మంచిర్యాలటౌన్, ఆగస్టు 14 : కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాలను అమలు చేయకపోవడాన్ని నిరసిస్తూ శుక్రవారం మంచిర్యాల నుంచి హాజీపూర్ వరకూ జాతీయ బీసీ హక్కుల పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు గుమ్ముల శ్రీనివాస్ సైకిల్‌యాత్ర చేపట్టారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రచారంలో భాగంగా కామారెడ్డిలో జరిగిన బీసీ డిక్లరేషన్ సభలో అధికారంలోకి రాగానే స్థానిక సంస్థల రిజర్వేషన్లు 42 శాతం పెంచడంతో పాటు వాటిని ఏ, బీ, సీ,డీ గ్రూపులుగా వర్గీకరిస్తామని హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండున్నరేళ్లు గడిచినా ఆ విషయంపై ప్రస్తావించడం లేదని మండిపడ్డారు.
ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టిన బీసీ అంశాల్లో మొదటి అసెంబ్లీ సెషన్లోనే చట్టబద్ధతతో కూడిన మహత్మా జ్యోతిరావు పూలే పేరుతో బీసీ సబ్‌ప్లాన్ ఏర్పాటు చేస్తామని, ప్రభుత్వ సివిల్ కాంట్రాక్టు మెయింటెనెన్స్లలో 42 శాతం రిజర్వేషన్ కల్పిస్తామ ని, బీసీ విద్యార్థుల ఉన్నత విద్యకు ఎలాంటి పూచీకత్తు లేకుండా రూ. 10 లక్షల రుణం అందిస్తామని, అన్ని జిల్లా కేంద్రాలలో రూ. 50 కోట్లతో బీసీ భవనాలు, అందులోనే లైబ్రరీని, స్టడీసర్కిల్‌ను ఏర్పాటుచేస్తామని, బీసీల సంక్షేమానికి ఐదేళ్లలో రూ. లక్ష కోట్ల బడ్జెట్ కేటాయిస్తామని, జనగామ జిల్లాకు సర్ధార్సర్వాయి పాపన్నగౌడ్ పేరు పెడతామని, ఇలా అనేక హామీలు ఉన్నాయన్నారు. ఇప్పటికైనా హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ నాయకులు మహేశ్వర్మ, పడాల శివతేజ, భీమిని రమేశ్, మహ్మద్ లతీఫ్, మంచర్ల సదానందం, తంగళ్లపల్లి బాపు, సూరయ్య, వేముల కిరణ్, కీర్తి భిక్షపతి, కొట్టె నటేశ్వర్ పాల్గొన్నారు.