భూత్పూర్, ఏప్రిల్ 10 : ఈనెల 27వ తేదీన బీఆర్ఎస్ తలపెట్టిన రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు భారీగా తరలిరావాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని అన్నాసాగర్‌లో గల తన నివాసంలో నియోజకవర్గ స్థాయిల కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు.
తెలంగాణ రాష్ట్ర సాధనే ధ్యేయంగా కేసీఆర్ టీఆర్ఎస్ పార్టీని స్థాపించి సకల జనులను చైతన్యం చేసి చావుదాకా వెళ్లి స్వరాష్ర్టాన్ని సాధించారని గుర్తుచేశారు. కొట్లాడి సాధించుకున్న తెలంగాణ రాష్ర్టాన్ని పదేండ్ల కేసీఆర్ పాలనలో దేశంలోనే నెంబర్‌వన్‌గా నిలిచిందని చెప్పారు. తాగు, సాగునీరు, రోడ్లు, తండాలను గ్రామ పంచాయతీలు చేయడం, ప్రజలు అడగని ఎన్నో పథకాలను తీసుకొచ్చి తెలంగాణను రోల్‌మాడల్‌గా తీర్చిదిద్దిన ఘనత కేసీఆర్‌కు దక్కుతుందన్నారు.
అన్నిరంగాల్లో అభివృద్ధి సాధించిన రాష్ర్టాన్ని కాంగ్రెస్ పార్టీ చేతగాని పాలనతో దివాలా తీయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. అమలుకు సాధ్యం కాని ఆరు గ్యారెంటీల దొంగ మాటలు చెప్పి నేడు వాటిని నెరవేర్చడం చేతగాక ప్రజలను మభ్యపెడుతూ కాలం వెల్లదీస్తున్నారని మండిపడ్డారు. రుణమాఫీ పూర్తికాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఏడాదిన్నర కావొస్తున్నా రైతుభరోసా ఒకే దఫా అది కూడా ఎవరికీ సరిగా రాలేదన్నారు. రైతులను రేవంత్‌రెడ్డి నట్టేట ముంచారని మండిపడ్డారు.
అభివృద్ధిని గాలికొదిలేసి కేసీఆర్, బీఆర్ నేతలపై కక్ష పూరిత చర్యలకు పాల్పడడం కాంగ్రెస్ అసమర్థ పాలనకు నిదర్శనమన్నారు. ఈ నెల 27వ తేదీన దేవరకద్ర నియోజకవర్గంలోని అన్ని మండలాలకు చెందిన వాహనాలు ఉదయం 9గంటలకు భూత్పూర్ చౌరస్తాకు రావాలని ఆయన కోరారు. ఈ సభ కాంగ్రెస్ పార్టీకి చెంపదెబ్బ కావాలని కోరారు. అనంతరం కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండలాల అధ్యక్షులు సత్తూర్ బస్వరాజ్‌గౌడ్, జెట్టి నర్సింహారెడ్డి, వామన్‌గౌడ్, శ్రీనివాస్‌రెడ్డి, రాముడు, బాలవర్ధన్‌గౌడ్, యాదగిరి, బీఆర్ఎస్ నాయకులు నారాయణగౌడ్, సత్యనారాయణ, రాజశేఖర్‌రెడ్డి, ఇంద్రయ్యసాగర్, గుంత మౌనిక, విశ్వేశ్వర్, శ్రీకాంత్‌యాదవ్ తదితరులు పాల్గొన్నారు.