మహబూబ్‌నగర్, ఫిబ్రవరి 6 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : మున్సిపల్ ఎన్నికలను బీఆర్ఎస్ ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాలో కార్పొరేషన్‌తోపాటు 18 మున్సిపాలిటీల్లో పార్టీ నేతలు కార్యకర్తలు గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తున్నారు. నామినేషన్ల ఉపసంహరణ మొదలైన దగ్గర నుంచి అన్ని వార్డుల్లో విస్తృత ప్రచారం చేపడుతున్నారు. ఆయా నియోజకవర్గాల్లో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీ ఇన్చార్జీలు మకాం వేసి గెలుపు బాధ్యతలను తమ భుజస్కందాలపై వేసుకన్నారు. ఆయా మున్సిపాలిటీల్లో ఇంటింటి ప్రచారాన్ని చేపట్టి కాంగ్రెస్ వైఫల్యాలను ఓటర్లకు వివరిస్తున్నారు.
ఇక అలంపూర్ నియోజకవర్గంలో ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే కలిసి సత్తా చా టేందుకు ప్రయత్నిస్తున్నారు. మిగతా చోట్లా పార్టీ ఇన్చార్జీలు మున్సిపల్ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గెలుపు కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్, బీజేపీలో ఉమ్మడి జిల్లాలో అనైతిక పొత్తు పెట్టుకొని పోటీ చేస్తున్నా.. గులాబీ దళం ఒంటరిగానే పోటీ చేస్తున్నది. కాంగ్రెస్, బీజేపీలకు ముచ్చెమటలు పట్టిస్తున్నది. దీనికి తోడు బీఆర్ఎస్ నేతలు చేస్తున్న ప్రచారానికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభిస్తోంది.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ.. కాంగ్రెస్ ఇచ్చిన గ్యారెంటీలపై నిలదీస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల రణరంగాన్ని తలపిస్తున్నాయి. మరోవైపు పార్టీ ఫిరాయించిన గద్వాల ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డికి బీఆర్ఎస్ నేతలు చుక్కలు చూపిస్తున్నారు. ఏ పార్టీలో ఉన్నాడు చెప్పాలని.. దమ్ముంటే కాంగ్రెస్ కండువా వేసుకొని ప్రచారం చేయాలని సవాల్ విసురుతున్నారు. ఎమ్మెల్యేపై గద్వాల కాంగ్రెస్ నేతలు చేస్తున్న ఆరోపణలు ప్రజల్లో చర్చనీయాంశంగా మారుతున్నాయి.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలకు ఒక కార్పొరేషన్‌కు ఎన్నికలు జరుగుతున్నాయి. ఆయా నియోజకవర్గాల్లోని మున్సిపాలిటీల్లో గెలిపించుకునేందుకు బీఆర్ఎస్కు చెందిన మాజీ మం త్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, నిరంజన్‌రెడ్డి, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, ఎమ్మెల్యే విజయుడు, మాజీ ఎమ్మెల్యేలు ఆల వెంకటేశ్వర్‌రెడ్డి, చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, రాజేందర్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, మర్రి జనార్దన్‌రెడ్డి, జైపాల్‌యాదవ్, బీరం హర్షవర్ధన్‌రెడ్డి, గద్వాల ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు ముమ్మర ప్రచారం నిర్వహిస్తున్నారు.

నియోజకవర్గాల్లోనే మకాం వేసి అభ్యర్థుల ఎంపికతోపాటు ప్రచార బాధ్యతలను కూడా భుజాన వేసుకొని వ్యూ హాత్మకంగా ముందుకు వెళుతున్నారు. బీఆర్ఎస్ నేతలకు అడుగడుగునా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. కాంగ్రెస్ వైఫల్యాలు స్థానిక ఎమ్మెల్యేలు చేస్తున్న అవినీతి అక్రమాలను ప్రశ్నిస్తూ బీఆర్ఎస్ నేతలు ప్రచారం చేపడుతున్నారు. ఇక పార్టీ టికెట్లు ఇచ్చి పోటీలో నిలబెట్టిన అభ్యర్థులు కూడా ఎన్నికలను చాలెంజ్‌గా తీసుకొని గట్టి పోటీని ఇస్తున్నారు.
పాలమూరు కార్పొరేషన్లో 60 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో మున్సిపాలిటీగా ఉండగా ప్రస్తుతం కార్పొరేషన్‌గా మారింది. దీంతో తొలి మేయర్ పీఠంపై కన్నేసిన బీఆర్ఎస్ నేతలు అన్ని డివిజన్లకు అభ్యర్థులను ప్రకటించి పోటీకి దింపారు. మాజీ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ గెలుపు బాధ్యతలను భుజాల మీద వేసుకొని రేయింబవళ్లు అన్ని డివిజన్లో కార్నర్ మీటింగులు చేపట్టి ప్రచారం నిర్వహిస్తున్నారు. మరోవైపు అభ్యర్థులు కూడా ఉదయం, సాయంత్రం కార్యకర్తలతో కలిసి ఇంటింటి ప్రచారం నిర్వహించి బీఆర్ఎస్కు ఓటు వేయాలని ఓటర్లను అభ్యర్థిస్తున్నారు. ఇదిలా ఉండగా కార్పొరేషన్ పరిధిలో బీజేపీ, కాంగ్రెస్ ఒకటైనా బీఆర్ఎస్ గట్టిగా పోటీ ఇస్తోంది. మాజీ మంత్రి ప్రతిష్టాత్మకంగా తీసుకొని కార్పొరేషన్‌పై పాగా వేయాలని వ్యూహాత్మకంగా అడుగులు వేస్తున్నారు. దీనికి తోడు ప్రజలు కూడా బీఆర్ఎస్ ప్రచారానికి బ్రహ్మరథం పడుతున్నారు.
ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో మొత్తం 18 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరుగు తున్నాయి. ఆయా చోట్ల బీఆర్ఎస్ నేతలు మున్సిపాలిటీలో విస్తృతంగా ప్రచారం చేపడుతున్నారు. ఒకవైపు అభ్యర్థులతోపాటు మరోవైపు జిల్లా, రాష్ట్రస్థాయి నేతలు కూడా ప్రచారంలో పాల్గొని ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతున్నారు. కొన్నిచోట్లా బీఆర్ఎస్ అభ్యర్థులు మహిళలతో కలిసి ఇంటింటి ప్రచారం చేపడుతున్నారు. మున్సిపాలి టీలో చేపట్టిన అభివృద్ధిపై అధికార పార్టీని నిలదీస్తున్నారు.
గత కేసీఆర్ ప్రభుత్వ హయాం లోని పట్టణ ప్రగతి కింద మున్సిపాలిటీల్లో వందల కోట్ల రూపాయల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టినామని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా మున్సి పాలిటీల్లో శంకుస్థాపనలు తప్పించి ఒక్క అభివృద్ధి కార్యక్రమం కూడా చేపట్ట లేకపోయిందని విమర్శిస్తూ ఓటర్లకు వివరిస్తు న్నారు. మరోవైపు అధికారంలోకి రావడానికి కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను ప్రజలకు వివరిస్తూ ఆ పార్టీ నేతలు ప్రచారానికి వస్తే హామీలపై నిలదీయాలని ఓటర్లను కోరుతున్నారు. బీఆర్ఎస్ వస్తేనే అభివృద్ధి జరుగుతుందని నేతలు భరోసా ఇస్తున్నారు. మొత్తంపైన ఎన్నికలు దగ్గర పడు తున్న కొద్ది ఆరోపణలు ప్రత్యారోపణలతో ఎన్నికల వేడి మరింత రాజుకుంటున్నది.