ముంబై, ఆగస్టు 7: దేశీయ బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ) ప్రోత్సాహకర ఆర్థిక ఫలితాలు ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికానికిగాను రూ.24,113 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. అంతక్రితం ఏడాది ఇదే త్రైమాసికంలో వచ్చిన రూ.19,160.44 కోట్ల లాభంతో పోలిస్తే 13.73 శాతం వృద్ధిని కనబరిచింది. ఏకీకృత విషయానికి వస్తే బ్యాంక్ నికర లాభం ఏడాది ప్రాతిపదికన 10.23 శాతం వృద్ధితో రూ.21,121.22 కోట్లు ఆర్జించింది. బ్యాంక్‌నకు నికర వడ్డీ ఆదాయం 15 శాతం ఎగబాకి రూ.46,992 కోట్లకు చేరుకున్నది. స్థూల అడ్వాన్స్‌లు 19 శాతం వరకు అధికమవడం, దేశీయ నికర వడ్డీ మార్జిన్లు 3 శాతం వృద్ధి చెందడం ఇందుకు కారణమని విశ్లేషించింది. వడ్డీయేతర ఆదాయం మాత్రం 9 శాతం తగ్గి రూ.15,293 కోట్లకు పరిమితమైంది. ఈ సందర్భంగా బ్యాంక్ ఎండీ అశ్విని కుమార్ తివారీ మాట్లాడుతూ..కార్పొరేట్ల రుణాలకు డిమాండ్ నెలకొన్నదని, ప్రస్తుతం పలు రంగాల నుంచి రూ.3.6 లక్షల కోట్ల స్థాయి దరఖాస్తు చేసుకున్నారని తెలిపారు.
110 లక్షల కోట్లు దాటిన వ్యాపారం
బ్యాంక్ వ్యాపారం శరవేగంగా దూసుకుపోతున్నది. ఇటీవల రూ.100 లక్షల కోట్లు దాటిన బ్యాంక్ మొత్తం వ్యాపారం ప్రస్తుతం రూ.110 లక్షల కోట్లు దాటింది. ఇందులో డిపాజిట్లు రూ.60 లక్షల కోట్లు కాగా, అడ్వాన్స్‌లు రూ.50 లక్షల కోట్లుగా ఉన్నాయి. వీటిలో రంగాలవారీగా రిటైల్, వ్యవసాయం, ఎస్ఎంఈలు కీలక వృద్ధి చోదకాలుగా నిలిచాయన్నారు. వ్యవసాయ అడ్వాన్స్‌లు 25.43 శాతం వృద్ధిని నమోదు చేసుకోగా, కార్పొరేట్ అడ్వాన్స్‌లు 18 శాతం చొప్పున పెరిగాయి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 14-15 శాతం వృద్ధి లక్ష్యంగా పెట్టుకున్నాం. అలాగే డిపాజిట్లలో 10-11 శాతం వృద్ధి, ఎఫ్సీఎన్ఆర్ ద్వారా 6 బిలియన్ డాలర్ల డిపాజిట్లు సేకరించగలిగాం. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఎన్ఐఎం 3 శాతం వృద్ధి సాధిస్థామన్న నమ్మకం ఉన్నది. 2030 నాటికి 75వ వార్షికోత్సవం వైపు అడుగులు వేస్తున్న బ్యాంక్‌ను భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా తీర్చిదిద్దడమే ప్రధానంగా దృష్టి సారించాం.
– సీఎస్ శెట్టి, ఎస్బీఐ చైర్మన్