మరికల్, ఏప్రిల్ 29 : మరికల్ మండలంలోని రాకొండ, దేవరకద్ర మండలంలోని బస్వాపూర్ గ్రామాల మధ్య వాగులో గత కేసీఆర్ ప్రభుత్వంలో భూగర్భజలాలు పెంచాల నే ఉద్దేశంతో నిర్మించిన చెక్ డ్యాంలను అధికార పార్టీకి చెందిన నాయకులు, ఇసుక మాఫియ బుధవారం తెల్లవారుజామున హిటాచీతో ధ్వంసం చేయడానికి యత్నించారు. వాగు వద్ద శబ్దం రావడంతో గమనించిన రాకొండ గ్రామ బీఆర్ఎస్ సర్పంచ్ గాదం పుల్లప్ప నీటిపారుదల శాఖ అధికారులకు అందించారు. అదే విధంగా బస్వాపూర్ గ్రామస్తులకు సమాచారం ఇవ్వడంతో చెక్ డ్యాంక్ను ధ్వంసం చేయడానికి యత్నిస్తున్న వారిని అడ్డుకొని వారిని అక్కడి నుంచి పంపించి వేశారు. కాగా చెక్ డ్యాం ను కొంత వరకు ధ్వంసం చేయడంతో నీరు వృథాగా పారుతున్నది. ఈ ఘటనపై గ్రామస్తులు, చెక్‌డ్యాం కాంట్రాక్టర్ దేవరకద్ర పీఎస్‌లో వేర్వేరుగా ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.