మోదీ సర్కార్ గ్యాస్ సిలిండర్ ధరలను అమాంతం పెంచుకుంటూ పోతున్నది. ఎనిమిదేండ్లలోనే మూడు రెట్లు పెంచి పేదల నడ్డి విరిచింది. సిలిండర్ ధరను పిరం చేసి.. సామాన్యుల బతుకు భారంగా మారుస్తున్నది. కేంద్ర ప్రభుత్వ తీరుపై విసుగు చెందిన బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు, మహిళలు గురువారం నిరసన వ్యక్తం చేశారు. ధరలు తగ్గించడంలో కేంద్రం విఫలమైందంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. కట్టెల పొయ్యే దిక్కయ్యేలా చేస్తున్నారంటూ మండిపడ్డారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో ఎక్సైజ్, క్రీడా శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ మహిళలతో కలిసి ధర్నా చేశారు. భారీ ఎత్తున సిలిండర్లను ప్రదర్శించి ఆందోళన చేపట్టారు. గద్వాల పట్టణంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ సరిత హాజరై వంటావార్పు నిర్వహించారు. ప్రజలు, మహిళలతో కలిసి రోడ్డుపై భోజనం చేశారు. కాగా, నేడు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు యుద్ధభేరి మోగించేందుకు సన్నద్ధమవుతున్నారు.
మహబూబ్‌నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం వంట గ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ మున్సిపాలిటీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పిలుపు మేరకు ఉమ్మడి జిల్లాలోని కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా భారీ నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంతోపాటు, మండలాలు ఆయా గ్రామాల్లో బీఆర్ఎస్ నేతలు రోడ్లపైకి సిలిండర్లను తీసుకొచ్చి ఆందోళన వ్యక్తం చేశారు. కేంద్రంలో అధికారం చేపట్టిన బీజేపీ ప్రభుత్వం రూ.400 ఉన్న వంటగ్యాస్‌ను ఏకంగా రూ.1200కు పెంచడంతో పేద, మధ్య తరగతి ప్రజలు గ్యాస్‌ను మర్చిపోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని దుయ్యబట్టారు. చివరకు కట్టెల పొయ్యే దిక్కని వాపోతున్నారు. ప్రజావ్యతిరేక విధానాలను నిరసిస్తూ అవసరం అయితే ఢిల్లీకి వెళ్లి పోరాడతామని మంత్రులు, ఎమ్మెల్యేలు హెచ్చరించారు.
నల్లదుస్తులతో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నిరసన
గ్యాస్ ధరను అమాంతం పెంచడంతో గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో జరిగిన నిరసన ప్రదర్శనకు ఎక్సైజ్, క్రీడాశాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నల్లదుస్తులతో హాజరయ్యారు. మహిళలతో కలిసి పెద్దఎత్తున ధర్నాలో పాల్గొన్నారు. గద్వాల జిల్లాకేంద్రంలో ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, జెడ్పీ చైర్మన్ సరిత పాల్గొన్నారు. మక్తల్, ఆత్మకూర్, అమరచింత, ఊట్కూరు మండలకేంద్రాల్లో నిరసన వ్యక్తం చేశారు. ఆయా గ్రామాల్లో బీజేపీకి వ్యతిరేకంగా నిరసన ప్రదర్శనలు నిర్వహించారు. ప్రధాని మోదీ డౌన్ డౌన్ అంటు నినాదాలు చేశారు. పెంచిన గ్యాస్ ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శించారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలో గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రాజేశ్వర్‌గౌడ్, మున్సిపల్ చైర్మన్ నర్సింహులు, ముడా చైర్మన్ గంజి వెంకన్న, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు గోపాల్‌యాదవ్, డీసీసీ వైస్‌చైర్మన్ వెంకటయ్య, మార్కెట్ కమిటీ చైర్మన్ రెహమాన్, గొర్రెల కాపరుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు శాంతన్నయాదవ్, మున్సిపల్ వైస్‌చైర్మన్ గణేష్, గిరిధర్‌రెడ్డి, శివరాజ్, వినోద్, ఎంపీపీ సుధశ్రీ, జెడ్పీటీసీలు, కౌన్సిలర్లు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజాప్రతినిధులు, మహిళలు పాల్గొన్నారు.
మహబూబ్‌నగర్ తెలంగాణ చౌరస్తాలో చేపట్టిన ధర్నాలో ఫ్లకార్డులు ప్రదర్శిస్తున్న మంత్రి శ్రీనివాస్‌గౌడ్
గద్వాల పట్టణంలో కట్టెల పొయ్యిపై అన్నం వండుతున్న ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, చిత్రంలో జెడ్పీ చైర్పర్సన్ సరిత
ధరలు తగ్గించకుంటే ఢిల్లీకి వస్తాం
– ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్
మహబూబ్‌నగర్, మార్చి 2 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): కేంద్ర ప్రభుత్వం పేదలపై దుర్మార్గంగా వ్యవహరిస్తుందని, గ్యాస్ ధర పెంచి పేదల నడ్డీవిరుస్తున్న మోదీ చర్యలకు వ్యతిరేకంగా అవసరమైతే ఢిల్లీ వేదికగా పోరాటం చేస్తామని ఎక్సైజ్‌శాఖ మంత్రి శ్రీనివాస్‌గౌడ్ హెచ్చరించారు. గురువారం మహబూబ్‌నగర్‌లో వంటగ్యాస్ ధర పెంచడాన్ని నిరసిస్తూ సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపుమేరకు తెలంగాణచౌరస్తాలో భారీ ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్ నల్లదుస్తులు ధరించి నిరసన తెలిపారు. మహిళలతో కలిసి ఖాళీ గ్యాస్ సిలిండర్లను ప్రదర్శించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అవసరమైతే లక్షలాది మంది మహిళలను ఢిల్లీకి తీసుకెళ్లి పెంచిన ధరలపై, ప్రజావ్యతిరేక చర్యలపై పోరాటం చేస్తామన్నారు. దేశంలో ఎన్నికలు ఎప్పుడయిపోతాయో అప్పుడు కేంద్రం పేదలపై భారం మోపే చర్యలకు పూనుకుంటుందని.. వంటగ్యాస్ ధరను అమాంతం పెంచి పేదల బతుకుల మీద భారీ భారం పడేలా చేసిందని విమర్శించారు. 2014లో రాష్ట్రంలో కేసీఆర్, దేశంలో మోదీ ప్రభుత్వాలు ఒకేసారి ఏర్పడ్డాయని.. రాష్ట్రంలో ప్రజలకు ఇవ్వని వాగ్ధానాలు కూడా నేరవేర్చి దేశంలో ఇవ్వాళ తెలంగాణను నెంబర్‌వన్‌గా తీర్చిదిద్దారన్నారు. ప్రధాని మాత్రం ఇచ్చిన హామీలను తుంగలో తొక్కాడని.. ఏటా రెండు కోట్ల ఉద్యోగాలు ఏమాయ్యాయి? నల్లధనం రప్పించి పేదవాడి ఖాతాల్లో రూ.15లక్షలు జమ చేస్తామన్న హామీలు ఏమయ్యాయని ప్రశ్నించారు. 2014లో గ్యాస్ ధర రూ.400 ఉంటే ప్రస్తుతం సిలిండర్ ధర రూ.1200 చేరిందని ఈ పాపం ఎవరిదని నిలదీశారు.
మహబూబ్‌నగర్ జిల్లాకేంద్రంలో నిరసన వ్యక్తం చేస్తున్న ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ శ్రేణులు, కౌన్సిలర్లు, మహిళలు
పేటలో మాట్లాడుతున్న పీవోడబ్ల్యూ సహాయ కార్యదర్శి విజయలక్ష్మి
ఆత్మకూర్‌లో మాట్లాడుతున్న మున్సిపల్ చైర్పర్సన్ గాయిత్రీదేవి
అభివృద్ధిని అడ్డకునేందుకే కుట్రలు
మహబూబ్‌నగర్‌లో తెలంగాణ వచ్చాక చేపట్టిన అభివృద్ధిని చూసి ఓర్వలేక అనేక అబద్దాలు ప్రచారం చేస్తున్నారని, దేశంలో మొట్టమొదటి లిథియం పరిశ్రమ వస్తుంటే అభివృద్ధి నిరోధకులు అడ్డకునేందుకు కుట్రలు పన్నుతున్నారని విమర్శించారు. ప్రపంచంలో గూగుల్‌లో వెతికిన మన ప్రాంతం ఉనికిని ఘనంగా చాటిచెప్పే ప్రయత్నం జరుగుతుంటే దీన్ని అడ్డుకునేందుకు కుటిల యత్నాలు చేస్తున్నారన్నారు.
కేంద్రం తీరుపై మహిళల ఆందోళన
నారాయణపేట, మార్చి 2: కేంద్ర ప్రభుత్వం తొమ్మిదేండ్లుగా సిలిండర్ ధరలను పెంచడంపై మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 2014కు ముందు కేం ద్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సిలిండర్ ధరలను నామమాత్రంగా పెంచితే దేశవ్యాప్తంగా గగ్గోలు చేపట్టిన బీజీపీ నేడు ప్రభుత్వంలో ఉండి రెండింతలు గ్యాస్ సిలిండర్ ధర పెంచి సామాన్యుల నడ్డి విరుస్తుందని సామాన్య, మధ్య తరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2014లో రూ.410 ఉన్న 14.5 కేజీల సిలిండర్ ధర ప్రస్తుతం రూ. 1200కు చేరుకోవడం తో సిలిండర్ వినియోగించే వారు తక్కువయ్యారు. వీటికితోడు ప్రధానమంత్రి ఉజ్వల యోజన కింద ఉచితంగా గ్యాస్ కనెక్షన్లు ఇచ్చినా పెరిగిన సిలిండర్ ధరను మోయలేని ప్రజలు తిరిగి గ్యాస్ సిలిండర్ తీసుకోవడానికి ఆసక్తి కనబర్చడం లేదు. నారాయణపేట జిల్లాలో 1,41,905గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. వీటిలో 1,41,226 డొమెస్టిక్ సిలిండర్లు, 679 కమర్షియల్ సిలిండర్లు ఉన్నాయి. కేంద్రం దిగొచ్చి గ్యాస్ సిలిండర్ ధరను సామాన్య ప్రజలకు అందుబాటు ధరలో ఉండాలని ప్రజలు కోరుతున్నారు.
ఇబ్బందుల్లో సామాన్య ప్రజలు
నిత్యావసర వస్తువుల్లో ఒకటైన గ్యాస్ సిలిండర్ ధరను కేంద్రం రోజు రోజుకూ పెంచడంతో సామాన్య ప్రజలు ఇబ్బందు పడుతున్నారు. యూపీఏ ప్రభుత్వంలో గ్యాస్ ధరలు పెరిగితే బీజేపీ ప్రభుత్వంలో ఉన్న మంత్రి స్మృతిఇరానీ ఆనాడు రోడ్డెక్కి నానా హంగామా చేసింది. మరి నేడు బీజేపీ ప్రభుత్వం గ్యాస్ ధరలను రెండింతలు పెంచితే మహిళల తరఫున మీ ప్రభుత్వాన్ని ఎందుకు నిలదీయడం లేదు. కేంద్రం తన తీరును మార్చుకొని గ్యాస్ సిలిండర్ ధరను సామాన్య ప్రజలకు అందుబాటులో ఉండేలా చూడాలి.
– రాజేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, నారాయణపేట
ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ధ్యేయం
– ఎమ్మెల్యే బండ్ల, జెడ్పీ చైర్పర్సన్ సరిత
గద్వాల, మార్చి 2: ప్రజాసంక్షేమమే బీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయమని గద్వాల ఎమ్మెల్యే, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కృష్ణమోహన్‌రెడ్డి అన్నారు. కేంద్ర ప్రభుత్వం పెంచిన గ్యాస్ సిలిండర్ ధరలు తగ్గించాలని బీఆర్ఎస్ ఆధ్వర్యంలో జిల్లాకేంద్రంలోని పాతబస్టాండ్‌లో మహాధర్నా నిర్వహించారు. ధర్నాకు ఎమ్మెల్యే బండ్ల హాజరుకాగా జెడ్పీ చైర్పర్సన్ సరితతోపాటు మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో మహిళలను ఉద్ధేశించి ఎమ్మెల్యే మాట్లాడారు. రాష్ట్ర అభివృద్ధికి సీఎం కేసీఆర్ పోరాడి తెలంగాణను సాధించారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలపై ఆర్థిక భారం పడొద్దనే ఆలోచనతో వారికి అవసరమైన వాటిని ప్రభుత్వం అందిస్తూ చేయూతనిస్తుంటే కేంద్రంలోని మోదీ ప్రభుత్వం నిత్యావసర సరుకులతోపాటు డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు పెంచి సామాన్య ప్రజలకు అందనంత దూరం చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ ప్రభుత్వంలో సామాన్య ప్రజలు ఏం కొనలేక, తినలేక, బతకలేని పరిస్థితి నెలకొందన్నారు. ప్రజలకు సిలిండర్లు అలవాటు చేసి అనంతరం కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ధరలు పెంచుతూ పోతుందని దీంతో ప్రజలు తిరిగి కట్టెల పొయ్యివైపు మళ్లే అవకాశం ఉందన్నారు. ఎల్ఐసీ లాంటి ప్రభుత్వరంగ సంస్థలను బీజేపీ ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిందని చెప్పారు. ప్రస్తుతం బీజేపీ నాయకులు ఊర్లోకు వచ్చి కళ్లి బొళ్లి మాటలు చెబుతున్నారని, వారిపై ప్రజలు అప్రమత్తంగా ఉంటూ వారిని ఎక్కడికక్కడే నిలదీయాలన్నారు. ధరలు తగ్గించే వరకు పోరాటాలను కొనసాగిద్దామని మహిళలకు పిలుపునిచ్చారు. అనంతరం రోడ్డుపై కట్టెల పొయ్యితో వంటావార్పు నిర్వహించారు.
మోదీ అదానీ, అంబానీలకు సహకరిస్తున్నారు
ప్రధానీ మోదీ దేశంలోని పేదలకు అన్యాయం చేస్తూ వారిపై మోయలేని భారం మోపుతూ అదాని, అంబానీలకు సహకరిస్తున్నారని జెడ్పీచైర్‌పర్సన్ సరిత ఆరోపించారు. ఆడపిల్లలను కష్టపెట్టిన ఏ ప్రభుత్వం ఎక్కువకాలం మనుగడ సాగించలేదని తెలిపారు. కేంద్రం గ్యాస్ ధరలు పెంచి పేదల వంటింట్లో మంట పెట్టిందని విమర్శించారు. గతంలో రూ.400 ఉన్న సిలిండర్ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే విడుతల వారీగా పెంచుతూ సామాన్య ప్రజలపై మోయలేని భారం పెడుతున్నారన్నారు. సామాన్య ప్రజలకు ప్రస్తుతం సిలిండర్ ధరలు గుదిబండగా మారాయని చెప్పారు.
దేశం, రాష్ట్రంలో బీజేపీ నాయకులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. పెంచిన సిలిండర్ ధరలు వెంటనే తగ్గించాలని, లేనిపక్షంలో వచ్చే ఎన్నికల్లో మహిళలంతా ఏకమై బుద్ధి చెబుతామన్నారు. కేంద్రం తెలంగాణ, ప్రజలపై సవతి తల్లి ప్రేమ చూపుతుందని ఆరోపించారు. దేశ ప్రజల సంక్షేమానికి సీఎం కేసీఆర్ బీఆర్ఎస్ ఏర్పాటు చేశారని చెప్పారు. బీజేపీ ఆగడాలను అడ్డుకోవడం బీఆర్ఎస్కే సాధ్యమన్నారు. అనంతరం ధర్నా నిర్వహించిన చోట మహిళలు భోజనాలు చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్‌చైర్మన్ బాబర్, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ రామన్‌గౌడ్, జములమ్మ ఆలయ చైర్మన్ సతీష్‌కుమార్, జెడ్పీటీసీ రాజశేఖర్, కౌన్సిలర్లు దౌలు, శ్వేత, లక్ష్మీ, నాగిరెడ్డి, మురళి, శ్రీను, శ్రీమన్నారాయణ, కృష్ణ, మార్కెట్ కమిటీ మాజీ చైర్పర్సన్ రామేశ్వరమ్మ, నాయకులు రమేశ్‌నాయుడు, గోవిందు, సాయిశ్యాంరెడ్డి, చక్రధర్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.