అలంపూర్, జూన్ 20 : పేదలకు వైద్యం అందిచాలన్న తలంపుతో సర్కారు దవాఖానలను నిర్మించినా ఆదరణ లేక నిరూపయోగంగా మా రుతున్నాయి. అలంపూర్ నియోజకవర్గంలోని రోగులకు మరుగైన వైద్య సేవలు అందించాలన్న ఉద్దేశంతో కేసీఆర్ ప్రభుత్వం వంద పడకల దవాఖానను నిర్మించింది. ఇతర రాష్ర్టాలపై ఆధారపడకుండా పేదలకు మెరుగైన వైద్య సేవలందించాలనే ఆలోచనలతో రూ.27 కోట్లు ఖర్చు చేసి ఆగమేఘాల మీద హైవే-44ను అనుసరించి అలంపూర్ చౌరస్తాలో పెద్దాసుపత్రిని ఏర్పాటు చేసి ప్రారంభించింది. తర్వాత ఎన్నికలు రావడం.. కా ంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడంతో వైద్యులు, సిబ్బంది నియామకం చేపట్టకపోవడంతో నిరుపయోగంగా మారింది. ఇక్కడ వైద్య సేవలు అందించడంలో అధికార పార్టీ నాయకులు చిన్నచూపు చూస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి.
దీంతో రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వైద్యశాల రెండేండ్లు కావస్తున్నా ఉపయోగంలోకి రాలేదు. ఇప్పటికే గోడ లు బీటలు వారగా.. దవాఖానలోని ఖరీదైన మెడికల్ పరికరాలు సైతం చోరీకి గురవుతున్నాయి. కొన్నింటిని జిల్లాలోని ఇతర దవాఖానకు తరలించారు. దీంతో నాటి పాలకులు చేసిన ఆలోచనకు కార్యరూపం దక్కడం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. కేసీఆర్ ప్రభుత్వంలో నిర్మించిన దవాఖానను ప్రారంభిస్తే క్రెడిట్ అంతా వారికే దక్కుతుందన్న అక్కసుతో అధికార పార్టీ ప్రారంభించడం లేదన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. ఇటీవల బీజేపీ నేత రామచంద్రారెడ్డి వైద్యశాలను ఎందుకు ఉపయోగంలోకి తేవడం లేదని ప్రశ్ని స్తూ హైకోర్టులో పిల్ దాఖలు చేశారు. అందుకు స్పందించిన హైకోర్టు సంబంధిత శాఖకు అనుసంధానంగా ఉన్న శాఖలు, అధికారులకు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం.
ప్రభుత్వ దవాఖాన ప్రారంభమనేది ప్రభుత్వ నిర్ణయం. మా చేతుల్లో ఏమీ లేదు.. వైద్య శాలలో రోగులకు పరిపడా పరికరాలు అన్నీ ఉన్నాయి. సిబ్బంది, వైద్యుల నియామకమే మిగిలింది. గత నెలలో కమిషనర్ విజయ్ కుమార్ అలంపూర్ పర్యటనకు వచ్చినప్పుడు ఆయన దృష్టికి తీసుకెళ్లాం. ప్రస్తుతం వంద పడకల దవాఖానకు 12 మంది స్టాఫ్ నర్సుల నియామకమైంది. పది మంది గద్వాల దవాఖా నలో డిప్యూటేషన్‌పై, మరో ఆరుగురు విడుతల వారీగా ఇక్కడ విధులు నిర్వహిస్తున్నారు.
– సయ్యద్ బాషా, సూపరింటెండెంట్, అలంపూర్
అలంపూర్ చౌరస్తాలో నిర్మించిన దవాఖానను ఉపయోగం లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్ని స్తున్నాను.. దవాఖానలో అవసరమైన వైద్యులు, సిబ్బ ందిని నియమించండని, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి, తాను కలిసి ఇప్పటికే ఐదారు పర్యాయాలు సీఎం రేవంత్‌రెడ్డి, ఆరోగ్య శాఖ మంత్రి, కమిషనర్‌కు వినతి పత్రాలు అందించాం. త్వరగా అందుబాటులోకి తీసుకురావాలని కృషి చేస్తున్నాం.
– విజయుడు, అలంపూర్ ఎమ్మెల్యే
రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన దవాఖానలో వైద్య చికిత్సలకు అవసరమైన ఎక్విప్మెంట్ అందుబాటులో పెట్టుకుని వైద్యులను ఎందుకు నియమించడం లేదు. అన్ని సౌకర్యాలు ఉన్నా సొంత వైద్యం చేసుకోలేక పక్కనున్న ఏపీలోని కర్నూల్ దవాఖానలకు వెళ్లాల్సి వస్తుంది. లేదంటే గద్వాల, పాలమూరు జిల్లా వైద్యశాలలను ఆశ్రయించాల్సి వస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం పేదల ఆరోగ్యంతో చెలగాటం ఆడకుండా రాజకీయాలు పక్కన పెట్టి డాక్టర్లు, సిబ్బందిని నియమించి వైద్య సేవలు వెంటనే ప్రారంభించాలి. ఆ దిశగా ఆరోగ్య శాఖ మంత్రులు, కమిషనర్ ఆలోచించాలి.
– వెంకట్రామయ్యశెట్టి, అలంపూర్, జోగుళాంబ గద్వాల జిల్లా
రూ.కోట్లు ఖర్చు చేసి నిర్మించిన వంద పడకల దవాఖాన లక్ష్యం నెరవేరలేదు. ఇంత వరకు రోగులకు కాకుండా దవాఖాన భవనం ఎన్నికల భద్రతా సిబ్బందికి మాత్రమే పనికొచ్చింది. భవనంలో ఉన్న సౌకర్యాలు (రోగుల కోసం ఏర్పాటు చేసిన కొత్త మంచాలు, పరుపులు, నీటి సౌకర్యం, విద్యుత్ సౌకర్యం, అంతస్తు భవనం గదులు) ఎన్నికలొచ్చిన ప్రతిసారి విధులకు హాజరైన భద్రతా సిబ్బందికే ఉపయోగపడింది. మళ్లా ఇప్పుడు స్థానిక ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో చేస్తున్నట్టుంది.దవాఖాన నిర్వహణకు వైద్యులను నియమించే ఆలోచన లేకపోతే ఆ భవనాన్ని ప్రభుత్వ కార్యాలయాల సముదాయంగా మారిస్తే ఉపయోగపడుతున్నది. మండల కేంద్రంలో ఆయా శాఖల కార్యాలయాలకు పక్కా భవనాలు లేవు.
– సంజీవ నాయుడు, అలంపూర్, జోగుళాంబ గద్వాల