హుస్నాబాద్, ఆగస్టు 14: సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రాంతంలో విషజ్వరాలు విజృంభిస్తున్నాయి. జ్వరాల బారినపడ్డ జనాలు దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు. ప్రతి ఇంటిలో ఒకరు జ్వరంతో బాధపడుతున్నారు. వర్షాకాలం కావడంతో దోమల బెడద అధికమై ఈప్రాంత ప్రజలు వ్యాధుల బారినపడుతున్నారు. జ్వరంతో హుస్నాబాద్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో గురువారం చికిత్స కోసం వచ్చిన 35 మందిలో ఒకే రోజు ముగ్గురికి డెంగీ పాజిటివ్ రావడం ప్రజలను ఆందోళనకు గురిచేస్తోంది. పదిరోజుల క్రితం ఓ బాలికకు కూడాడెంగీ పాజిటివ్ వచ్చింది.
హుస్నాబాద్ దవాఖానలో 10రోజుల వ్యవధిలో నాలుగు డెంగీ కేసులు నమోదుకావడం గమనార్హం. నిత్యం 30నుంచి 40మంది రోగులు జ్వరంతో దవాఖానలో ఇన్పేషెంట్లుగా చేరుతున్నారు. రోజురోజుకూ జ్వరాల బారిన పడినవారి సంఖ్య పెరుగుతున్నదని, వీటికి అడ్డుకట్ట వేసేందుకు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వైద్యులు చెబుతున్నారు. హుస్నాబాద్ పట్టణంలోనే కాకుండా మండలంలోని గ్రామాలు, అక్కన్నపేట, కోహెడ, బెజ్జంకి మండలాల్లోనూ విషజ్వరాలు రోజురోజుకు పెరుగుతున్నాయి.
హుస్నాబాద్ పట్టణంతో పాటు గ్రామాల్లోనూ పారిశుధ్యంపై అవగాహన కార్యక్రమాలు తరచూ చేపడుతున్నప్పటికీ అవి పూర్తి స్థాయిలో ప్రజల్లోకి చేరడం లేదనే విమర్శలు ఉన్నాయి. పట్టణంలోని ప్రతి వార్డులో ప్రత్యేక బృందాలతో అవగాహన కార్యక్రమాలు చేపట్టాల్సి ఉంది. వర్షపు నీరు నిల్వ ఉండకుండా చూడటం, మురుగు కాల్వలను ఎప్పటికప్పుడు శుభ్రం చేయడం, వర్షానికి పెరుగుతున్న పిచ్చిమొక్కలు, చెట్లను తొలిగించడం లాంటి కార్యక్రమాలు చేపట్టడంలో పూర్తిగా విఫలమవుతున్నారని చెప్పొచ్చు. దోమల నివారణకు కావాల్సిన చర్యలు చేపట్టడంలోనూ అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు. దీంతో దోమలు వృద్ధి చెంది జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇప్పటికైనా సరైన చర్యలు చేపట్టి జ్వరాలు, ఇతర వ్యాధులను నియంత్రించాలని ప్రజలు కోరుతున్నారు.
వర్షాకాలం సీజన్లో పరిసరాలను ఎప్పటికప్పుడు పరిశుభ్రంగా ఉంచుకోవడంతో పాటు వ్యక్తిగత పరిశుభ్రత పాటిస్తే జ్వరం, అంటువ్యాధులను నివారించవచ్చు. ఇటీవల డెంగీ కేసులు నమోదవుతున్నందున దోమల నివారణపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఇంటి పరిసరాల్లో ఎక్కువ రోజులు నీళ్లు నిల్వ ఉండకుండా, చెత్తాచెదారం లేకుండా చూసుకోవాలి. జ్వరం వచ్చినట్లు అనిపిస్తే వెంటనే దవాఖానకు వెళ్లి చికిత్స చేయించుకోవాలి. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ దవాఖానలో అన్నిరకాల వైద్యసేవలు అందుతున్నందున ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి.
– డాక్టర్ రమేశ్‌రెడ్డి, సూపరింటెండెంట్, సామాజిక ఆరోగ్య కేంద్రం, హుస్నాబాద్ (సిద్దిపేట జిల్లా)