ఇటు సింగరేణి పవర్ ప్లాంట్ నుంచి అటు కొత్తగూడెం పవర్ స్టేషన్ వరకు ఇటు యాదాద్రి నుంచి అటు భద్రాద్రి వరకు థర్మల్ పవర్‌స్టేషన్ల వద్ద బీఆర్ఎస్ ధర్మాగ్రహానికి దిగింది. కాంగ్రెస్ పాలనలో కరెంటు సంక్షోభాన్ని నిరసిస్తూ పవర్ ప్లాంట్ల బాటపట్టింది. తగ్గిన బొగ్గు నిల్వలు, పడిపోయిన ఉత్పత్తి, ఊరూరా కరెంటు కోతలకు నిరసనగా బీఆర్ఎస్ నాయకత్వం ఇచ్చిన పిలుపునందుకొని గులాబీ శ్రేణులు కదం తొక్కాయి. పలుచోట్ల ప్లాంట్ల వద్దకు రాకుండా ప్రభుత్వం పోలీసులను ప్రయోగించింది. ఉమ్మడి వరంగల్ జిల్లాలో ముందస్తు అరెస్టులకు దిగింది.
నమస్తే నెట్వర్క్, సెప్టెంబర్ 24: కరెంట్ కోతలపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. పార్టీ అధిష్ఠానం పిలుపు మేరకు అన్ని జిల్లాల్లోని విద్యుత్తు ప్లాంట్లను బీఆర్ఎస్ ముఖ్యనేతలతో కలిసి శ్రేణులు, రైతులు సందర్శించారు. ఆయా చోట్ల నేతలను పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. సింగరేణి బొగ్గును ఇతర రాష్ర్టాలకు సరఫరా చేయడం కారణంగానే ప్లాంట్లలో బొగ్గు నిల్వలు లేవని, దీంతోనే విద్యుత్తు ఉత్పత్తి తక్కువగా జరుగుతున్నదని ఆయా చోట్ల బీఆర్ఎస్ నేతలు తెలిపారు.
గత ప్రభుత్వ హయాంలో 24 గంటల నాణ్యమైన కరెంట్ సరఫరా జరిగిందని, ప్రస్తుత ప్రభుత్వం ఆరు గంటలు కూడా సరఫరా చేయడం లేదని మండిపడ్డారు. మొత్తంగా కాంగ్రెస్ సర్కార్ వైఫల్యమే విద్యుదుత్పత్తి తగ్గడానికి ప్రధాన కారణమని తెలిపారు. సింగరేణిలో అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ తెరలేపిందని ఆరోపించారు. బీఆర్ఎస్ ఫ్యాక్ట్ పైండింగ్ కమిటీ బాధ్యులు హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అధికారుల వైఖరిపై ఆగ్రహం వ్యక్తంచేస్తూ మాజీ మంత్రి తాటిపర్తి జీవన్‌రెడ్డి, కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, విప్ కేపీ వివేకానంద, ఎమ్మెల్సీలు దాసోజు శ్రవణ్, శంభీపూర్ రాజు, మాజీ ఎమ్మెల్యే దివాకర్‌రావు, టీజీబీకేఎస్ అధ్యక్షుడు మిర్యాల రాజిరెడ్డి తదితర నేతలు సింగరేణి ప్రధాన కార్యాలయం వద్ద నిరసన తెలిపారు.
మంచిర్యాల జిల్లా జైపూర్‌లో ఉన్న ఎస్టీపీపీ వద్దకు ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ ఆధ్వర్యంలో నేతలు సందర్శించారు. మాజీ మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యేలు కోవ లక్ష్మి, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, కోనేరు కోనప్ప, ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి జాన్సన్ నాయక్, సీనియర్ నాయకుడు కౌశిక్‌హరి, జడ్పీ మాజీ వైస్ చైర్మన్ మూల రాజిరెడ్డి, తదితరులు ఉన్నారు.
కేవలం పది మందిని మాత్రం లోపలికి అనుమతించారు. నల్లగొండ జిల్లా దామరచర్ల మండలంలోని యదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్‌ను మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని ఎమ్మెల్సీ ఎంసీ కోటిరెడ్డి, మాజీ ఎంపీ బడుగుల, మాజీ ఎమ్మెల్యేలు నల్లమోతు భాస్కర్‌రావు, గొంగిడి సునీతామహేందర్‌రెడ్డి, రమావత్ రవీంద్రకుమార్, గాదరి కిశోర్‌కుమార్, చిరుమర్తి లింగయ్య, కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, కంచర్ల భూపాల్‌రెడ్డి, నోముల భగత్‌కుమార్, తిప్పన విజయసింహారెడ్డి, కార్పొరేషన్ మాజీ చైర్మన్లు రాంచందర్‌నాయక్, పల్లె రవికుమార్‌గౌడ్, పార్టీ రాష్ట్ర నేతల ఒంటెద్దు నర్సింహారెడ్డి, గుజ్జ యుగేందర్‌రావు, చింతల వెంకటేశ్వర్‌రెడ్డి, వెంకటనారాయణగౌడ్ తదితరులు సందర్శించారు.
ప్లాంట్ ముందే వీరిని అడ్డుకున్న పోలీసులు పలువురిని మాత్రమే లోనికి అనుమతించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని పాల్వంచ కేటీపీఎస్కు వెళ్లేందుకు ఎంపీ వద్దిరాజు రవిచంద్ర ఆధ్వర్యంలో మాజీ మంత్రి వనమా వెంకటేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, బీఆర్ఎస్ శ్రేణులు గురువారం యత్నించగా పోలీసులు, ఎస్పీఎఫ్ సిబ్బంది గేటు వద్ద అడ్డుకున్నారు. భద్రాద్రి జిల్లా మణుగూరులోని భద్రాద్రి థర్మల్ పవర్‌స్టేషన్ (బీటీపీఎస్)లోకి వెళ్లేందుకు మాజీ మంత్రి అజయ్‌కుమార్, పినపాక మాజీ ఎమ్మెల్యే రేగా కాంతారావుతోపాటు బీఆర్ఎస్ నాయకులు ప్రయత్నించారు. పోలీసులు అడ్డుకోవడంతో నేతలు గేటు ఎదుట బైఠాయించారు.
జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని కాకతీయ థర్మల్ పవర్ ప్రాజెక్టు (కేటీపీపీ)నిమాజీ ఎమ్మెల్యే గండ్ర వెంకటరమణారెడ్డి ఆధ్వర్యంలో మాజీ మంత్రి ఎర్రబెల్లి, బీఆర్ఎస్ నేతలు సందర్శించారు. మాజీ మంత్రి సత్యవతిరాథోడ్, ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు తాటికొండ రమేశ్, అరూరి రమేశ్, శంకర్‌నాయక్, బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఇన్చార్జి బడే నాగజ్యోతి, జిల్లా అధ్యక్షుడు కాకులమర్రి లక్ష్మణ్‌రావు తదితరులున్నారు. కేటీపీపీ సందర్శనకు వెళ్తారనే నెపంతో పలువురు నాయకులను పోలీసులు ముందస్తుగా అరెస్ట్ చేశారు.
కాంగ్రెస్ సర్కార్ తీరుతోనే కరెంట్ లేక ప్రజలు చీకట్లలో బతుకుతున్నారని మాజీ మంత్రి, సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. వైటీపీఎస్ వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్ని కేసులు పెట్టినా వేధింపులకు గురి చేసినా ప్రజల తరఫున ఎలాంటి త్యాగాలకైనా సిద్ధమని స్పష్టంచేశారు. రాష్ట్రంలో నాణ్యమైన బొగ్గు సరఫరాకు సింగరేణి సిద్ధంగా ఉన్నదని, అందుకు అన్ని ఆధారాలు తమ వద్ద ఉన్నాయని చెప్పారు. సింగరేణి బొగ్గును తన గురువు సీఎం అయిన ఏపీకి, తన దోస్తు సీఎం అయిన కర్ణాటకకు రేవంత్‌రెడ్డి అమ్ముకుంటున్నారని విమర్శించారు.

నాణ్యమైన సింగరేణి బొగ్గును తెలంగాణకు ఇవ్వకపోవడం వల్లనే కరెంటు ఉత్పత్తి కుంటుపడుతున్నదని ఆరోపించారు. రాష్ట్రంలో కరెంటు ఉత్పత్తికి అన్ని ప్లాంట్లు సిద్దంగా ఉన్నా, ప్రభుత్వమే సిద్ధంగా లేదని ఎద్దేవా చేశారు. యాదాద్రి థర్మల్ పవర్ ప్లాంట్ నాలుగు వేల మెగావాట్ల సామర్థ్యంతో దేశంలోనే అతి పెద్దదని, కేసీఆర్ ముందు చూపుతో దీన్ని అత్యాధునిక టెక్నాలజీతో నిర్మించారని వివరించారు.
రాష్ర్టానికి సరిపడా కరెంట్ ఉత్పత్తి చేయని రేవంత్‌రెడ్డి వెంటనే సీఎం పదవికి రాజీనామా చేయాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. కేటీపీపీ వద్ద ఆయన మాట్లాడుతూ సీఎంకు సిగ్గు, శరం ఉంటే యాసంగి పంటలకైనా 24 గంటల కరెంటు ఇచ్చి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు.

సింగరేణికి ఇవ్వాల్సిన రూ.52 వేలకోట్ల బకాయిలు వెంటనే చెల్లించి, రైతన్నలకు సరిపడా విద్యుత్ ఉత్పత్తి చేయాలని డిమాండ్ చేశారు. బొగ్గు నిల్వలు తక్కువగా ఉన్న కారణంగానే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని అధికారులు చెబుతున్నారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ రెండున్నరేండ్ల పాలనలో కరెంటు కోతలతో రైతులు, ప్రజలు ఆగం అవుతున్నారని ప్రభుత్వ మాజీ విప్, బీఆర్ఎస్ పార్టీ మంచిర్యాల జిల్లా అధ్యక్షుడు బాల్క సుమన్ మండిపడ్డారు. ఎస్టీపీపీ వద్ద ఆయన మాట్లాడుతూ బొగ్గు అందుబాటులో లేని కారణంగానే ఎస్టీపీపీలో విద్యుత్తు ఉత్పత్తి జరుగడం లేదని పేర్కొన్నారు. సింగరేణిలో అనేక కుంభకోణాలకు కాంగ్రెస్ సర్కార్ తెరలేపిందని ఆరోపించారు.

పీఎం నరేంద్రమోదీ, సీఎం రేవంత్‌రెడ్డి, కేంద్ర బొగ్గుగనులశాఖ మంత్రి కిషన్‌రెడ్డి ముగ్గురు కుమ్మకై సింగరేణి సంస్థను బొందపెట్టే కుట్ర చేస్తున్నారని మండిపడ్డారు. తమ పర్యటనపై మంత్రి వివేక్ వెంకటస్వామి చేసిన వ్యాఖ్యలపై స్పందిస్తూ.. ఏ గ్రామంలోనైనా రైతు వ్యవసాయానికి 24 గంటల కరెంట్ వస్తున్నదని చెబితే రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్ విసిరారు. తన కుటుంబానికి పదవులు రాగానే ప్రజా సమస్యలను మర్చిపోతారా అంటూ ప్రశ్నించారు.
రాష్ట్రంలో కరెంటు కష్టాలకు కాంగ్రెస్ పాపాలే కారణమని మాజీ మంత్రి పువ్వాడ అజయ్‌కుమార్ విమర్శించారు. బీటీపీఎస్ వద్ద ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాకే కరెంటు కష్టాలు మొదలయ్యాయని ఆరోపించారు. జెన్కోకు నాసిరకం బొగ్గు సరఫరా చేయడం వల్ల విద్యుత్ ఉత్పత్తికి విఘాతం కలుగుతున్నదని మండిపడ్డారు.

బీటీపీఎస్‌లోని నాలుగు యూనిట్లలో రెండింటిలో విద్యుత్ ఉత్పత్తి ఎందుకు జరుగడంలేదని ప్రశ్నించారు. జరిగే నష్టాన్ని ప్రభుత్వం ఏ రకంగా పూడ్చగలుగుతుందో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
కరెంట్ కోతలపై కాంగ్రెస్ కుట్రలను బహిర్గతం చేస్తామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. హైదరాబాద్‌లోని సింగరేణి ప్రధాన కార్యాలయం ఎదుట ధర్నా అనంతరం మాట్లాడుతూ థర్మల్ ప్లాంట్లకు సింగరేణి సరిపడా బొగ్గు సరఫరా చేయకపోవడంతోనే కరెంట్ ఉత్పత్తి గణనీయంగా పడిపోయిందని ధ్వజమెత్తారు. కేసీఆర్ పాలనలో 72 లక్షల టన్నులు ఉన్న బొగ్గు ఉత్పత్తి కాంగ్రెస్ వచ్చిన తర్వాత 58 లక్షల టన్నులకు పడిపోయిందని ఆరోపించారు.

ఇది ముమ్మాటికీ రేవంత్ సర్కార్ వైఫల్యమేనని మండిపడ్డారు. గతంలో 24 గంటల ఉచిత విద్యుత్ ఇచ్చిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానికే దక్కిందని గుర్తుచేశారు. కానీ ఇప్పుడు కనీసం ఆరు గంటల కరెంట్ కూడా ఇచ్చే పరిస్థితిలేదని వాపోయారు. కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, రాష్ట్రంలో నెలకొన్న కరెంట్ సంక్షోభాన్ని రాష్ట్ర ప్రజలకు విడమరచి చెప్పేందుకే బీఆర్ఎస్ ఆధ్వర్యంలో పవర్‌స్టేషన్ల సందర్శన, నిరసన కార్యక్రమాలకు పూనుకున్నామని స్పష్టంచేశారు.