మూసాపేట(మహబూబ్ నగర్) : భూ సమస్యల శాశ్వత పరిష్కారం కోసం రెవెన్యూ సదస్సులు నిర్వహిస్తున్నామని కలెక్టర్ విజయేందిర బోయి ( Collector Vijayendira Boi) అన్నారు. ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన భూభారతి ( Bhu Bharati) చట్టం అమలులో భాగంగా నిర్వహించే రెవెన్యూ సదస్సులను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
భూ భారతి పైలట్ ప్రాజెక్ట్ రెవెన్యూ సదస్సులలో భాగంగా సోమవారం మహబూబ్ నగర్ జిల్లా మూసాపేట్ మండలం చక్రాపూర్ గ్రామంలో ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల, తుంకినిపూర్ గ్రామంలో గ్రామ పంచాయతీ కార్యాలయంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సులలో రెవెన్యూ అదనపు కలెక్టర్ మోహన్ రావు తో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా రైతుల నుంచి దరఖాస్తులు స్వీకరించారు .
రైతులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. భూ భారతి చట్టంపై అవగాహన కల్పించి, రైతుల సందేహాలను నివృత్తి చేశారు. భూ సమస్యలు పరిష్కరించి, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు కల్పించేందుకు ప్రభుత్వం భూభారతి చట్టం అమలు చేస్తోందని కలెక్టర్ తెలిపారు. రెవెన్యూ సదస్సుల్లో భూ రికార్డులలో పేరు తప్పులు, విస్తీర్ణం హెచ్చు తగ్గులు, వారసత్వ భూములు, భూ స్వభావం తప్పులు, నిషేధిత జాబితాలో ఉన్న భూ సమస్యలు, సర్వే నెంబర్ మిస్సింగ్, పట్టా పాస్ బుక్కులు లేకపోవడం వంటి వాటిని పరిష్కరిస్తున్నామన్నారు.
వివిధ కారణాల వల్ల రెవెన్యూ సదస్సులో అర్జీలు సమర్పించే అవకాశం లభించని వారు తరువాత కూడా దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. భూ సంబంధిత సమస్యలు ఉన్న వారు నిర్ణీత ప్రొఫార్మా లో సరైన విధంగా దరఖాస్తు చేసుకునేలా సహకారం అందించాలని హెల్ప్ డెస్క్ సిబ్బందిని ఆదేశించారు. ఫార్మర్ రిజిస్ట్రీ కార్యక్రమాన్ని కలెక్టర్ పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి వెంకటేష్ , అధికారులు, రైతులు పాల్గొన్నారు .