వంగూరు, ఏప్రిల్ 19 : కొనుగోలు కేంద్రాలు లేక రైతుల మొక్కజొన్న పంట కల్లాల్లో మగ్గుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని మార్కె ట్ మాజీ వైస్ చైర్మన్ మందా రాజేందర్‌రెడ్డి, బీఆర్ఎస్ నేతలు నర్సింహారెడ్డి, అంకు సురేందర్ డిమాండ్ చేశారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని డి మాండ్ చేస్తూ ఆదివారం మండలంలోని రంగాపూర్ సింగిల్‌విండో కార్యాలయం ఎదుట బీఆర్ఎస్ ఆధ్వర్యం లో ఆందోళన చేపట్టారు.
అనంతరం వారు మాట్లాడుతూ సీఎం సొంత మండలంలో రైతులకు కష్టాలు తప్పడం లేదన్నారు. పంటల సాగు చేసినప్పుడు యూరియా కష్టాలు, పంట చేతికొచ్చిన తర్వాత కొనుగోలు కేంద్రాలు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కాంగ్రెస్ ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. ఇదేనా ప్రజాపాలన అంటూ వారు ఘాటుగా ప్రశ్నించారు. గతం లో బీఆర్ఎస్ పనిచేసిన నాయకులు నేడు కాంగ్రెస్‌లో ఉన్నారని వారికి తెలియదంటూ వారు విమర్శించారు.
గత బీఆర్ఎస్ పాలనలో రైతుల పంటలు చేతికొచ్చిన వెంటనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులకు అండగా నిలిచిన ఘటనలు నేడు కాంగ్రెస్‌లో మండల పదవుల్లో ఉన్నవారు మర్చిపోయారని వారు గుర్తు చేశారు. ఏదిఏమైనా రెండు, మూడురోజుల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోతే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రైతులతో కలిసి సింగిల్‌విండో కార్యాలయాన్ని ముట్టడిస్తామని వారు హెచ్చరించారు. కార్యక్రమంలో రంగాపూర్ ఉప సర్పంచ్ రామస్వామి, నాయకులు నర్సింహ, కృష్ణయ్య, తిరుపతయ్య, శాయిబాబు, జగన్, సతీశ్‌తో పాటు కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.