్ నిబంధన అడ్డంకితోనే ఎల్ఐసీని తప్పించి, తమకు అనుకూలమైన ప్రైవేట్ కన్సార్టియానికి రెడ్‌కార్పెట్ పరిచేలా ప్రణాళిక సిద్ధం చేస్తున్నారని కార్మిక శాఖ అధికారుల్లో చర్చ జరుగుతున్నది.
మత్స్యకారులకు ‘నో అబ్జెక్షన్’
కార్మిక వర్గాల అనుమానాలకు, ఆందోళనలకు ప్రణాళిక శాఖ అంతర్గత ఉత్తర ప్రత్యుత్తరాలు అద్దం పడుతున్నాయి. దేశవ్యాప్తంగా ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన కింద మత్స్యకారులకు గ్రూప్ యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ పథకం అమలవుతున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఇందిరమ్మ కుటుంబ జీవన బీమా అమలుకు సిద్ధమవుతున్న తరుణంలో.. ‘మా పరిధిలోని మత్స్యకారుల ప్రమాద బీమాను యథాతథంగా రెన్యువల్ చేసుకోవాలా? లేక ఇందిరమ్మ పథకంలో విలీనం చేసుకుంటారా?’ అని మత్స్యశాఖ కార్యదర్శి జూన్‌లో ప్రణాళిక శాఖ స్పష్టత కోరుతూ లేఖ రాశారు. దీనిపై ప్రణాళిక శాఖ కార్యదర్శి వెంటనే స్పందించి.. పథకాన్ని యథాతథంగా కొనసాగించుకోవచ్చని తెలిపారు. సరిగ్గా ఇదే తరహా సంశయాన్ని వ్యక్తంచేస్తూ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు సైతం ప్రణాళిక శాఖకు లేఖ రాసింది. ఆ లేఖ వెళ్లి దాదాపు నాలుగు నెలలు గడిచినా, ప్రభుత్వం వైపు నుంచి ఇప్పటివరకు ఎటువంటి స్పందన రాలేదు. మత్స్యకారుల విషయంలో లేని కొర్రీలు, కార్మిక బోర్డు విషయంలోనే ఎందుకు అనే విషయంపై సచివాలయ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతున్నది. కేంద్ర పథకమైన మత్స్యకారుల బీమాతో ప్రభుత్వ పెద్దలకు ఎలాంటి లాభం ఉండదని, అందుకే వారి ఆదేశం మేరకు వెంటనే ‘నో అబ్జెక్షన్’ అంటూ ప్రత్యుత్తరం పంపారని చెప్తున్నారు. ఇచ్చేసింది. కానీ భవన నిర్మాణ కార్మిక బోర్డు ఖజానాలో రూ.1,800 కోట్ల నిధులు ఉన్నాయని, వీటిని కొత్త పథకంలోకి మళ్లించాలనే దురాలోచనతోనే సమాధానం ఇవ్వకుండా తొకిపెట్టిందని కుండబద్దలు కొడుతున్నారు.
కార్మిక సంఘాలు మేల్కొనక పోతే..
భవన నిర్మాణ రంగం నుంచి వసూలయ్యే ‘సెస్’ నిధులు కేవలం కార్మికుల కోసమే ఉద్దేశించినవి. తెలంగాణ భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డు నిర్దేశించిన ఎనిమిది ప్రధాన సంక్షేమ పథకాలు ప్రమాద పరిహారం, సహజ మరణ సహాయం, వైద్యం, ప్రసూతి సాయం, పెళ్లి కానుక వంటివి తప్ప ఇతర ప్రభుత్వ సాధారణ పథకాలకు నయాపైసా మళ్లించడానికి వీల్లేదని సుప్రీంకోర్టు స్పష్టమైన తీర్పులిచ్చిందని చెప్తున్నారు. అయినా బోర్డు స్వయంప్రతిపత్తిని కాలరాస్తూ గతంలో ఏటీసీ సెంటర్ల పేరుతో సిల్ యూనివర్సిటీకి అక్రమంగా మళ్లించారని, ఇప్పుడు తమ స్వలాభం కోసం ‘ఇందిరమ్మ బీమా’ ముసుగులో మిగిలిన రూ.1,800 కోట్ల నిధులపై పడ్డారని ప్రచారం జరుగుతున్నది. తద్వారా ఏకంగా 20 లక్షల మంది కార్మికుల జీవితాలను నిలువునా బలిపీఠం ఎకిస్తున్నారని చెప్తున్నారు. ప్రస్తుత పథకంలో ఒకే ఇంట్లో ఎంతమంది కార్మికులు ఉంటే అంతమందికీ బోర్డు ఇన్సూరెన్స్ వర్తిస్తున్నది. కానీ ఇందిరమ్మ బీమా పథకంలో ఒక కుటుంబానికి ఒకరికే పరిమితం చేసి, కుటుంబ సభ్యుల భద్రతను గాలికొదిలేయబోతున్నారని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అంతేకాకుండా బోర్డు ద్వారా లభించే రూ.10 లక్షల బీమా రక్షణను సగానికి తగ్గించి కేవలం రూ.5 లక్షలకే కుదించే ప్రయత్నం జరుగుతున్నదని హెచ్చరిస్తున్నారు. కార్పొరేట్ బ్రోకర్లకు, బంధువుల వ్యాపారాలకు కార్మికుల చెమట చుకలను తాకట్టు పెట్టే ఈ కుట్రను నిలువరించకపోతే శ్రామిక లోకానికి తీరని ద్రోహం తప్పదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కార్మిక సంఘాలు ఇప్పటికైనా కండ్లు తెరిచి సమరశంఖం పూరించకపోతే శ్రమజీవుల భవిష్యత్తు అంధకారమై, దశాబ్దాలుగా పోరాడి సాధించుకున్న హకులు శాశ్వతంగా సమాధి కావడం ఖాయమని హెచ్చరిస్తున్నారు.
అవినీతి ముద్రవేసి మళ్లించేలా..
కార్మిక సంక్షేమ బోర్డు ఖాతాలో ప్రస్తుతం రూ.1,800 కోట్ల నిధులు ఉన్నట్టు సమాచారం. కేసీఆర్ ముఖ్యమంత్రిగా దిగిపోయేనాటికి రూ.2,500 కోట్ల నిధిని సంక్షేమ బోర్డుకు అప్పగించినట్టు చెప్తున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే స్కిల్ యూనివర్సిటీ కోసం అందులో నుంచి రూ.700 కోట్ల నిధులను తీసుకొన్నట్టు చెప్తున్నారు. అడ్వాన్స్డ్ ట్రైనింగ్ సెంటర్ల (ఏటీసీ) ఏర్పాటు పేరుతో ఆ నిధులను మళ్లించినట్టు నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడు మిగతా రూ.1,800 కోట్లపై కన్నేసినట్టు చెప్తున్నారు. అయితే నేరుగా తీసుకుంటే విమర్శలొస్తాయి కాబట్టి పరోక్షంగా ప్లాన్ వేసినట్టు ప్రచారం జరుగుతున్నది. ఇందులో భాగంగానే దాదాపు మూడేండ్లుగా బోర్డులో అడ్డగోలు అక్రమాలకు తెరలేపారని, కనీవినీ ఎరుగని అమానవీయ దందాను ప్రోత్సహించారని చెప్తున్నారు. తనిఖీలు లేకుండా, క్షేత్రస్థాయి పరిశీలన చేయకుండా రూ.150 కోట్లు దారి మళ్లించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు ఈ అవినీతినే బూచిగా భూతద్దంలో చూపించి, బోర్డును బలిపీఠం ఎక్కించేందుకు రంగం సిద్ధం చేసినట్టు సమాచారం. స్వతంత్ర ప్రతిపత్తిగా ఉన్న బోర్డు మీద తీవ్రమైన అభియోగాలు మోపి, దాన్ని రద్దు చేసే ఆలోచనతో ఉన్నట్టు విశ్వసనీయంగా తెలిసింది. రైతుల మాదిరిగానే కార్మికులను కూడా కుటుంబ బీమాలో కలిపేసి, బోర్డులోని రూ.1,800 కోట్ల నిధులను ఇందిరమ్మ బీమా పథకానికి మళ్లించేందుకు నిబంధనలు రూపొందిస్తున్నట్టు సమాచారం.

‘షెల్’ కంపెనీలతో రూ.1,200 కోట్లకు స్కెచ్
ఈ బ్రోకింగ్ దందాలో కనీసం 10 శాతం కమీషన్ కొల్లగొట్టాలని ప్రాథమికంగా లెకలు వేశారట. అయితే ఒక సాంకేతిక చికు ఎదురవుతున్నట్టు తెలిసింది. ఒకే ఆర్థిక సంవత్సరంలో ఒక ప్రైవేట్ బ్రోకింగ్ సంస్థ ఏకంగా 10 శాతం అధికారిక బ్రోకరేజ్ ఫీజును తమ బ్యాలెన్స్ షీట్లో చూపిస్తే.. కాగ్, ఈడీ, ఆదాయపు పన్ను శాఖల ఉచ్చు బిగుస్తుందని, నిబంధనల ప్రకారం ఇది తక్షణమే దర్యాప్తు సంస్థల రాడార్లోకి వస్తుందని ఆర్థిక రంగ నిపుణులు చెప్తున్నారు. దీంతో దర్యాప్తు సంస్థల కన్నుగప్పేందుకు కార్పొరేట్ స్థాయిలో అత్యంత పకడ్బందీగా బహుళ అంచెల రూటింగ్ నెట్వర్కు తెరతీసినట్టు ప్రచారం జరుగుతున్నది. నేరుగా కమీషన్ రూపంలో కాకుండా.. ప్రధాన బ్రోకింగ్ సంస్థతో పాటు దానికి అనుబంధంగా ఐటీ సొల్యూషన్స్ , బీమా ప్రమోషనల్ వ్యయాలు, థర్డ్ పార్టీ అడ్మినిస్ట్రేటర్ సర్వీసింగ్ చార్జీల పేరిట 3 నుంచి 4 అనుబంధ సర్వీస్ ప్రొవైడర్ కంపెనీల నెట్వర్ను సృష్టిస్తున్నట్టు చెప్తున్నారు. ఇలా వివిధ సేవా రుసుముల ముసుగులో నిధులను దారిమళ్లించాలని ప్లాన్ చేసినట్టు సమాచారం. ఇలా వచ్చే మూడేండ్లలో గుట్టుచప్పుడు కాకుండా రూ.1,200 కోట్ల వరకు పిండుకునేలా ఈ సిండికేట్ పకాప్లాన్ సిద్ధం చేసినట్టు చెప్తున్నారు.
Read Today's Latest Telangana News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

