అలంపూర్ చౌరస్తా, జూన్ 2 : వానకాలం సీజన్ మొదలవుతుంది.. రైతులందరూ నాణ్యమైన విత్తనాలను కొనుగోలు చేసి వ్యాపారుల నుంచి విధిగా రశీదులను స్వీకరించాలని ఎమ్మెల్యే విజయుడు సూచించారు. సోమవారం ఉండవెల్లి మండలం అలంపూర్ చౌరస్తాలో ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో ఉండవెల్లి, అలంపూర్ మండలాలకు చెందిన రైతులకు 10 కేజీల వరి విత్తనాలను ఎమ్మెల్యే విజయుడు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రామగ్రామాన నాణ్యమైన విత్తనం లాభసాటి వ్యవసాయానికి సోపానం అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తుందన్నారు.
పంటలు సాగు చేసే రైతు నకిలీ విత్తనాలు కొనుగోలు చేసి మోసపోవద్దని నాణ్యమైన విత్తనాలు కొనుగోలు చేసి అధిక దిగుబడి సాధించాలన్నారు. ప్రొఫెసర్ జయశంకర్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు వరి విత్తనాలు ఆర్ఎన్ఆర్ 15048 రకం అధిక దిగుబడి కోసం అభివృద్ధి చేశారని రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ శంకర్తోపాటు మండల వ్యవసాయాధికారులు, బీఆర్ఎస్ నాయకులు, రైతులు పాల్గొన్నారు.