మహబూబ్ నగర్, మార్చి 13 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): / మూసాపేట : మున్సిపల్ ఎన్నికలు కాగానే రైతు భరోసా పైసలు రైతుల ఖాతాలో వేస్తామని సాక్షాత్తు సీఎం ఇచ్చిన మాట ఎటు పో యిందని.. రైతు భరోసా పైసలు ఎందుకు ఇస్తలేరని దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి నిలదీశారు. శుక్రవారం దేవరకద్ర నియోజకవర్గం మూ సాపేట మండలకేంద్రంలో రైతాంగ సమస్యలు, ఇచ్చిన హామీల అమలు గాలికి వదిలేసిన కాంగ్రెస్ ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఒకరోజు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా రైతుల కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టి అమలు చేసిన ఘనత కేసిఆర్‌కే దక్కిందన్నారు.
రైతులకు సాగునీళ్లు, ఉచిత కరెంట్, పెట్టుబడి సాయం, రైతు బీమా వంటి పథకాలు ప్రవేశపెట్టి రైతులకు పూర్తిస్థాయిలో కేసీఆర్ ప్రభుత్వం భరోసా కల్పించిందన్నారు. కరోనా వంటి కష్టకాలంలో కూడా రైతులకు రైతు బంధు ఇచ్చామని ఆపత్కాలంలో ఆదుకున్నామని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కానీ హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చి రైతులను కష్టాల పాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. మున్సిపాలిటీ ఎన్నికల తరువాత రైతు భరోసా వేస్తామన్నారు.. ఆ తొమ్మిది వేల కోట్లు ఏమయ్యాయి.? అని ప్రశ్నించారు.
ఓట్లు అయిపోతే చెప్పిన మాటలు, హామీలు అన్ని మర్చిపోతారా? ఇదే నా మీరు తీసుకొచ్చిన ఇందిరమ్మ రాజ్యం అని నిలదీశారు. ఇప్పటికే కాంగ్రెస్ మూడు సార్లు రైతు భరోసా ఎగ్గొట్టిందని గుర్తు చేశారు. ఇందిరమ్మ రాజ్యంలో రైతుల కష్టాలు మొదలయ్యాయి.. కాంగ్రెస్ మళ్లీ పాత రోజులు తీసుకొచ్చిందని దోపిడీ చేయడం లక్ష్యంగా పెట్టుకుందని ఆరోపించారు.
కాంగ్రెస్ హయాంలో రైతుభరోసా, బోనస్, రైతు బీమా ఎగ్గొట్టారని గుర్తు చేశారు. సీఎం సొంత జిల్లాలో దురుద్దేశ్యంతో ప్రాజె క్టు పనులు పెండింగ్ పెట్టారు..రైతులను దగా చేస్తున్నారని విమర్శించారు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్ట్‌ను రెండేళ్లుగా పడావు పెట్టారని, సాగునీళ్లు ఇంకెప్పుడు ఇస్తారని నిలదీశారు. పన్నెండు స్థానాలు గెలిపిస్తే జిల్లా ప్రజలకు ఇచ్చింది ఏంటి? దగా, మోసం అని అన్నారు. ప్రజల్లో కాంగ్రెస్ చేస్తున్న మోసాలపై చర్చ జరగాలని రైతులకు విజ్ఞప్తి చేశారు. గ్రామాల్లో రైతులను ప్రజలను చైతన్యం చేయాల్సిన అవసరం ఉందన్నారు. హామీల అమలుపై ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొని రావాలనీ పిలుపునిచ్చారు.
గత అసెంబ్లీ ఎన్నికల ముందు కాంగ్రెస్ పార్టీ రైతులకు, ప్రజలకు ఇచ్చిన హామీలు గుర్తుచేసేందుకు మూసాపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన రైతు నిరసన దీక్ష విజయవంతమైంది. కార్యక్రమంలో దేవరకద్ర మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి, మండల నాయకులు, రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం వెంటనే రైతు భరోసాను ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేసే వరకు ఆందోళన విరమించబోయేది లేదని తేల్చి చెప్పారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు లక్ష్మీనరసింహ యాదవ్, మాజీ జెడ్పీటీసీ ఇంద్రయ్య సాగర్, సింగిల్ విండో చైర్మన్ బండా వెంకటేశ్వర రెడ్డి, సర్పంచులు రఘురాములు, రవికుమార్, రెడ్డి రాజు, రవి, నక్క ఆంజనేయులు, కొండయ్య, అనిల్ కుమార్‌రెడ్డి, బాలన్నలతో పాటు ఆయా గ్రామాల ముఖ్య నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.