గద్వాల, జనవరి 30 : మున్సిపల్ ఎన్నికల వేళ నామినేషన్ల చివరి రోజు కాంగ్రెస్‌కు భారీ షాక్ తగిలింది. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి బరిలో నిలిచి కొద్ది ఓట్ల తేడాతో ఓడిపోయినా సరిత వర్గానికి అధిష్టానం బీఫామ్స్ ఇవ్వకుండా కొత్తగా పార్టీలో చేరిన ఎమ్మెల్యే కృష్ణమో హన్‌రెడ్డికి బీఫామ్స్ ఇవ్వడంతో ఆగ్రహించిన సరిత వర్గీయులు కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరారు. కాంగ్రెస్‌ను వీడి బీఆర్ఎస్లో చేరిన మాజీ కౌన్సిలర్లు పులిపాటి వెంకటేశ్, భాస్కర్‌యాదవ్, అనితా నర్సింహులుతో పాటు 15వ వార్డుకు చెందిన కోళ్ల మస్తాన్‌తోపాటు జమ్మిచేడు సురేశ్, రాముయాదవ్, జగదీశ్, జయమ్మమద్దిలేటితోపాటు రెండు వందల మంది కార్యకర్తలు ఉన్నారు.
వీరికి బీఆర్ఎస్ భవన్లో శాట్ మాజీ చైర్మన్ ఆంజనేయగౌడ్, గద్వాల నియోజకవర్గ బీఆర్ఎస్ నాయకులు హనుమంతునాయుడు, మాజీ మున్సిపల్ చైర్మన్ బీఎస్ కేశవ్ గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆంజనేయగౌడ్ మాట్లాడుతూ కాంగ్రెస్‌లో పార్టీ కోసం పని చేసిన వారికి గుర్తింపు లేదన్నారు. పార్టీలు మారే వారికి అక్కడ గుర్తింపు ఉందన్నారు.
పార్టీలో చేరిన వారందరు కలిసి కట్టుగా పని చేస్తే గద్వాల మున్సిపాలిటీపై బీఆర్ఎస్ జెండా ఎగరడం ఖాయమన్నారు. గత బీఆర్ఎస్ పాలనలో గద్వాల మున్సిపాలిటీ అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిందన్నారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అభ్యర్థి పార్టీకి ద్రోహం చేసి వెళ్లాడని, వెళ్లిన చోట కూడా వారిని ఇబ్బందులు పెడుతున్నారన్నారు. తాను బీఆర్ఎస్లో ఉన్నానని చెబుతున్న ఎమ్మెల్యే కాంగ్రెస్ అభ్యర్థులను గెలిపించాలని చెప్పడం సిగ్గుగా లేదా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో జానార్దన్‌రెడ్డి, వెంకటేశ్వర్‌రెడ్డి, అంగడి బస్వరాజ్, రఘురెడ్డి, చక్రధర్‌రావు, కోటేశ్ తదితరులు పాల్గొన్నారు.