భూత్పూర్, డిసెంబర్ 1 : స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు సత్తా చాటాలని మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి అన్నారు. సోమవారం మండలంలోని అన్నాసాగర్‌లో ఆయన నివాసంలో వివిధ మండలాల ముఖ్యనాయకులతో ప్రత్యేక సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయ న మాట్లాడుతూ బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ మద్దతుదారుల గెలుపు కోసం విశేషంగా కృషి చేయాలన్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలను తుంగలో తొక్కిన విధానాన్ని విస్తృతంగా ప్రచారం చేయాలని సూచించారు. ప్రభుత్వం మహిళలకు నెలకు ఇస్తామన్న రూ.2,500లు, దివ్యాంగులకు ఇస్తామన్న రూ.6వేల పింఛన్, కల్యాణలక్ష్మి రూ.లక్షతోపాటు తులం బంగారం హామీలను విస్మరించిన విషయాలను ప్రజలకు వివరించాలన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థుల గెలుపునకు పనిచేయాలని పిలుపునిచ్చారు.
అన్నాసాగర్‌లోని మాజీ ఎమ్మెల్యే ఆల నివాసంలో కౌకుంట్ల మండలం అప్పంపల్లి మాజీ ఉప సర్పంచ్, కాంగ్రెస్ నేత శివరాజ్‌తోపాటు కిష్టారెడ్డి, చంద్రశేఖర్‌రెడ్డి, శ్రీను, చిత్తనూరు నాగిరెడ్డి, గూరకొండ మో హన్‌రెడ్డి, రవీందర్‌రెడ్డి, గోపాల్‌రెడ్డి, శ్రీను, అంజితోపాటు బీజేపీ నేతలు లక్ష్మారెడ్డి, శ్రీనివాసులు, భాస్కర్‌రెడ్డి, గొల్ల బాలకృష్ణ, సాకలి సురేశ్, నర్సింహులు బీఆర్ఎస్లో చేరారు. సోమవారం పార్టీలో చేరిన వీరికి మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం మాట్లాడుతూ కొత్తవాళ్లు.. పాతవాళ్లు అన్న తేడా లేకుండా అందరూ బీఆర్ఎస్ మద్దతుదారుల విజయానికి కృషి చేయాలని కోరారు. ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతున్న నేపథ్యంలోనే పలువురు గులాబీ పార్టీలో చేరుతున్నారన్నారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ కౌకుంట్ల మండల అధ్యక్షుడు చందుగౌడ్, మాజీ ఎంపీపీ హర్షవర్ధన్‌రెడ్డి, మాజీ ఎంపీటీసీ మనోహర్‌రెడ్డి, రైతుబంధు మండల మాజీ అధ్యక్షుడు మన్యంగౌడ్ పాల్గొన్నారు.