సమయపాలన పాటించకుండా విధులకు ఎగనామం పెట్టే ఉపాధ్యాయుల గుండెల్లో రైళ్లు పరుగెత్తనున్నాయి. ఎప్పుడెళ్తే ఏంది..సంతకం పెడితే సరి అనే వైఖరితో కాలం వెళ్లదీస్తున్న పంతుళ్లకు సర్కార్ చెక్ పెట్టనున్నది. ప్రభుత్వం బయోమెట్రిక్ ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ప్రాథమిక పాఠశాల స్థాయి నుంచి యూనివర్సిటీ స్థాయి..విద్యార్థి నుంచి ఉపాధ్యాయుడు, అధ్యాపకులు, ప్రొఫెసర్లు, సిబ్బంది వరకు బయోమెట్రిక్ హాజరు అమలుకానున్నది. ఉమ్మడి జిల్లాలోని అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేలా జిల్లా విద్యాశాఖ చర్యలు తీసుకున్నది. కరోనా కారణంగా బయోమెట్రిక్ విధానం నిలిచిపోగా దానిని అధికార యంత్రాంగం తిరిగి ప్రారంభించడంతో ఇకపై బయోమెట్రిక్ హాజరు తప్పనిసరి కానున్నది.
నాగర్‌కర్నూల్, (నమస్తే తెలంగాణ)/గద్వాల, అక్టోబర్ 17 : ఉపాధ్యాయులు, క్లరికల్ ఉద్యోగుల డుమ్మాలకు, విద్యార్థుల గైర్హాజరుకు ఇక కాలం చెల్లనున్నది. ఇష్టానుసారంగా పాఠశాలకు వచ్చి వెళ్తామంటే ఇక నుంచి కుదురదు. సమయపాలన పాటించకుండా డుమ్మా కొడుతున్న ఉపాధ్యాయులను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం బడుల్లో బయోమెట్రిక్‌ను ఏర్పాటు చేస్తున్నది. విద్యాశాఖ నిర్ణయంతో పాఠశాల స్థాయి నుంచి డిగ్రీ, పీజీ కళాశాలలతోపాటు యూనివర్శిటీల్లోనూ బయోమెట్రిక్ హాజరును కచ్చితం చేసింది. అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం అమలు చేసేలా విద్యాశాఖ చర్యలు తీసుకున్నది. కరోనా వల్ల బయోమెట్రిక్ విధానం నిలిచిపోగా విద్యాశాఖ అధికారులు తిరిగి ప్రారంభించారు.
ఉపాధ్యాయులు పాఠశాలకు రెగ్యులర్‌గా రావడం లేదనే ఫిర్యాదులు ఉన్నాయి. చాలామంది ఉపాధ్యాయులు పట్టణాల నుంచి రాకపోకలు సాగిస్తూ సమయానికి హాజరుకాకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులు పడేవారు. కొంతమంది సెలవులు పెట్టకుండానే సొంత పనులు చేసుకుంటూ పాఠశాలకు డుమ్మా కొట్టేవారు. వీటన్నింటికీ చెక్ పెట్టాలనే ఆలోచనతో ప్రభుత్వ ఆదేశాలమేరకు విద్యాశాఖ పాఠశాలల్లో బయోమెట్రిక్ విధానం ఏర్పాటు చేసింది. కొంతమంది ఉపాధ్యాయులు మిషన్ పనిచేయకుండా చేసిన సంఘటనలు ఉండడంతో ప్రభుత్వం మరమ్మతులకు టెక్నీషియన్లను ఏర్పాటు చేసింది. గతంలో సిగ్నల్ రాకపోవడంతో మిషన్లు పనిచేయలేదు. దీంతో సిగ్నల్ ఆధారంగా బయోమెట్రిక్‌లో చిప్‌లు ఏర్పాటు చేస్తున్నారు. బయోమెట్రిక్ మిషన్‌ను ఎలా వాడాలి, రిపేర్ వస్తే ఎలా సరిచేసుకోవాలో ఉపాధ్యాయులకు అవగాహన కల్పించారు. ఉపాధ్యాయుల ఐరీస్, వేలిముద్రలను ఇప్పటికే నమోదు చేశారు. సంబంధిత పాఠశాల హెచ్ఎం పర్యవేక్షణలో కొనసాగుతున్నది. రోజుకూ రెండుసార్లు బయోమెట్రిక్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది.
ఇప్పటికే నాగర్‌కర్నూల్ జిల్లాలోని పాఠశాలల్లో, హాస్టళ్లలో బయోమెట్రిక్ హాజరు అమలవుతున్నది. ఇదిలా ఉంటే కళాశాలల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ ఈ హాజరు విధానాన్ని పరిగణలోకి తీసుకోనున్నారు. కాగా, విద్యార్థులకు సైతం బయోమెట్రిక్‌ను వర్తింపజేయనుండడం గమనార్హం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ కార్పొరేషన్ల నుంచి విద్యార్థులకు ఉపకార వేతనాలను మంజూరు చేస్తున్నది. దీంతో ప్రైవేట్ కళాశాలల విద్యార్థులకూ బయోమెట్రిక్ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. దీనికోసం ఆయా సంస్థల జిల్లా అధికారులు కళాశాలలకు మార్గనిర్దేశం చేయనున్నారు. ఈ-పాస్ వెబ్సైట్లో ఆయా కళాశాలల లాగిన్‌కు బయోమెట్రిక్ అనుసంధానమవుతుంది. దీని ఆధారంగా ఆయా కార్పొరేషన్ల అధికారులు ఆన్లైన్లో పరిశీలించి ఉపకార వేతనాల సమయంలో అనుమతులు జారీ చేస్తారు. రెండేళ్ల కిందట వరకు కూడా ఈ విధానం అమలులో ఉన్నా.. కరోనా నేపథ్యంలో విద్యాశాఖ సూచనలతో దీన్ని వాయిదా వేశారు.
కరోనా ప్రభావం తగ్గడంతో తిరిగి బయోమెట్రిక్‌ను అందుబాటులోకి తీసుకురానున్నారు. దీంతో బయోమెట్రిక్ అమలు చేసేందుకు యాజమాన్యాలు, ప్రిన్సిపాళ్లు చర్యలు తీసుకోనున్నారు. లెక్చరర్లు, నాన్ టీచింగ్ ఉద్యోగులకూ బయోమెట్రిక్ వర్తించనున్నది. కొన్ని ప్రభుత్వ జూనియర్ కళాశాలల్లో ఉదయం 10 గంటల వరకూ లెక్చరర్లు, ఉద్యోగులు హాజరు కాని సంఘటనలు ఉన్నాయి. నోడల్ అధికారుల తనిఖీల్లో బహిర్గతమయ్యాయి కూడా. అయితే, పలుమార్లు మందలించినా కొందరి పనితీరులో మార్పు రావడం లేదు. స్థానికంగా ప్రిన్సిపాళ్లు చూసీ చూడనట్లుగా ఉండడం కూడా దీనికి ఊతమిస్తున్నది. ఇక డిగ్రీ కళాశాలల్లో పర్యవేక్షణ లేదు. ఆయా కళాశాలల ప్రిన్సిపాళ్లు కూడా పట్టనట్లుగా ఉంటున్నారు. దీంతో చాలా మంది క్లాసులు చెప్పి ఆ తర్వాత సమయంలో బయట కనిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో బయోమెట్రిక్ అమలుపై ఉన్నత విద్యాశాఖ ఆదేశించడం డుమ్మా సార్లకు కష్టమనిపిస్తుంటే అధికారులు మాత్రం స్వాగతిస్తున్నారు. దీనివల్ల అధ్యాపకులు, ఉద్యోగుల సమయ పాలన సులువు అవుతుందని భావిస్తున్నారు.
నాగర్‌కర్నూల్ జిల్లాలో..
నాగర్‌కర్నూల్ జిల్లాలోని 793 ప్రభుత్వ పాఠశాలల్లో 3,565 మంది ఉపాధ్యాయులు, 60 వేల మంది విద్యార్థులు ఉన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలు 15 ఉండగా.., ఇందులో రెగ్యులర్ అధ్యాపకులు 13, కాంట్రాక్ట్ అధ్యాపకులు 96, గెస్ట్ లెక్చరర్లు 66 మంది ఉన్నారు. ఇక 40 మంది నాన్ టీచింగ్ ఉద్యోగులు ఉన్నారు. ఇక ప్రైవేట్, ఒకేషనల్ కళాశాలల్లో 10 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు. ఏడు డిగ్రీ కళాశాలలుండగా 54 మంది టీచింగ్, 22 నాన్ టీచింగ్ ఉద్యోగులు, 2,700 విద్యార్థులు.., 11 ప్రైవేట్ కళాశాలల్లో 4 వేల మంది విద్యార్థులు చదువుతున్నారు.
జోగుళాంబ గద్వాల జిల్లాలో..
జోగుళాంబ గద్వాల జిల్లాలో 472 పాఠశాలలు ఉన్నాయి. అన్ని పాఠశాలల్లో బయోమెట్రిక్ పరికరాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేశారు. దాదాపు 99 పాఠశాలల్లో సిగ్నల్ సరిగా రాకపోవడంతో అక్కడ ఏ సిగ్నల్ వస్తుందో ఆ చిప్‌ను బయోమెట్రిక్ మిషన్‌లో అమర్చి వాటిని అందుబాటులోకి తేవడానికి జిల్లా విద్యాశాఖ అధికారులు కృషి చేస్తున్నారు. జిల్లాలో టీచింగ్ స్టాఫ్ 2,200, నాన్‌టీచింగ్ స్టాఫ్ 250 మంది ఉన్నారు. వీరందరూ తప్పనిసరిగా బయోమెట్రిక్ మిషన్ ద్వారా హాజరు నమోదు చేసుకోవాలి.
అన్ని పాఠశాలల్లో ఏర్పాటు
జోగుళాంబ గద్వాల జిల్లాలోని పాఠశాలల్లో బయోమెట్రిక్ మిషన్‌ను ఏర్పాటు చేశాం. టీచింగ్, నాన్‌టీచింగ్ ఉద్యోగులు హాజరు నమోదు చేసుకోవాలి. దీంతో ఉపాధ్యాయులు, సిబ్బంది సమయపాలన పాటించడానికి అవకాశం ఉంటుంది. విద్యార్థులకు మెరుగైన విద్య అందించడానికి అవకాశం ఉంది. మిషన్‌లో సాంకేతిక సమస్య ఏర్పడితే వెంటనే సరిచేయడానికి టెక్నికల్ సిబ్బందిని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. హాజరు నమోదుపై ఉపాధ్యాయులు, సిబ్బందికి అవగాహన కల్పించాం.
– సిరాజుద్దీన్, డీఈవో, జోగుళాంబ గద్వాల
ప్రభుత్వ ఆదేశాలతో చర్యలు..
ప్రభుత్వ ఆదేశాలతో కళాశాలల్లో బయోమెట్రిక్‌ను కచ్చితంగా అమలు చేస్తాం. నాగర్‌కర్నూల్ జిల్లాలో 10 వరకు బయోమెట్రిక్ యంత్రాలు పాడయ్యాయి. ఇంటర్ విద్యాశాఖకు ఇప్పటికే నివేదించాం. కళాశాలల లెక్చరర్లు, నాన్ టీచింగ్ స్టాఫ్ అందరూ సమయానికే కళాశాలల్లో విధులకు హాజరు కావాలి. లేకుంటే చర్యలు తీసుకుంటాం. – వెంకటరమణ, ఇంటర్ జిల్లా విద్యాధికారి, నాగర్‌కర్నూల్