గద్వాల, నవంబర్ 3 : పేరు గొప్ప ఊరు దిబ్బ అన్న చందంగా గద్వాల వ్యవసాయ మార్కెట్ పరిస్థితి నెలకొన్నది. మార్కెట్ ఆదాయం ఘనంగా ఉన్నా వసతులు చూస్తే శూన్యం. టార్గెట్‌కు మించి ఆదాయం సమకూరుతున్నా ఎవరూ పట్టించుకోకపోవడంతో మార్కెట్ అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగడి అక్కడే అన్న చందగా మారిపోయింది. జోగుళాంబ గద్వాల జిల్లాలో గద్వాల, అలంపూర్ వ్యవసాయ మార్కెట్‌తోపాటు అయిజ సబ్‌యార్డు ఉన్నది. గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు జిల్లాలోని అన్ని గ్రామాల నుంచి రైతులు వ్యవసాయ ఉత్పత్తులను అమ్ముకోవడానికి వస్తుంటారు. పంట అమ్ముకొని వెళ్లే వరకు కనీస వసతులు లేవు. వారు తెచ్చిన ధాన్యంపై పడుకొని ధాన్యాన్ని అమ్ముకొని వెళ్తుంటారంటే పరిస్థితి ఎలాగుందో అర్థమవుతున్నది.
మార్కెట్‌కు రైతులు తెచ్చిన ధాన్యం వ్యాపారులు కొనుగోలు చేసిన తర్వాత మార్కెట్‌ను శుభ్రంగా ఉంచాలి. అందుకు మెయింటనెన్స్ చార్జీలు కోసం నిధులు మార్కెట్ నుంచి వినియోగించుకోవచ్చు. కానీ ఇక్కడి పాలకమండలి, అధికారులకు అవేవీ పట్టవు. మార్కెట్లో ఏ షెడ్డు వద్ద చూసినా మట్టి కుప్పలు దర్శనమిస్తాయి. వర్షం వచ్చినా, గాలి వీచినా మట్టి రైతులు ఆరబెట్టిన ధాన్యంలో కలుస్తున్నది. మార్కెట్లో వర్షం నీళ్లు నిల్వ లేకుండా చేసేందుకు కేసీఆర్ సర్కారు డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేసింది. నిర్వహణ లోపం కారణంగా డ్రైనేజీలు మట్టితో నిండిపోయాయి. చిన్నపాటి వర్షం కురిసినా వర్షపు నీరు మార్కెట్ ఆవరణలో నిలిచిపోతున్నది.
రైతులు మార్కెట్‌కు ధాన్యం తీసుకొచ్చే క్రమంలో వారి ధాన్యాన్ని కొనుగోలు చేసే వరకు విశ్రాంతి తీసుకోవడంతోపాటు భోజనం చేయడానికి మార్కెట్‌యార్డు ఆవరణలో భోజనశాల ఏర్పాటు చేశారు. అయితే అది మందుబాబులకు అడ్డాగా మారింది. రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని మాజీ మం త్రి హరీశ్‌రావు మార్కెట్‌యార్డు ఆవరణలో చల్లటి తాగునీటి కేంద్రాలు ఏర్పాటు చేయగా, నిర్వహణ లోపం కారణంగా రైతులకు తాగునీరు అందడం లేదు. దీంతో రైతులు తాగునీటి కోసం అవస్థలు పడాల్సిన దుస్థితి నెలకొన్నది.
మార్కెట్ యార్డు ఆవరణలో మార్కెట్‌కు వచ్చే వారి కోసం మరుగుదొడ్లు ఏర్పాటు చేశారు. నిర్వహణ లోపం కారణంగా తాళాలతో దర్శనిమిస్తున్నాయి. బీఆర్ఎస్ సర్కారులోనే మార్కెట్ అభివృద్ధి కోసం ప్రతిపాదనలు పంపగా, రూ.3కోట్ల 50లక్షలు మంజూరయ్యాయి. టెండర్ల ప్రక్రియ పూర్తయినప్పటికీ పనులు చేయకపోవడంతో నిధులు వెనక్కి వెళ్లినట్లు తెలిసింది.
గద్వాల వ్యవసాయ మార్కెట్‌కు ఆదాయం ఘనంగా.. అభివృద్ధి మాత్రం శూన్యంగా మారింది. 2023-2024 ఆర్థిక సంవత్సరంలో జిల్లా లక్ష్యం రూ.4కోట్ల 86లక్షలు కాగా, రూ.6కోట్ల 44లక్షల ఆదాయం వచ్చింది. 2024-2025 లక్ష్యం రూ.5కోట్ల 42లక్షలు కాగా, ఇప్పటి వరకు రూ.2కోట్ల 31లక్షల ఆదాయం వచ్చింది. జిల్లా పరిధిలో చెక్‌పోస్టులతోపాటు మార్కెట్‌కు వచ్చే పల్లి, వరి, పత్తి ద్వారా ఆదాయం సమకూరుతున్నది.
జిల్లా కేంద్రంలోని మార్కెట్లో సమస్యలున్న మాట వాస్తవమే. అయితే మార్కెట్లో వసతులు కల్పించడానికి గతంలో ప్రతిపాదనలు పంపించాం. నిధులు మంజూరయ్యాయి. టెండర్ ప్రక్రియ పూర్తయ్యింది. వచ్చిన నిధులతో మార్కెట్లో రైతులకు ప్యూరీఫైడ్ వాటర్ సౌకర్యంతోపాటు ప్రహరీ, సీసీ, డ్రైన్లు ఏర్పాటు చేస్తాం. రైతులకు సేదతీరడానికి ఏర్పాటు చేస్తాం. – పుష్పమ్మ, జిల్లా మార్కెటింగ్‌శాఖ అధికారిణి