అలంపూర్ చౌరస్తా, డిసెంబర్ 21 : పండుగ అంటేనే ఒక సంస్కృతి, సంప్రదాయాలకు నిలువె త్తు నిదర్శనం.. అందుకే కేసీఆర్ ప్రభుత్వం హిందూవులకు బతుకమ్మ చీరలు, ముస్లింలకు రంజాన్ తో ఫాలు, క్రిస్టియన్లకు క్రిస్మస్ గిఫ్ట్‌లను అందజేసింది. కానుకలు అందడంతో కొత్త బట్టలు ధరించి పేదలు పండుగలను ధూంధాంగా జరుపుకొనేవారు. కానీ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగా నే కొత్త బట్టల పంపిణీకి మంగళవారం పాడింది. దీంతో మళ్లా పండుగలకు దుర్భర పరిస్థితులు ఏర్పడ్డాయి. రేవంత సర్కారు ఏడాది పాలనలో ఒక్క పండుగకు కానుకలు అందించలేదు. మరో మూడురోజుల్లో జరుపుకోనున్న క్రిస్మస్ పండుగకు సైతం గిఫ్ట్‌లు లేనట్లే.. ఇప్పటి వరకు గ్రామాలకు ఎలాంటి కానుకలు చేరలేదు.
6 వేల కుటుంబాలకు నిరాశే..
క్రైస్తవులకు పవిత్రమైన పండుగ క్రిస్మస్. అంతటి పెద్ద పండుగను పేద క్రిస్టియన్లు ఎంతో సంతోషంగా జరుపుకోవాలని నాటి కేసీఆర్ ప్రభుత్వం రెండు వారాల ముందే క్రిస్మస్ కిట్లను పంపిణీ చేసేది. జోగుళాంబ గద్వాల జిల్లాలో అలంపూర్, గద్వాల నియోజకవర్గాల్లో మొత్తం 6 వేల కుటుంబాలకు క్రిస్మస్ గిఫ్ట్‌ల పంపిణీ జరిగేది. ఈ కిట్‌లో చీర, పంజాబీ డ్రెస్, ప్యాంట్, షర్ట్ ఉండేవి. కానీ ప్రస్తుత ప్రభుత్వంలో ఇప్పటి వరకు క్రిస్మస్ కానుకలు అందలేదు. గిఫ్ట్‌లకు సంబంధించి ఇప్పటి వరకు ఎలాంటి సమాచారం లేకపోవడంతో ఈ సారి కానుకలు లేనట్లే అంటూ పేదలు నిరాశ చెందుతున్నారు.
అందని బతుకమ్మ చీర
సమైక్య రాష్ట్రంలో నిర్లక్ష్యానికి గురైన బతుకమ్మకు కేసీఆర్ సర్కారు పూర్వ వైభవం తీసుకొచ్చింది. దీంతో రాష్ట్ర ప్రజలు గౌరవించుకునేలా వేడుకలు నిర్వహించారు. మన సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచిన పండుగను దేశవిదేశాల్లో ఘనంగా జరుపుకొన్నారు. అంతటి పెద్ద పండుగను వైభవంగా నిర్వహించుకునేందుకు 18 ఏండ్లు నిండి రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఆడబిడ్డకూ చీరలు పంపిణీ చేశారు. కొత్త బట్టలు ధరించి 9 రోజుల పాటు బతుకమ్మ వేడుకల్లో మహిళలు సంబురంగా పాల్గొనేవారు. కానీ కాంగ్రెస్ వచ్చాక పండుగకు ఆదరణ తగ్గింది. గద్వాల జిల్లాలో మొత్తం 1.60 లక్షల రేషన్ కార్డులు ఉండగా.. ఒక్కరికి కూడా బతుకమ్మ చీర అందలేదు. దీనికితోడు సెక్రటెరియట్ ఎదుట తెలంగాణ తల్లి విగ్రహం చేతిలో బతుకమ్మను తొ లగించడం.. అధికారికంగా నిర్వహించాల్సిన పండుగకు మంగళం పడటాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారు.
రంజాన్ తోఫా, ఇఫ్తార్ గాయబ్
ముస్లింలకు అత్యంత ప్రవిత్రమైన రంజాన్ పండుగకు బీఆర్ఎస్ ప్రభుత్వంలో తోఫాలు అందించడంతోపాటు ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసేది. తోఫా కిట్‌లో సేమ్యాతోపాటు ఇంటి పెద్దలకు లాల్చీపైజామా, చీర, జాకెట్, పిల్లలకు పంజాబీ డ్రెస్ మేటీరియల్, ప్యాంట్, షర్ట్ ఉండేవి. అందుకే ఈ తోఫాలకు ఆపూర్వ ఆదరణ ఉండేది. జిల్లాలో మొత్తం 4 వేల ముస్లిం కుటుంబాలు కొత్త బట్టలు ధరించి ఎం తగానో మురిసిపోయేవి. కానీ ఈ ఏడాది రాష్ట్ర ప్రభుత్వం తోఫాల పంపిణీని పూర్తిగా నిలిపివేసింది.