నాగర్‌కర్నూల్, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్నస్వామి జాతరలో అకారణంగా చాకలి చంద్రకళ అనే మహిళ కుటుంబంపై దాడిచేసి చిన్నారి మరణానికి కారకులైన కాంగ్రెస్ గుండాలను అరెస్టు చేయాలని నాగర్‌కర్నూల్ మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. ఆదివారం బా ధిత కుటుంబాన్ని మర్రి జనార్దన్‌రెడ్డి పరామర్శించి జరిగిన ఘటన గురించి తెలుసుకున్నారు. అనంతరం రూ.లక్ష తక్షణ ఆర్థికసాయం అందజేశారు. అధికార బలం, కుల అహంకారంతో కాంగ్రెస్ పార్టీ సర్పంచ్‌తోపాటు అతని వర్గీయులు ఎనిమిది మంది కుటుంబంపై దాడి చేయడం బాధకరమన్నారు.
ఆడవారు అనికూడా చూడకుండా చెప్పరానిచోట తాకుతూ దౌర్జన్యానికి పాల్పడి దాడి చేయడం అధికార అహంకారానికి నిదర్శనమన్నారు. బాధితులతో కలిసి పోలీస్‌స్టేషన్‌కు వచ్చిన మర్రి దాడిచేసిన వారిని ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని పోలీసులను ప్రశ్నించారు. నలుగురు చొప్పున విడుతల వారీగా రెండు గంటలపాటు చంద్రకళ కుమారుడు గణేశ్‌పై దాడికి పాల్పడ్డారని, వదిలిపెట్టాలని ప్రాధేయపడినా గుండాల్లా వ్యవహరిస్తూ పసికందు మరణానికి కారకులైన కాంగ్రెస్ గుండాలపై మర్డర్‌కేసు నమోదు చేసి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు.
ఎవరూ లేరనే ఉద్దేశంతో దాడిచేశారని భర్త, అత్తను కొడుతుంటే చూడలేక అడ్డుకున్న మౌనికను తన రెండు నెలల పాపను కిందపడేసి తన్నడంతోనే చిన్నారి మెదడుకు దెబ్బ తగిలి మరణించిందన్నారు. ఇంత జరిగినా ఫిర్యాదు చేసినా బాధితుపైలపైనే కేసు పెట్టకపోవడంలో అనేది దారుణం అన్నారు. పోలీస్ వ్యవస్థ ఎవరికి పనిచేస్తుందని, ఎవరి కనుసన్నల్లో నడుస్తుందని మర్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. దాడిచేసిన వారిని వదిలేసి ఫిర్యాదు చేసిన బాధితులపైనే కేసు పెట్టడం అనేది కాంగ్రెస్ పాలనలో పనిచేస్తున్న పోలీసులకే చెల్లిందని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ వచ్చిన తర్వాత రాష్ట్రంలో రాచరికపాలన వచ్చిందని, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సొంత జిల్లాలో ఇలాంటి ఘటనలు జరిగితే మిగతా ప్రాంతాల్లో పరిస్థితి ఏమిటని మండిపడ్డారు.

ఈ నియోజకవర్గంలో ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కనుసన్నల్లో పోలీసులు పనిచేస్తున్నారని ఆరోపించారు. పసికందు మరణానికి మీరు.. మీ నాయకులు కారకులు కాకపోతే దమ్ముంటే ముం దుకు వచ్చిన బాధితులకు న్యాయం చేయాలని, చిన్నారి మరణానికి కారకులైన వారిపై మర్డర్‌కేసు పెట్టి రిమాండ్‌కు తరలించాలని డిమాండ్ చేశారు. ప్రజలపైన ప్రేమ ఉన్న ఎమ్మెల్యే అయితే వారికి శిక్ష పడకుండా ఎందుకు అడ్డుకుంటున్నారని, ఎందుకు అరెస్టు చేయలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రజలు ఓట్లేసి గెలిపిస్తే వారికి అన్యాయం చేస్తూ మీ నాయకులు, కార్యకర్తలను వెనుకేసుకురావడం ఏంటని నిలదీశారు. కుటుంబంపై దాడి జరిగిన సంఘటనలో మీకు సంబంధం లేకపోతే ఆ కుటుంబాన్ని ఇప్పటి వరకు ఎందుకు పరామర్శించలేదని ఎమ్మెల్యే రాజేశ్‌రెడ్డిని మర్రి సూటిగా ప్రశ్నించారు. లోలోపల ఎస్పీకి, డీఎస్పీకి ఫోన్లు చేసి తన కార్యకర్తలను కాపాడుకునే ప్రయత్నం చేయడం ఏమిటని ప్రశ్నించారు. పసికందు మరణంపై కోర్టు సుమోటా తీసుకొని
బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఎనిమిది మంది దాడిచేస్తే కేవలం ఇద్దరు ముగ్గురిపైనే కేసులు ఎందుకు చేస్తున్నారు..? వారిని ఎందుకు కాపాడుకునేందుకు ప్రయత్నం చేస్తున్నరని ప్రశ్నించారు. ఇప్పటికైనా పోలీసులు బాధితుల వైపు ఉండి దాడికి పాల్పడిన వారందరిపైనా మర్డర్‌కేసు పెట్టి అందరికీ శిక్ష పడే విధంగా చూడాలని డిమాండ్ చేశారు. ఇల్లు మంజూరైనా ఇవ్వకుండా చేశారని బాధితులు ఆరోపిస్తున్నరని, వారికి బీర్ఎస్ పార్టీ అండగా ఉంటుందన్నారు. బాధిత కుటుంబానికి ఇంటి నిర్మాణానికి సహకరిస్తామని మర్రి హామీ ఇచ్చారు.
పోలీస్‌స్టేషన్ ఎదుట ధర్నా..
చిన్నారి మరణానికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసిన బాధితులకు అన్యా యం చేసేందుకు ప్రయత్నిస్తున్న పోలీస్ వ్యవస్థను నిర్లక్ష్యానికి నిరసనగా ఆదివారం మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్‌రెడ్డి ఆధ్వర్యంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజా సంఘాల నాయకులు ధర్నాకు పూనుకున్నారు. మర్రి జనార్దన్‌రెడ్డి పోలీస్‌స్టేషన్ ఎదురుగా రోడ్డుపై బైఠాయించి నిందితులను పట్టుకొచ్చే వరకు ఆందోళన విరమించమని హెచ్చరించారు. మూడు రోజుల కిందట దాడి జరిగితే ఇంత వరకు నిందితులను అరెస్టు చేయకపోవడం సిగ్గుచేటన్నారు. ఔట్‌రైట్‌గా అధికార పార్టీకి సపోర్టు చేస్తూ అమాయక కుటుంబానికి అన్యాయం చేస్తామంటే ఊరుకునేది లేదని పోలీసులను మర్రి హెచ్చరించారు.
లేక లేక పుట్టిన బిడ్డను కాంగ్రెస్ గుండాలు పొట్టన పెట్టుకుంటే పట్టింపు లేకుండా ఉండడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. చిన్నారి మరణం విషయంలో పోలీసులు ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. కాలితో తన్నారు అని ప్రత్యక్షంగా కుటుంబం చెబుతున్నా ఎందుకు వారిపై కేసు నమోదు చేయడం లేదన్నారు. మర్డర్ కేసు పెట్టి వెంటనే వారందరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు పంపాలని డిమాండ్ చేశారు. గంటపాటు జరిగిన ధర్నాతో ఇరువైపుల వాహనాలు నిలిచిపోయినా పోలీసులు స్పందించలేదు దీంతో నేరుగా చిన్నారి స్వగ్రామం కుమ్మెర గ్రామానికి చేరుకొని నిందితుల ఇండ్లను ముట్టడించారు. ఎంత వరకైనా పట్టుకొని శిక్షిస్తామని హెచ్చరించారు.

బామ్మర్ధిని కాపాడేందుకు ఎమ్మెల్సీ పాట్లు..
ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి బామ్మర్థి అయిన కుమ్మెర గ్రామ సర్పంచ్ తూకారంరెడ్డిని కాపాడేందుకు పడరాని పాట్లు పడుతున్నారని, చిన్నారి కేసు విషయంలో నిందితులను అదుపులోకి తీసుకోకుండా తాత్సారం చేయడంతో నేరుగా మర్రి జనార్దన్‌రెడ్డి కుమ్మెర గ్రామానికి చేరుకున్నారు. నిందితుల ఇండ్ల ను ముట్టడించి ఎన్నటికీ తప్పించుకోలేరని హెచ్చరించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను ఉద్దేశించి మాట్లాడుతూ కుమ్మెర ఆదర్శ గ్రామమని, ఇద్దరు ముగ్గురు దుష్టశక్తుల వల్ల భ్రష్టు పట్టిందన్నారు. కుల అహంకారంతో నేను ఏం చెబితే అది నడుస్తదనే అధికార మధంతో, దురహంకారంతో బహుజన బిడ్డను పొట్టన పెట్టుకొని ఆ కుటుంబానికి అన్యాయం చేశారని మండిపడ్డారు.
గుడికి కలర్ వేయడానికి చాకలి వారు కావాలె కానీ దర్శనానికి పోతే శ్రీనివాస్ రెడ్డి అనే కుల దురంహారి వంద రూపాయలు అడగడం సిగ్గుచేటన్నారు. తాను వంద రూపాయలు ఎందుకు ఇవ్వాలనే అడిగిన పాపానికి ఇష్టానుసారంగా అనరాని మాటలు అని, తెలంగాణాలోనే చెప్పలేనటువంటి భాషతో దూషించడం, దాడి చేయడం ఏంటని ప్రశ్నిస్తూ మండిపడ్డాడు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అధికారం మాచేతిలో ఉందని, ప్రపంచాన్ని చూడని ఆ పసిబిడ్డను పొట్టన పెట్టుకున్నరు. అత్తను, భర్తపై దాడి చేస్తుంటే కోడలు వెళ్లి తన చిన్న బిడ్డ ఉందని, బిడ్డ ముఖం చేసి వదిలిపెట్టాలని ప్రాదేయపడినా అహంకారంతో కాలితో తన్నితే ఆ బిడ్డు రాయికి తలతాకి చిక్సిత పొందుతూ మరణించిందన్నారు.
ఈ ఘర్షణకు సంబంధించి అటెమ్ట్ మర్డర్ పెట్టమంటే పోలీసులు వెనుకడుగు వేస్తున్నారంటే మీ వెంట ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే ఉన్నారనే అధికార మదం ఎక్కిందన్నారు. గ్రామంలో ఉండే ఎమ్మెల్సీ బావమరిదిని కాపాడుకునేందుకు దళితుల ఓట్లతో గెలిచిన పదవిని అడ్డుపెట్టుకొని కేసులు కాకుండా అడ్డుకుంటున్నారన్నారు. మీ కొడుకు ఎక్కడి నుంచి ఎమ్మెల్యే అయ్యా డు. తీర్మార్ మల్లయ్య ప్రచారం చేస్తనే నీ కొడుకు ఎమ్మెల్యే అయ్యాడు. మీ గెలుపునకు సహకరించిన దళిత బిడ్డకు అన్యాయం చేయాలని ఎలా అనిపించిందని ప్రశ్నించారు. గెలుపొందిన తర్వాత గెలిపించిన మల్లన్న కానీ, బహుజన బిడ్డలు గుర్తు రాలేదా… మీ బావమరిది తుకారంరెడ్డి గుర్తొచ్చాడా అని గ్రామస్తుల ముందు ప్రశ్నించారు.
బహుజనులను కాపాడేవాడవైతే ముందుకొచ్చి దాడిచేసిన వారిని అరెస్టు చేయించాలని డిమాండ్ చేశారు. అప్పుడు ప్రజలకు ప్రజా పాలన అందించిన వాడవైతావరన్నారు. నీవు తప్పు చేయనివాడవైతే పసిబిడ్డ మరణించి 24 గంటలవుతున్నా ఎందుకు ముందు కు రావడం లేదన్నా రు. బాధిత కుటుంబాన్ని పరామర్శించాలన్న సోయి లేకుండా పోయిందా అన్నారు. దాడిచేసిన వారిని హైదరాబాద్‌లోని నీ ఇంట్లో దాచిపెట్టి తమాషాలు చేసున్నారన్నారు. ప్రజా పాలన అందిస్తామని అధికారంలోకి వచ్చి ప్రజల్ని మోసం చేస్తున్నారన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్పందించాలని, పసికందు మరణం విషయంలో కోర్టు సుమోటాగా తీసుకోవాలని మర్రి డిమాండ్ చేశారు. న్యాయ విచారణ చేసి అకారణంగా దాడి చేసిన వారందరికి శిక్ష పడేలా చూడాలని, అప్పుడే మీ ప్రజాపాలనపై ప్రజలకు నమ్మకం కలుగుతుందన్నారు. ఈ ఆందోళన కార్యక్రమంలో తీర్మార్ మల్లన్నతోపాటు ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు.