సిటీబ్యూరో, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): నకిలీ పోలీసులు ఓ వృద్ధుడిని డిజిటల్ అరెస్ట్ చేసి రూ. 15.25 లక్షలు కాజేశారు. సరూర్‌నగర్‌కు చెందిన బాధితుడికి తాను ముంబై బాద్రా పోలీస్‌స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ను మాట్లాడుతున్నానంటూ ఒక వ్యక్తి ఫోన్ చేశాడు. మీపై ముంబైలో కేసు నమోదైందని మీ బ్యాంకు ఖాతాల వివరాలు ఇవ్వాలంటూ సూచించాడు. లేదంటే మిమ్మల్ని వెంటనే అరెస్ట్ చేయాల్సి ఉంటుందని, మీపై వచ్చిన ఆరోపణలు నిజమో కాదో తేలే దాకా మీ ఖాతాల్లోని డబ్బంతా తమ ఆధీనంలో ఉంటుందంటూ బెదిరించారు.
ఇదంతా న్యాయస్థానం పర్యవేక్షణలో ఉంటుందంటూ బెదిరిస్తూ, మీరు మేం చెప్పినట్లు చేయకపోతే అరెస్ట్ వారెంట్ జారీ అవుతుందంటూ భయపెట్టించారు. బాధితుడు తన ఖాతాలో ఉన్న రూ. 15.25 లక్షలు సైబర్‌నేరగాళ్లు సూచించిన ఖాతాలోకి బదిలీ చేశారు. మరిన్ని డబ్బులు పంపించాలంటూ పలు దఫాలుగా నేరగాళ్లు ఫోన్లు చేస్తుండడంతో తెలిసిన వారితో ఈ విషయాన్ని చెప్పడంతో ఇదంతా మోసమని చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.