పాన్‌గల్, ఏప్రిల్ 10 : అక్రమ కేసులు పెట్టిన పోలీసు అధికారులపై దృష్టి పెడతామని, బీఆర్ఎస్ కార్యకర్తలను కడుపులో పెట్టుకొని కాపాడుకుంటామని మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి అన్నారు. ఈనెల 27న వరంగల్‌లో నిర్వహించే బీఆర్ఎస్ రజతోత్సవ సన్నాహక సభను విజయవంతం చేయాలని మంగళవారం మండలకేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తల స మావేశానికి బీరం హాజరై మాట్లాడారు. అంతకుముందు మండలకేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి బస్టాండ్ వరకు భారీ బైక్ ర్యాలీతో తరలివచ్చారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హామీల అమలులో ప్రభుత్వం విఫలం చెందిందన్నారు. 15నెలల్లోనే ప్రజలు కాంగ్రెస్ పాలనపై విసిగిపోయారని, కేసీఆర్ పాలనను కోరుకుంటున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడొచ్చినా కొల్లాపూర్ కోటలో గులాబీ జెండా ఎగరవేసేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ హయాంలోనే కేతేపల్లి బ్రిడ్జి నిర్మాణం, సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరు చేసినా ఇప్పటి వరకు పనులు పూర్తి కాలేదని ఆరోపించారు.
చేసిన పనులకు పర్సెంటేజీలు ఇచ్చి బిల్లులు చేయించుకునే దుస్థితి నెలకొన్నదని మండిపడ్డారు. కొల్లాపూర్ నియోజకవర్గంలో క్రైం రేట్ పెరిగిందని, పోలీసుల అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేదని ఆరోపించారు. సభ కు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో మాజీ ఎంపీపీ శ్రీధర్‌రెడ్డి, ఎస్టీసెల్ జిల్లా అధ్యక్షుడు చంద్రశేఖర్ నాయక్, అడ్వకేట్ రవి, రాజేశ్‌రెడ్డి, జ్యో తినందన్రెడ్డి, శేఖర్, వీరసాగర్ పాల్గొన్నారు
పెద్దకొత్తపల్లి, ఏప్రిల్ 10 : ఎన్నికల్లో కాంగ్రెస్ దొంగ హామీలిచ్చి వాటిని అమలు చేయలేక విఫలమైందని, రానున్న కాలంలో బీఆర్ఎస్దే అధికారమని కొల్లాపూర్ మాజీ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్‌రెడ్డి స్పష్టంచేశారు. గురువారం మండల కేంద్రంలో బీఆర్ఎస్ ముఖ్య నాయకులతో చలో వరంగల్ సభకు జనసమీకరణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ దాడులకు ఎవరూ బెదరవద్దని, కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటామని తెలిపా రు.
గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీపై తీవ్ర వ్యతిరేక వచ్చిందని, ఏ ఒక్క హామీని కూడా సంపూర్ణంగా అమలు చేయడం హస్తం పార్టీకి చేతకాలేదన్నారు. అభివృద్ధి చేయకుండా ప్రతిపక్ష నాయకులపై దాడులు చేయించడం సిగ్గుచేటన్నారు. వరంగల్ సభకు భారీ ఎత్తున తరలి కొల్లాపూర్ సత్తా చాటాలని పిలుపునిచ్చారు. సమావేశంలో బీఆర్ఎస్ మండలాధ్యక్షుడు గణేశ్‌రావు, నాగరాజు, నర్సింహ్మ ఉన్నారు.