గద్వాల, జూన్ 18 : రైతు ద్రోహి రేవంత్‌రెడ్డి ఖబడ్దార్ అంటూ బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు కుర్వ విజయ్‌కుమార్ హెచ్చరించారు. రైతులను దొంగలు, కూనీకోర్లుగా బేడీలు వేసి కోర్టుకు తీసుకురావడం సిగ్గు చేటన్నారు. ఇథనాల్ ఫ్యాక్టరీ యజమాన్యానికి కాంగ్రెస్ ప్రభుత్వం అమ్ముడుపోయిందని బుధవారం ప్రకటనలో ఆయన ఆరోపించారు.
ఇథనాల్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా రాజోళి మండలంలోని పెద్దధన్వాడ గ్రామంతో పాటు మరి కొన్ని గ్రామాల ప్రజలు వ్యతిరేకిస్తుంటే, కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక కాంగ్రెస్ పార్టీ నాయకులు కంపెనీకి ఒత్తాసు పలుకుతూ రైతులపై అక్రమ కేసులు నమోదు చేసి జైలుకు పంపారన్నారు. కోర్టు విధించిన 14రోజుల రిమాండ్ ముగియడంతో పోలీసులు అలంపూర్ కోర్టులో హాజరు పరిచేందుకు రైతులను తీసుకొచ్చిన సందర్భంలో అన్నదాతల చేతులకు బేడీలు వేసిన పోలీసులను తక్షణమే సస్పెండ్ చేయాలని పేర్కొన్నారు. సీఎం రేవంత్ పాలమూరు రైతులపై పగబట్టారని ఆరోపించారు.
మొన్న సొంత నియోజకవర్గం కొడంగల్‌లోని లగచర్ల గిరిజన రైతులకు బేడీలు వేసి జైలుకు పంపిన చరిత్ర రేవంత్‌రెడ్ది ప్రభుత్వానిది అన్నారు. ఇప్పుడు అదే పాలమూరు నుంచి అలంపూర్ నియోజకవర్గంలోని రాజోళి మండలం పెద్దధన్వాడ రైతులపై అక్రమ కేసులు పెట్టి ఈ రోజు బేడీలు వేశారన్నారు. అన్నం పెట్టే అన్నదాతలంటే నీకు ఎందుకంత కోసం అని ప్రశ్నించారు. తక్షణమే పెద్దధన్వాడ గ్రామ రైతులకు క్షమాపణ చెప్పాలని, వారిపై పెట్టిన అక్రమ కేసులను కొట్టి వేయాలని డిమాండ్ చేశారు.