భూత్పూర్ : ఈనెల 27న వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో జరిగే బీఆర్ఎస్ రజతోత్సవాన్ని ( BRS Silver Jubilee) విజయవంతం చేయాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి( Ala Venkateswar Reddy) పిలుపునిచ్చారు. శనివారం పట్టణ కేంద్రంలో కార్యకర్తలనుద్దేశించి మాట్లాడారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల వైఫల్యాలను ప్రజలకు వివరించాలని సూచించారు.
ముఖ్యంగా రైతుబంధు, రుణమాఫీ, విద్యుత్ కోతలను వివరించాలని తెలిపారు. మహిళలకు నెలకు రూ. 4వేల రూపాయలు ఫించన్, దివ్యాంగులకు రూ. 7 వేలు ఇస్తామని ఎన్నికల్లో అమలు కానీ హామీలను ఇచ్చినట్లు ప్రజలకు తెలపాలని కోరారు. బీఆర్ఎస్ హయాంలో ఎలాంటి హామీలను ఇవ్వకుండా ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందని వెల్లడించారు.
నియోజకవర్గంలోని ప్రతి గ్రామం నుంచి ప్రజలు హాజరయ్యేలా ప్రణాళికను తయారు చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు సత్తూర్ బస్వరాజ్ గౌడ్, సింగిల్ విండో చైర్మన్ కదిరే అశోక్ రెడ్డి, మండల నాయకులు సత్తూర్ నారాయణ గౌడ్, నరసింహ గౌడ్, మురళీధర్ గౌడ్, వెంకటయ్య, లక్ష్మయ్య, యాదయ్య, గడ్డం ప్రేమ్ కుమార్, గడ్డం రాములు, బ్రహ్మయ్య, సురేష్ పాల్గొన్నారు.