హనుమకొండ, ఆగస్టు 14 : ఇప్పటికే నిధుల కొరతతో కొట్టుమిట్టాడుతున్న పంచాయతీలకు కరెంట్ షాక్ తగిలింది. విద్యుత్ బకాయిలు భారంగా మారాయి. 2026 జనవరి నుంచి జూలై వరకు గ్రామపంచాయతీల విద్యుత్ బిల్లులు చెల్లించాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు ఆదేశాలు జారీ చేయడంతో కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. సర్కారు నుంచి జీపీల అభివృద్ధికి రావాల్సిన రాష్ట్ర ఆర్థిక సంఘం(ఎస్ఎఫ్సీ) నిధులు మూడు, నాలుగేళ్లుగా ఇవ్వకుండా కరెంటు బిల్లులు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చికట్టాలని సర్పంచ్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే గ్రా మాల్లో అభివృద్ధి కుంటుపడిందని, కనీస వసతుల కల్పనకు సైతం డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 15వ ఆర్థిక సంఘం (కేంద్రం) నుంచి వస్తున్న నిధులతో పంచాయతీలను నెట్టుకొట్టుస్తున్నామని, ఇవి కూడా పారిశుధ్యం, తాగునీటి సరఫరా, వీధి దీపా లు, క్లోరినేషన్, కార్మికుల వేతనాలు, ట్రాక్టర్ల ఈఎంఐలకే సరిపోవడం లేదని వాపోతున్నారు. చిన్న గ్రామపంచాయతీల పరిస్థితి మరీ అధ్వానంగా ఉందని, సిబ్బందికి కూడా వేతనాలు ఇవ్వలేని పరిస్థితిలో ఉంటే రూ. లక్షల బిల్లులు చెల్లించడం ఎలా సాధ్యమని సర్పంచ్లు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం ఎస్ఎఫ్సీ నిధులు విడుదల చేయాలని లేదా బిల్లుల చెల్లింపున కు ప్రత్యేకంగా నిధులు కేటాయించాలని సర్పంచ్లు డిమాండ్ చేస్తున్నారు.
హనుమకొండ జిల్లాలోని 210 గ్రామపంచాయతీల పరిధిలో 2026 జనవరి నెల నుంచి జూలై వరకు మొత్తం రూ. 32,06,89,573లు బకాయిలు పేరుకుపోయాయి. ఇందులో ఇటీవల రూ. 3,19,86,262 చెల్లించగా, రూ. 28,87,03,311 పెండింగ్ ఉన్నాయి. అయితే కేసీఆర్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి సమృద్ధిగా మిషన్ భగీరథ తాగునీరు సరఫరా అయ్యేదని, ప్రస్తుతం సరిగా కాక బోర్లకు మోటర్లు ఏర్పాటు చేయాల్సి వస్తుందని, తద్వారా బిల్లులు సైతం ఎక్కవగా వస్తున్నట్లు పలువురు సర్పంచ్లు చెబుతున్నారు.
గ్రామపంచాయతీల కరెంటు బకాయిలు చెల్లించాలని ఒత్తిడి తేవడం అన్యాయం. ఇప్పటికే నిధుల కొరతతో పంచాయతీల నిర్వహణ భారంగా మారింది. ఎస్ఎఫ్సీ నిధులు గత మూడు, నాలుగేండ్లుగా రావడం లేదు. 15వ ఆర్థిక సంఘం నిధులతోనే గ్రామాల్లో పారిశుధ్యం, వీధి దీపాలు, వేతనాలు, ఇతరత్రాలకు వినియోగిస్తున్నాం. తాజాగా 15 శాతం కరెంటు బిల్లులు చెల్లించాలని ఒత్తిడి తేవడంతో రూ. 3లక్షల వరకు కట్టాం.
– గడ్డం రఘు వంశీగౌడ్, ఐనవోలు సర్పంచ్