మహబూబ్‌నగర్, ఆగస్టు 10 : ప్రభుత్వ దవాఖానల్లో ప్రసవాలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయి. కేసీఆర్ సర్కారులో ఓపీ కోసం క్యూలు కట్టే స్థితి నుంచి నేను రాను బిడ్డో సర్కారు దవాఖానకు అన్నచందంగా కాంగ్రెస్ ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నది. ఓపీ గదుల్లో డాక్టర్లు వైద్యం కోసం వచ్చిన రోగుల నాడి పట్టి ఏమైందని అడిగే పరిస్థితి లేదని దూరం నుంచే మాట్లాడి వైద్యం అందిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు.
పదేండ్ల కేసీఆర్ పాలనలో సర్కారు వైద్యానికి జవసత్యాలు తెస్తే ప్రస్తుత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పిల్లల సంరక్షణ కోసం ఇచ్చే కిట్లను బంద్ చేసింది. దీంతో ప్రభుత్వం నుంచి కిట్ పథకం కింద పాప పుడితే రూ.13వేలు, బాబు పుడితే రూ.12వేల చొప్పున ప్రతి కాన్పుకు ఇచ్చే ఆర్థికసాయం బంద్ చేశారు. అధికారుల పర్యవేక్షణ సైతం కొరవడడంతో రోగుల పట్ల వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాగా, 2024 సంవత్సరంలో కాంగ్రెస్ సర్కారులో మహబూబ్‌నగర్ జిల్లాలో 8,154 ప్రసవాలు జరుగగా, 2023 కేసీఆర్ సర్కారులో 8,774 మందికి డెలివరీలు చేశారు. దాదాపు 700లకు పైగా డెలివరీలు తక్కువగా అయ్యాయి. ఇందుకు ప్రధానంగా వైద్యుల పర్యవేక్షణ లేకపోవడం, మందుల కొరతగా గర్భిణులు, రోగులు వెల్లడిస్తున్నారు. కాగా, ప్రైవేట్ దవాఖానలకు ప్రసవాల కోసం వెళితే రూ.70వేల వరకు వసూలు చేస్తున్నారని వాపోతున్నారు. ప్రభుత్వ దవాఖానల్లో పట్టించుకోకపోవడం ప్రైవేట్‌కు వెళ్తే ఆ దవాఖాన యజమాన్యాలు డబ్బులు దోచుకోవడం తో ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు గర్భిణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మందుల కొరత..
ఉమ్మడి జిల్లా ప్రజలకు సంజీవనిలా ఉన్న మహబూబ్‌నగర్ జనరల్ దవాఖానలో మందుల కొరత నెలకొన్నది. కొన్ని రోజులుగా ప్రభుత్వం నుంచి మందుల సరఫరా నిలిచిపోవడంతో ఉన్న మందులే సర్దుబాటు చేసి బయటకు రాస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో యాంటీబయోటిక్, ఆపరేషన్లకు సంబంధించిన మందులు కావాలంటే బయట కొని తెచ్చి ఇస్తున్నారు. వాస్తవ పరిస్థితి ఇలా ఉంటే దవాఖాన అధికారులు మాత్రం అన్ని మందులూ ఉన్నాయని చెబుతుండడం గమనార్హం.
ప్రతి రోజూ 1,200 నుంచి 1,500 వరకు ఓపీతోపాటు దాదాపు 500 మంది వరకు ఆడ్మి ట్ ఆయ్యే రోగులు ఉంటున్నారు. సాధారణంగా వచ్చే దగ్గు, జలుబు, జ్వరం, గ్యాస్, వాంతులు, విరేచనాలకు సైతం మాత్రలు లేని పరిస్థితి నెలకొన్నది. దీనిపై జిల్లా వైద్యశాఖ అధికారిని వివరణ కోరగా, ఇటీవలే తాను దవాఖానకు వచ్చానని, వివరాలు తెలుసుకొని చెబుతానని చెప్పారు.