మహబూబ్‌నగర్, జూలై 8 (నమస్తే తెలంగాణ ప్రతినిధి) : తుంగభద్ర నదిపై ఏపీ, కర్ణాటక పథ కం ప్రకారం చేపడుతున్న ఎత్తిపోతల పథకాలు, రిజర్వాయర్లు, కాల్వల నిర్మాణాలు భారీ జల దో పిడీకి తెరలేపుతున్నాయి. తెలంగాణలోకి తుంగభద్ర నది అడుగుపెట్టకుండానే రెండు రాష్ర్టాలు దొంగల్లా నీటి చౌర్యానికి పాల్పడుతున్నాయి. అనుమతులు లేకుండానే అడ్డగోలుగా నిర్మాణాలు చేపట్టి తెలంగాణ జల హక్కులను కాలరాస్తున్నాయి. ఉమ్మడి జిల్లాలోకి టీబీ రివర్ అడుగిడకక ముందే ఎక్కడికక్కడ బొక్కలు పెట్టి చుక్క నీరు రాకుండా తరలించుకుపోయేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. నది నుంచి ఉమ్మడి జిల్లాలోని నడిగడ్డకు న్యాయంగా రావాల్సిన నీటిని తరలించేందుకు అప్పట్లో రాజోళి బండ డైవర్షన్స్ స్కీం (ఆర్డీఎస్) పేరుతో నిర్మించిన ఆనకట్ట నుంచి ఏపీ, కర్ణాటక జల చౌర్యంతో నడిగడ్డ మాగాణికి మరణ శాసనం రాస్తున్నాయి. రాయలసీమకు చెందిన కొందరు నేతలు ఉమ్మడి రాష్ట్రంలో ఆర్డీఎస్ తూములను బద్ధలు కొట్టి సుంకేసుల డ్యాంకు నీళ్లు తీసుకెళ్తామని బెదిరించిన పక్షంలో కేసీఆర్ నాడు పాదయాత్ర చేసి వా రి కుట్రలకు అడ్డుకట్ట వేసిన విషయం తెలిసిందే.

ఉమ్మడి రాష్ట్రంలో దగాపడ్డ పాలమూరు జిల్లాకు తెలంగాణ వచ్చాక ఆర్డీఎస్ ఆయకట్టుకు కేసీఆర్ ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి తుంగభద్ర డ్యాంకు ఇండెంట్లు పెట్టి.. కాల్వలకు నీరు పారించింది. ప్రస్తుతం ప్రభుత్వ అధికారంలో వచ్చాకా ఏపీ, కర్ణాటకలో తుంగభద్ర నదిపై కడుతున్న అక్రమ ప్రాజెక్టులకు అంతులేకుండా పోయింది. అడ్డుకోవాల్సిన మన ప్రభు త్వం చేష్టలుడిగి చూస్తున్నదన్న ఆరోపణలు ఉ న్నాయి. దీంతో ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం బుధవారం ఆర్డీఎస్ పరిశీలించింది. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి నేతృత్వంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, పట్నం నరేందర్‌రెడ్డి, అంజయ్య యాదవ్, జైపాల్ యాదవ్, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, నాయకులు బాసు హనుమంతు నాయు డు, ఆంజనేయగౌడ్ ఆనకట్ట పరిస్థితిని చూసి చలించిపోయారు.
ఆర్డీఎస్కు 100 అడుగుల దూరంలోనే కురిడి ఎత్తిపోతల పథకం పనులను కన్నడ ప్రభుత్వం అనుమతి లేకుండా 2 టీఎంసీలను తరలించుకుపోయే కుట్ర పన్నింది. మరోవైపు ఏపీ ప్రభుత్వం ఆర్డీఎస్కు కుడి పక్కన భారీ కాల్వ తవ్వి మరో 2 టీఎంసీలు తరలించేందుకు ఏకంగా హెడ్ రెగ్యులేటరీ సిస్టంను ఏర్పాటు చేసింది. దీనికి పైభాగంలోని 15 కి.మీ. దూరం లో చిక్కల్ పరువు వద్ద మరో ఎత్తిపోతల పథకం రూపుదిద్దుకుంటోన్నది.

ఇటు ఆర్డీఎస్ దిగువన కర్ణాటక మరో టీఎంసీ నీటిని తరలించేందుకు భారీ రిజర్వాయర్‌కు రూపకల్పన చేస్తుందని అక్కడి రైతులే అంటున్నారు. ఈ ప్రాజెక్టులు పూ ర్తయితే టీబీ రివర్ వాటాలో రాష్ర్టానికి న్యా యంగా రావాల్సిన నీళ్లు రాకపోగా ఆర్డీఎస్ ఆయకట్టుతోపాటు దీని ఆధారంగా నిర్మించిన తుమ్మిళ్ల పథకం కూడా నిష్ప్రయోజనంగా మారే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అందుకే ఏపీ, కర్ణాటక రెండు రాష్ర్టాలు కలిసి నడిగడ్డను ఎడారిగా మార్చే కుట్రలను అడ్డుకుంటామని వారు హెచ్చరించారు. తెలంగాణ సర్కార్ మొద్దు నిద్ర వీడుకుంటే ఆందోళన తప్పదన్నారు.
ఉమ్మడి జిల్లాలోని నడిగడ్డకు సాగు, తాగునీరు అందించే ఆర్డీఎస్ను మాజీ మంత్రుల నేతృత్వంలోని బీఆర్ఎస్ ప్రతినిధుల బృందం సందర్శించింది. మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డిల నేతృత్వంలో ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, జైపాల్ యాదవ్, అం జయ్యయాదవ్, పట్నం నరేందర్‌రెడ్డితోపాటు బీఆర్ఎస్ నాయకులు బాసు హనుమంతు నా యుడు, ఆంజనేయగౌడ్‌లు కలిసి బుధవారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రం నుంచి కర్ణాటకలోని ఆర్డీఎస్ సందర్శనకు బయలుదేరారు. మాజీ మంత్రి నివాసం నుంచి భారీ కాన్వాయ్ తో ‘ఆర్డీఎస్ను పరిరక్షించండి’.. ‘ఏపీ, కర్ణాటక కుట్రలను తిప్పికొట్టండి’.. ‘తెలంగాణ సర్కార్ నిర్లక్ష్యం వీడాలి’ అంటూ నినాదాలు చేస్తూ మాన్వి తాలూకాలో ఆనకట్ట వద్దకు బయలుదేరారు.

ఆర్డీఎస్ నీళ్లు కర్ణాటకలోని ఆయకట్టుతోపాటు నేరుగా జోగుళాంబ గద్వాల జిల్లాలోని అలంపూర్ నియోజకవర్గానికి కాల్వల ద్వారా చేరుతోంది. సుమారు 15.9 టీఎంసీల నీటిని ఆర్డీఎస్కు వదిలేందుకు అప్పట్లో ఒప్పందం కుదిరింది. ఈ మేరకు తుంగభద్ర నది బోర్డు కూడా అంగీకరించి నీటిని వదులుతోంది. అయితే ఆర్డీఎస్ నిర్మించినప్పటి నుంచి నడిగడ్డకు ఏనాడు పూర్తిస్థాయిలో నీరు అందిన దాఖలాల్లేవు. ఆనకట్టకు 100 అడుగుల దూరంలోనే కురిడి లిఫ్ట్ ను కర్ణాటక అక్రమంగా నిర్మిస్తుండగా.. బీఆర్ఎస్ బృందం సందర్శించింది. అక్కడ జరుతున్న పనులు చూసి అవాక్కయ్యారు. అక్కడే ఉన్న మాన్వీ తాసీల్దార్‌తో ఇది అక్రమ ఎత్తిపోతల పథకమని.. దీన్ని ఎలా నిర్మిస్తున్నారని ప్రశ్నించారు.

ఆయన కర్ణాటక ప్రభుత్వం అనుమతులు ఇచ్చిందని, అందుకే నిర్మిస్తున్నామని తెలిపారు. తెలంగాణ నుంచి మేము వచ్చి ఎత్తిపోతల పథకాన్ని పరిశీలించినట్లు, దీని వెంటనే ఆపాలని డిమాండ్ చేసినట్లు మీ ప్రభుత్వానికి తెలియజేయాలని సూచించారు. అనంతరం పార్టీ నేతలంతా ఆర్డీఎస్ కుడి వైపున ఏపీ ప్రభుత్వం అక్రమంగా నిర్మించిన కుడి కాల్వ హెడ్ రెగ్యులేటరీని పరిశీలించారు. అక్రమ పనులను వెంటనే నిలిపివేయాలని వారు డిమాండ్ చేశారు. ఆర్డీఎస్ పరిశీలించి చూసి ఇక్కడి పరిస్థితులను చూస్తుంటే చాలా బాధాకరంగా ఉన్నాయని ఆవేదన చెందారు. ఇప్పటికైనా తెలంగాణ ప్రభుత్వం నిద్రవస్థను వీడి కర్ణాటకలో నిర్మిస్తున్న అక్రమ ఎత్తిపోతల పనులను, ఏపీలో నిర్మించనున్న పనులను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు.

గద్వాల, జూలై 8 : కర్ణాటక రాష్ట్రం రాయిచూర్ జిల్లా మాన్వి తాలూకాలో ఆర్డీఎస్ ప్రాజెక్టును బుధవారం ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రులు శ్రీనివాస్‌గౌడ్, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీలు చల్లా వెంకట్రామిరెడ్డి, నవీన్‌కుమార్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు చిట్టెం రామ్మోహన్‌రెడ్డి, అంజయ్యయాదవ్, జైపాల్‌యాదవ్, పట్నం నరేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్‌కుమార్, సాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, గద్వాల నియోజకవర్గ ఇన్చార్జి బాసు హనుమంతునాయుడు క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. ఆర్డీఎస్ వద్ద కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలు అక్రమంగా ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నాయని తెలుసుకొని క్షేత్రస్థాయిలో బృందం పరిశీలించింది. కురిడి ఎత్తిపోతల పనులను, ఆర్డీఎస్ ఆనకట్ట వద్ద పేరుకుపోయిన సిల్ట్‌ను, కాల్వకు నీటిని విడుదల చేసే షటర్లను పరిశీలించారు.
శిథిలావస్థకు చేరిన ఆనకట్టను పరిశీలించి రాయలసీమకు అక్రమంగా నీటిని తరలించుకు వెళ్తున్న షటర్ల వద్దకు వెళ్లారు. అక్కడ ఒక షటర్‌కు గేటు బిగించకుండా ఉండడంతో నీరు దిగువకు వృథా వెళ్తున్న విషయాన్ని గుర్తించారు. ఐదు లిఫ్ట్‌లు ఏర్పాటు చేసి కుడి కాల్వ ద్వారా నీరు తరలించడానికి సీమ నేతలు ఏర్పాటు చేసి వదిలేసిన లిఫ్ట్ పనులను పరిశీలించింది. అక్కడ ఉన్న కర్ణాటక అధికారులతో మాట్లాడి ప్రాజెక్టు వివరాలు తెలుసుకున్నారు. ఇటు కర్టాటక, అటు సీమ నాయకుల జల దోపిడీతో నడిగడ్డలోని ఆర్డీఎస్ రైతాంగాన్ని ఆగం చేయడానికి కుట్రలు చేయడాన్ని వ్యతిరేకిస్తూ బృందం నినాదాలు చేసింది. ఆర్డీఎస్ను కాంగ్రెస్ ప్రభుత్వం పట్టించుకోకపోతే నడిగడ్డ ఎడారిగా మారే అవకాశం ఉందని ఆవేదన వ్యక్తం చేసింది. నిర్మాణాలను పరిశీలించడానికి వచ్చారన్న విషయం తెలుసుకున్న కన్నడ పోలీసులు అక్కడికి చేరుకొని నాయకుల వివరాలు సేకరించారు. పరిశీలించిన వారిలో బీఆర్ఎస్ నాయకులు నాగర్‌దొడ్డి వెంకట్రాములు, కురుమ విజయ్‌కుమార్, రాఘవేంద్రారెడ్డి, జనార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, కుర్వ పల్లయ్య తదితరులు ఉన్నారు.
కర్ణాటక, ఏపీ, తెలంగాణకు చెందిన ముగ్గురు ముఖ్యమంత్రులు కలిసి తెలంగాణకు నష్టం చేకూర్చే ప్రయత్నం చేస్తున్నారని మాజీ మంత్రి వీ శ్రీనివాస్‌గౌడ్ ఆరోపించారు. ఆర్డీఎస్ ప్రాజెక్టును పరిశీలించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ వ్యవసాయం మీదనే ఆధారపడ్డ మహబూబ్‌నగర్‌కు చుక్క నీరు రాకుండా కుట్రలు చేస్తున్నారన్నారు. లెఫ్ట్ కెనాల్ మొత్తం నీరు రాకుండా చేసిండ్రు.. నడిగడ్డ ఒక్కటే కాదు ఉమ్మడి జిల్లాకు నష్టం జరుగుతుందన్నారు. ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాకు సాగునీరు రాకుండా చేసేందుకు కుట్ర చేస్తుంటే కాంగ్రెస్ నాయకులు అడ్డుకోకుంటే చరిత్ర హీనూలుగా మిగిలి పోతారన్నారు. ఈ ప్రాంత ప్రయోజనాలు ఫణంగా పెడితే ప్రజలు తిరగబడతారన్నారు. ముఖ్యంగా ముగ్గురు సీఎంలు రహస్యంగా ఏం మాట్లాడుతున్నారో బయటపెట్టాలని డిమాండ్ చేశారు. ఆధిత్యనాథ్ దాస్‌ను మన నీటిని తీసుకుపోయేందుకు సలహాదారుగా నియామకం చేశారన్నారు. తెలంగాణకు అన్యాయం చేసే అధికారులపై రాబోయే రోజుల్లో కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు అక్రమంగా నిర్మాణం చేసిన ప్రాజెక్ట్‌లపై అనుమతి ఇచ్చారా లేదా కాంగ్రెస్ మంత్రులు చెప్పాలన్నారు. తూములు బద్ధలు కొట్టి రైట్ కెనాల్ ద్వారా సుంకేసులకు నీరు తరలించాలని చూస్తే మేము అడ్డుకున్నాం.. ఇప్పుడు నీళ్లు తీసుకెళ్లేందుకు అన్ని పనులు పూర్తి చేసారన్నారు. బీఆర్ఎస్ అధికారంలోకి వచ్చాకా అక్రమంగా నిర్మించిన ప్రాజెక్టులను బద్దలు కొడ్తాం. రైతులను కాపాడుకుంటామన్నారు. ఆర్డీఎస్ సమస్యలను బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి భవిష్యత్ కార్యాచరణను రూపొందిస్తామని, కర్ణాటక, ఏపీ రాష్ర్టాలు చేస్తున్న జలదోపిడీపై ప్రజలను చైతన్యవంతం చేస్తామని పేర్కొన్నారు.
తుంగభద్ర జలాల దోపిడీతో ఆర్డీఎస్ ఆయకట్టు ఎడారిగా మారుతుందనీ మాజీ మంత్రి లక్ష్మారెడ్డి అన్నారు. చుక్క నీళ్లు కూడా కిందికి రాకున్నా తెలంగాణ ప్రభుత్వం చూస్త్తూ కూర్చుంది తప్పా.. దీనిపై స్పందించడం లేదన్నారు. కొడంగల్‌కు ఎన్వోసీ కోసం ఏపీ, కర్ణాటక మిగతా ప్రాజెక్టులకు రేవంత్ ఎన్వోసీ ఇచ్చినట్లు సమాచారం.. ఇదే కనుక నిజమైతే మరొకటి లేదన్నారు. కొడంగల్ లిఫ్ట్ అనేది అనవసరమైన ప్రాజెక్ట్ అని దాని కోసం మన హక్కులు కోల్పోతున్నాం అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.
ముఖ్యంగా ఏపీ, కర్ణాటకలు చేపడుతున్న అక్రమ ప్రాజెక్టు పనులను చూద్దామని వచ్చామని, ఇక్కడ చూస్తే కర్ణాటక ఆర్డీఎస్ కింద మీద ఎత్తిపోతల పథకాలు చేపట్టి రెండు, మూడు టీఎంసీలు చౌర్యం చేసేందుకు కుట్రలు చేస్తుండగా ఏపీ సైతం కుడి కాల్వ నిర్మించి నీటిని తరలించుకుపోయే కుట్రలు చేస్తున్నదని ఈ నిర్మాణాలు పూర్తయితే నడిగడ్డ పూర్తిగా ఎడారిగా మారే అవకాశం ఉందన్నారు. ఆర్డీఎస్ రైతుల కష్టాలు తెలుసుకునేందుకు కేసీఆర్ పాదయాత్ర చేశారని, ఆర్టీఎస్ రైతులకు జరుగుతున్న అన్యాయాన్ని అరికట్టడానికి తుమిళ్ల ఎత్తిపోతలను ప్రారంభించి నీరు అందిం చేందుకు చర్యలు తీసుకున్నారని గుర్తు చేశారు.
నేడు ఏపీ, కర్ణాకటలు చేస్తున్న నీటి చౌర్యంతో భవిష్యత్‌లో శ్రీశైలం వరకు నీళ్లు వచ్చే పరిస్థితి లేదన్నారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రభుత్వం కండ్లు మూసుకొని కూర్చోవడం తగదని, వెంటనే స్పందించి మంత్రుల బృందం ఆర్డీఎస్ను, దానిపై ఏపీ, కర్ణాటక రాష్ట్రాలు చేడపతున్న అక్రమ ప్రాజెక్టులను అడ్డుకొని మహబూబ్‌నగర్ రైతుల హక్కులు కాపాడాలని కోరారు.