కోస్గి, అక్టోబర్ 4 : తెలంగాణలో బీజేపీ లేచేదిలేదు.. కాంగ్రెస్ గెలిచేది లేదని రాష్ర్త వైద్య ఆరోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు అన్నారు. బుధవారం కొడంగల్ నియోజకర్గం కోస్గి మండలంలోని 50 పడకల ప్రభుత్వ దవాఖానను మంత్రి ప్రారంభించారు. అనంతరం సీసీరోడ్లు, ముదిరాజ్ భవనం, యాదవ్ భవనం, అంబేద్కర్ భవనాలకు శంకుస్థాపనలు చేశారు. ప్రభుత్వ దవాఖాన నుంచి శివాజీ చౌరస్తా వరకు భారీ ర్యాలీలో పాల్గొన్నారు. కొడంగల్ ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రగతి నివేదిక సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రెండుసార్లు ఎమ్మెల్యేగా రేవంత్‌రెడ్డిని గెలిపిస్తే నియోజకవర్గ అభివృద్ధికి చేసింది శూన్యమన్నారు. నరేందర్‌రెడ్డి తక్కువ కాలంలోనే ఊహించని అభివృద్ధి చేశారని తెలిపారు.
బీఆర్ఎస్ హయాంలో ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి ఆధ్వర్యంలో రూ.500కోట్ల నిధులతో నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసినట్లు గుర్తుచేశారు. త్వరలో జరుగనున్న ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి డబ్బులు పంచి గెలిచేందుకు ప్రయత్నాలు చేస్తున్నారని, ఓటుకు నోటు కేసులో జైలుకు వెళ్లడం ఖాయమన్నారు. తెలంగాణ ప్రభుత్వం రైతులకు 24గంటల ఉచిత కరెంట్, ప్రభుత్వ దవాఖానలో డెలివరీలు చేసి కేసీఆర్ కిట్టు అందించడమే కాకుండా వాహనంలో తీసుకొచ్చి జాగ్రత్తగా ఇంటికి చేరుస్తున్నామన్నారు. కర్ణాటకలో కాంగ్రెస్ రూ.500 పింఛన్ అందిస్తూ తెలంగాణలో రూ.4వేలు అందిస్తామని చెప్పడం హాస్పాస్పదంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో మళ్లీ బీఆర్ఎస్ ముచ్చటగా మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, పట్నం నరేందర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు. కోస్గిని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేస్తామని, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం ఏర్పాటు చేసి పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుతో ప్రతి ఎకరాకు నీరు పారిస్తామని భరోసా ఇచ్చారు. ప్రతిపక్షాలు ఎన్నిట్రిక్కులు చేసినా బీఆర్ఎస్ హ్యాట్రిక్ ఖాయమన్నారు. తప్పులకు పాల్పడే రేవంత్‌రెడ్డి కావాలో.. ధర్మం వైపు ఉండే ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి కావాలో ఆలోచించి ప్రజలు నిర్ణయం తీసుకోవాలని కోరారు. మాయమాటలకు మోసపోయి ఓటు వేస్తే అభివృద్ధి వెనక్కిపోతుందన్నారు.
రేవంత్‌ను నమ్మితే గోసపడుతాం : మంత్రి మహేందర్‌రెడ్డి
మంత్రి మహేందర్‌రెడ్డి మట్లాడుతూ.. కొడంగల్ నియోజకర్గం వెనుపడిన ప్రాంతంగా ఉండేదని, పట్నం నరేందర్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎంతో అభివృద్ధి సాధించిందన్నారు. కాంగ్రెస్ నాయకులు కేవలం ఎన్నికల సమయంలో వచ్చి ఓట్లు అడుగుతారని, ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్నారు. కొడంగల్ నుంచే పోటీ చేసి సీఎం అవుతానని రేవంత్‌రెడ్డి పగటికలలు కంటున్నారని, ప్రజలు ఆయనను నమ్మే పరిస్థితిలో లేరన్నారు.
అభివృద్ధిని చూసి ఆశీర్వదించండి : ఎమ్మెల్యే నరేందర్‌రెడ్డి
ఎమ్మెల్యే పట్నం నరేందర్‌రెడ్డి మట్లాడుతూ.. కోస్గి, కొడంగల్ మున్సిపాలిటీలకు రూ.80కోట్ల నిధులతో అభివృద్ధి చేస్తున్నాం. గతంలో గుంతలమయంగా ఉన్న రోడ్లను అద్దంలా మర్చామన్నారు. ప్రతి గ్రామానికి, తండాకు పెద్దఎత్తున నిధులు తెచ్చి అన్నివిధాలుగా అభివృద్ధి చేశామని చెప్పారు. నేషనల్ హైవే విషయంలో మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌తో కలిసి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి భారత్‌మాల రోడ్డు మంజూరుకు లేఖ పంపించి మహబూబ్‌నగర్-చించోలి హైవేను మంజూరు చేసి పూర్తి దశకు వచ్చిందన్నారు. రైతుబంధు ద్వారా రూ.1,046 కోట్లు, రైతుబీమాకు రూ.82వేల కోట్లు అందించామన్నారు. ప్రతి నెలా 38వేల పింఛన్లు రూ.9.5కోట్లను నియోజకవర్గంలో అందిస్తున్నట్లు వెల్లడించారు. కార్యక్రమంలో శాసనమండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, ఎంపీ మన్నె శ్రీనివాస్‌రెడ్డి, స్టేట్ ఈజీఏస్ డైరెక్టర్ ప్రతాప్‌రెడ్డి, గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్ శాసం రామకృష్ణ, జెడ్పీటీసీ ప్రకాశ్‌రెడ్డి, ఎంపీపీ మధుకర్‌రావు, వైస్ ఎంపీపీ సాయిలు, రైతు సమన్వయ సమితి మండలాధ్యక్షుడు హన్మంత్‌రెడ్డి, కోస్గి మున్సిపాలిటీ అధ్యక్షుడు రాజేశ్, బీఆర్ఏస్ నాయకులు హరి, వెంకట్‌నర్సింహులు, బాల్‌రాజ్, బాలేశ్, శ్రీనివాస్, హన్మంతు తదితరులు పాల్గొన్నారు.