నాగర్‌కర్నూల్, మార్చి 25: నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట ఎల్ఎల్బీసీ టన్నెల్లో మంగళవారం మరో మృతదేహాన్ని వెలికితీశారు. సోమవారం రాత్రి మినీ జేసీబీతో మట్టిని తొలగిస్తుండగా దుర్గంధం రావడంతో రెస్క్యూటీం స్ప్రే కొట్టి అతికష్టమ్మీద ప్రా జెక్టు ఇంజినీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని వెలికి తీశారు. గతనెల 22వ తేదీన సొరంగంలో పనులు చేసేందుకు వెళ్లిన వారిలో మట్టిదిబ్బలు కూలడంతో నలుగురు కార్మికులు, ఇద్దరు టీబీఎం మిషన్ ఆపరేటర్లు, ఇద్దరు ఇంజినీర్లు సొరంగంలో చిక్కుకున్న విషయం తెలిసిందే.
ఘటన జరిగిన రెండు వారాల తర్వాత మార్చి 9వ తేదీన మిషన్ ఆపరేటర్ పంజాబ్ రాష్ర్టానికి చెందిన గురుప్రీత్‌సింగ్ మృతదేహం వెలికి తీయగా, మంగళవారం ఉత్తరప్రదేశ్‌కు చెందిన ప్రాజెక్టు ఇంజినీర్ మనోజ్‌కుమార్ మృతదేహాన్ని రెస్క్యూటీమ్ గుర్తించి బయటకు తీశారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రం ఉన్నావ్ జిల్లా బంగార్మ గ్రామానికి చెందిన మనోజ్‌కుమార్ జయప్రకాశ్ అసోసియేట్స్ లిమిటెడ్ కంపెనీలో ఇంజనీర్‌గా విధులు నిర్వహిస్తున్నాడు.
మృతుడికి భార్య స్వర్ణలత, కుమారుడు ఆదర్శ్, కుమార్తె శైలజ, తల్లి జమునాదేవి ఉన్నట్లు కంపెనీ యాజమాన్యం పేర్కొన్నది. మనోజ్‌కుమార్ మృతదేహాన్ని ప్రత్యేక అంబులెన్స్‌లో నాగర్‌కర్నూల్ జిల్లా దవాఖానకు తరలించారు. పోస్టుమార్టం అనంతరం ప్రభుత్వం తరుపున రూ.25లక్షల ఎక్స్‌గ్రేషియా చెక్కును ఎమ్మెల్సీ దామోదర్‌రెడ్డి చేతుల మీదుగా రెవెన్యూ అధికారులు, కంపెనీ ఉద్యోగులకు అందజేసి ఉత్తరప్రదేశ్‌కు పంపించారు. కార్యక్రమం లో దవాఖాన సూపరింటెండెంట్ రఘు, డీఎంహెచ్‌వో స్వరాజ్యలక్ష్మి, డీఎస్పీ శ్రీనివాసులు, సీఐ కనకయ్య, ఎస్సై గోవర్ధన్, తాసీల్దార్ తబిత ఉన్నారు.