Panchayat Elections : మూడు విడతల్లో జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. పల్లెల్లో గులాబీ జెండాను గుండెలకు హత్తుకున్న జనం.. బీఆర్ఎస్ అభ్యర్థులకే పట్టం కట్టారు. మహబూబ్‌నగర్‌లోని జడ్చర్ల నియోజకవర్గంలోనూ కారు స్పీడ్ కొనసాగింది. మాజీ మంత్రి లక్ష్మారెడ్డి నాయకత్వంలో అధికార పార్టీకి చుక్కలు చూసింది. మూడు విడతల్లో కలిపి కాంగ్రెస్ కంటే అత్యధిక స్థానాలు గులాబీ దళం గెలుచుకుంది. దాంతో.. జడ్చర్ల బీఆర్ఎస్ క్యాడర్‌కు రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చారు మాజీ మంత్రి. తమ అభ్యర్థులకు ఓటు వేసి ఆశీర్వదించిన జడ్చర్ల నియోజకవర్గం ప్రజలకు పేరుపేరునా ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.
జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ తన సత్తా చాటింది. అధికార పార్టీకి ముచ్చెమటలు పట్టిస్తూ నియోజకవర్గంలో మొత్తం 188 గ్రామ పంచాయతీలకు.. 85 సర్పంచ్ స్థానాల్లో గులాబీ జెండా ఎగరేసింది. అధికార పార్టీ కంటే ఎక్కువ సీట్లు గెలుచుకొని కారు జోరు చూపింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీనే ఎక్కువ సీట్లు గెలుచుకుంటుందనే అభిప్రాయం తప్పని రుజువు చేసింది.
‘అధికారంలో లేకపోయినా జడ్చర్ల నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు అండగా నిలిచిన ప్రజలకు ప్రత్యేక ధన్యవాదాలు. మీ నమ్మకాన్ని వమ్ము చేయకుండా గ్రామాల అభివృద్ధి కోసం పని చేస్తాం. అధికార పార్టీని ఎదిరించి విజయం సాధించిన నూతన సర్పంచ్‌లు, వార్డు మెంబర్లకు హృదయపూర్వక శుభాకాంక్షలు. ఇంతటి ఘన విజయం కోసం శ్రమించిన పార్టీ నాయకత్వానికి ప్రత్యేక అభినందనలు’ అని లక్ష్మారెడ్డి తెలిపారు.