వెల్దండ మార్చి 27 : ఇందిరమ్మ పాలన అంటే అక్రమ అరెస్టులేనా? అని బీఆర్ఎస్ నాయకులు పోలె అశోక్, మాజీ ఎంపీటీసీ, మాజీ ఉప సర్పంచ్ నిరంజన్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. గురువారం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో అసెంబ్లీ ముట్టడి నేపథ్యంలో వెల్డండ పోలీసులు వారిని అరెస్ట్ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో రేవంత్ రెడ్డి నిర్బంధ పాలన కొనసాగిస్తున్నాడని, హామీల అమలుపై ప్రశ్నించే గొంతుకులను అణచివేస్తున్నారని మండిపడ్డారు. కాంగ్రెస్ పాలనలో ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోయిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలపై అసెంబ్లీలో మా నాయకులు నిలదీస్తుంటే వారికి సమాధానం చెప్పలేక ఇలా అక్రమ అరెస్టులు చేయిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్రమ అరెస్టులతో బీఆర్ఎస్ పార్టీని దెబ్బ కొట్టే ప్రయత్నం చేస్తున్నారని, రాష్ట్రవ్యాప్తంగా బీఆర్ఎస్ నాయకుల అక్రమ అరెస్టులను తీవ్రంగా ఖండిస్తున్నట్లు పేర్కొన్నారు. రైతులకు పూర్తిగా రుణమాఫీ చేయలేదని, రైతుబంధు ఇప్పటి వరకు ఏ ఒక్క రైతుకు పూర్తి చేయలేదని, కల్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఇస్తానని ఎన్నికల్లో చెప్పిన ఇప్పటివరకు ఏ ఒక్క ఆడబిడ్డకు తులం బంగారం ఇవ్వలేదన్నారు.
చదువుకున్న ఆడబిడ్డలకు స్కూటీలు ఇస్తానని మభ్యపెట్టి ఎన్నికలప్పుడు ఇచ్చిన ఏ ఒక్క హామీని పూర్తిగా నెరవేర్చపోగా.. హామీలన్నీ నెరవేరుస్తున్నామని ఇప్పటికీ ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్న ఘనత రేవంత్ రెడ్డి ప్రభుత్వానికే చెల్లిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో సీనియర్ నాయకులు కొమ్ము నాగయ్య, సిరసనగండ్ల శేఖర్, అంజయ్య, సాయిలు, వెంకటయ్య, రవి, జగన్, కార్యకర్తలను అరెస్టు చేశారు.