నడిగడ్డలో గులాబీ గుబాళించింది. ఇక్కడున్న రెండు సెగ్మెంట్లలో బీఆర్ఎస్ సత్తా చాటింది. గద్వాలలో బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి రెండోసారి విజయం సాధించగా.. అలంపూర్‌లో కోడెదూడ విజయుడు గెలుపొందారు. ఇక్క డ ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డి అన్నీ తానై నియోజకవర్గంలో పార్టీని గెలిపించడంలో సఫలీకృతుడయ్యారు. దీంతో పార్టీ శ్రేణులు సంబురాల్లో మునిగిపోయారు. పటాకుల మోతలు హోరెత్తగా.. మిఠాయిలు పంపిణీ చేశారు. రెండు ప్రాంతాల్లోని క్యాడర్లో ఫుల్ జోష్ నెలకొన్నది.
గద్వాల, డిసెబంర్ 3 : నడిగడ్డపై గులాబీ జెండా రెపరెపలాంది. తెలంగాణ ప్రభుత్వం అమలు చేసిన సంక్షేమ పథకాలు, అభివద్ధే ఇక్కడి ఇ ద్దరి అభ్యర్థులను గె లిపించింది. రెండోసారి కృష్ణమోహన్‌రెడ్డి గెలిచి గద్వాల కోటపై గులాబీ జెండా ఎగురవేశారు. చివరి వరకు ఉత్కంఠగా సాగిన కౌంటింగ్‌లో చివరికి కృష్ణమోహన్‌రెడ్డిని విజయం వరించింది. 2018లో మొదటిసారి అప్పటి కాంగ్రెస్ అభ్యర్థి డీకే అరుణపై మొదటిసారిగా కృష్ణమోహన్‌రెడ్డి 28,445మెజార్టీతో గెలిచారు. అదే స్ఫూర్తితో నిరంతరం ప్రజల మధ్య ఉండడంతో ప్రజలే ఆయనకు రెండోసారి పట్టం కట్టారు. ఆదివారం ప్రకటించిన ఫలితాల్లో కాంగ్రెస్ అభ్యర్థి సరితపై 7,681 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు. గద్వాల నియోజకవర్గంలో సరిత బహుజన వాదం ఎత్తుకొని బీసీలను ఆకట్టుకునే ప్రయత్నం చేసినా బీసీ సామాజిక వర్గానికి చెందిన వారు ఇతర పార్టీల నుండి బరిలో నిలవడంతో ఆమె ఓటమి చెందింది. బోయసామాజిక వర్గానికి చెందిన శివారెడ్డి బీజేపీ తరఫున పోటీ చేయగా కేవలం 7,422 ఓట్లు మాత్రమే సాధించారు. కురుమ సామాజిక వర్గానికి చెంది రంజిత్‌కుమార్ ఆలిండియా ఫార్వర్డ్ బ్లాక్ తరఫున పోటీ చేసిన రంజిత్‌కుమార్ బీసీ సామాజికవర్గానికి చెందిన ఓట్లు చీల్చడం సరిత ఓటమికి కారణమైంది. కాగా ఇక్కడి బీజేపీ అభ్యర్థి నాలుగో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. ఏఐఎఫ్ నుంచి బరిలో నిలిచిన రంజిత్‌కుమార్‌కు 13,429 ఓట్లు వచ్చి మూడోస్థానంలో నిలిచారు. గద్వాల కోటపై రెండోసారి గులబీ జెండా ఎగరడంతో బీఆర్ఎస్ శ్రేణుల్లో సంబురం నెలకొంది.
అలంపూర్‌లో మరోసారి చల్లా తన మార్క్‌ను నిరూపించుకున్నాడు. చివరి వరకు టికెట్ విషయంలో ఉత్కంఠ నెలకొనగా ఎమ్మెల్సీ చల్లా బలపర్చిన విజయుడికి అధిష్టానం బీఫారం ఇవ్వడం, ప్రచారానికి కొద్ది రోజులే సమయం ఉన్నప్పటికీ చల్లానే స్వయంగా గ్రామాల్లో తిరుగుతూ అందరినీ ఏకం చేశాడు. దీంతో విజయం బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడిని వరించింది. అలంపూర్ నియోజకవర్గంలో మొదటి నుంచి చల్లా ఎవరికి మద్దతుగా నిలిస్తే వారిదే విజయమని అలంపూర్ ప్రజలకు పూర్తి నమ్మకం. ఇప్పటికే సంపత్‌కుమార్‌ను ఒకసారి, అబ్రహంను ఒకసారి గెలిపించిన చల్లా మూడోసారి సామాన్యుడిని బరిలో నిలిపి నియోజకవర్గంలో తనమార్క్‌ను చాటుకున్నాడు. అలంపూర్ అంటే చల్లా, చల్లా అంటే అలంపూర్ అనే ప్రజల నమ్మకాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు. రాష్ట్రమంతా కాంగ్రెస్ గాలి వీచినా నడిగడ్డలోని రెండు నియోజకవర్గాల్లో బీఆర్ఎస్ జెండా ఎగరడంతో ఇక్కడి బీఆర్ఎస్ శ్రేణుల్లో మరింత ఉత్సాహం నెలకొన్నది. బీఆర్ఎస్ అభ్యర్థి విజయుడు, కాంగ్రెస్ అభ్యర్థి సంపత్‌కుమార్‌పై 30,573 ఓట్ల మెజార్టీతో గెలుపొందారు.