దండేపల్లి, ఆగస్టు 14 : ప్రభుత్వానికి అందించాల్సిన కస్టమ్ మిల్లింగ్ బియ్యాన్ని అక్రమంగా దారి మళ్లించి, బ్లాక్ మార్కెట్లో విక్రయించి ఆర్థిక లాభాలు పొందినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న రైస్ మిల్లర్ గంప సంతోశ్కుమార్పై బ్లాక్ మార్కెటింగ్ నిరోధక, నిత్యావసర వస్తువుల సరఫరా పరిరక్షణ చట్టం కింద పీడీ యాక్ట్ ఉత్తర్వులు జారీ చేసినట్లు రామగుండం సీపీ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. శుక్రవారం సదరు ఉత్తర్వులను లక్షెట్టిపేట సీఐ రమణమూర్తి, దండేపల్లి ఎస్ఐ రా జవర్ధన్ సబ్‌జైలులో ఉన్న నిందితుడికి అధికారు ల సమక్షంలో అందజేసి, చర్లపెల్లి జైలుకు తరలించారు. వివరాలిలా.. గంప సంతోశ్‌కుమార్ దండేపల్లి మండలం లింగాపూర్‌లో రామలక్ష్మణ్ రైస్‌మిల్లులో మేనేజింగ్ పార్ట్నర్గా ఉన్నారు. ప్రభుత్వంతో కుదుర్చుకున్న కస్టమ్ మిల్లింగ్ ఒప్పందాల ప్రకారం రబీ 2022-23, రబీ 2024-25 సీజన్లలో మొత్తం 9,244.206 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మిల్లింగ్ కోసం పొందారు.
ఈ ధాన్యానికి సంబంధించి ప్రభుత్వానికి 6,286.059 మెట్రిక్ టన్నుల కస్టమ్ మిల్లింగ్ రైస్(సీఎంఆర్) అందించాల్సి ఉండగా, ఇప్పటి వరకూ 1,833.511 మెట్రిక్ టన్నులు మాత్రమే అందించినట్లు అధికారులు గుర్తించారు. ఇంకా 4,452.548 మెట్రిక్ టన్నుల సీఎంఆర్ అందించాల్సి ఉందని, దానికి సమానమైన సుమారు 6,170.643 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని దారి మళ్లించినట్లు కేసు దర్యాప్తులో తేలిందన్నారు. ఈ అక్రమాల వల్ల ప్రభుత్వానికి రూ.15.14 కోట్లకు పైగా నష్టం వాటిల్లినట్లు పౌరసరఫరాల శాఖాధికారులు తెలిపారు. గత సీజన్లకు సంబంధించిన సీఎంఆర్ బకాయిలను కలుపుకొని రూ.15,70,36,726గా నిర్ధారించినట్లు తెలిపారు.
గంప సంతోశ్కుమార్పై ప్రభుత్వ ధాన్యం దారి మళ్లింపునకు సంబంధించి 2025,26లో మరో రెండు కేసులు దండేపల్లి, హాజీపూర్‌లో నమోదు అయ్యాయన్నారు. గతంలో నిందితుడిపై కేసులు నమోదు అయినప్పటికీ అక్రమ కార్యకలాపాలు కొనసాగించారన్నారు. దండేపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన కేసులో నిందితుడు రిమాండ్‌లో ఉన్నాడని, బెయిల్‌పై విడుదలైతే మళ్లీ ఇదే తరహా అక్రమాలకు పాల్పడే అవకాశం ఉందని దర్యాప్తు అధికారులు నివేదించిన నేపథ్యంలో పీడీ యాక్ట్ కింద నిర్బంధ ఉత్తర్వులు జారీ చేసినట్లు సీపీ తెలిపారు.