గద్వాల రూరల్, జూన్ 19 : నీట్ పరీక్షను తక్షణమే రద్దు చేయాలని బీఆర్ఎస్వీ జిల్లా కోఆర్డినేటర్ కుర్వ పల్లయ్య డిమాండ్ చేశారు. బుధవారం జిల్లా కేంద్రంలోని పీజీ సెంటర్ వద్ద నీట్ పరీక్షలో జరిగిన అవకతవకలపై బీఆర్ఎస్వీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మోదీ, రేవంత్‌రెడ్డి తక్షణమే విద్యార్థులకు క్షమాపణ చెప్పాలన్నారు. నీట్ అవకతవకల్లో సీఎం రేవంత్‌రెడ్డి హస్తం ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. ముఖ్యమంత్రి స్పందించకపోతే వారి కార్యాలయాలను ముట్టడిస్తామని హెచ్చరించారు. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ పాలనలో కాలేజీలను అధికం చేయడం వల్లనే సీట్ల సంఖ్య పెరిగిందన్నారు. రాష్ట్రంలో నీట్ పరీక్ష రాసిన దాదాపు 75వేల మం ది గురించి సీఎం ఆలోచించడం లేదన్నారు. అదేవిధంగా కేంద్ర మంత్రులు కిషన్‌రెడ్డి, బండి సంజయ్ స్పందించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు మహదేవ్, రామకృష్ణ, వీరాంజనేయ, నవీన్, రాముడు, విజయ్‌తోపాటు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.
నారాయణపేట, జూన్ 19 : నీట్ లీకేజీపై సుప్రీంకోర్టు జడ్జితో విచారణ జరిపించాలని పీడీఎస్‌యూ జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ డిమాండ్ చేశారు. బుధవారం పట్టణంలోని సత్యనారాయణ చౌరస్తాలో పీడీఎస్‌యూ ఆధ్వర్యంలో కేంద్ర ప్రభుత్వం దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ నీట్ యూజీ ప్రవేశ పరీక్షలో అవకతవకలు జరిగాయని దేశవ్యాప్తంగా విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో అనుమానాలు నెలకొన్నాయన్నారు. ఈ విషయంపై కేంద్రం ఇప్పటివరకు స్పందించకపోవడం సిగ్గుచేటన్నారు. నీట్ పేపర్ లీకేజీకి బాధ్యత వహిస్తూ ఎన్టీఏ చైర్మన్ ప్రదీప్‌కుమార్ జోషి రాజీనామా చేయాలని డి మాండ్ చేశారు. నీట్ పరీక్షను రాష్ర్టాల పరిధిలోకి మార్చి కోచింగ్ సెంటర్ల పేరుతో పేపర్ లీకేజీలు చేస్తున్న సెంటర్ల అనుమతులు రద్దు చేయాలన్నా రు. కార్యక్రమంలో పీడీఎస్‌యూ జిల్లా సహాయ కార్యదర్శి గౌస్, కోశాధికారి వెంకటేశ్, జిల్లా నాయకులు ప్రసాద్, మహేశ్, నరేశ్, అనిల్, పవిత్ర, నవనీత, కవిత తదితరులు పాల్గొన్నారు.